ప్రశ్నిస్తున్న బ్రిటన్ పోలీసులు
ఫెయిర్‌ఫోర్డ్ : ఇరాన్‌పై దాడుల కోసం బ్రిటన్‌లో అమెరికా ఉపయోగించే ఓ వైమానిక స్థావరం సమీపంలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు పేలుడు పదార్థాలు, ఉగ్రవాద నేరాల అనుమానంతో వారిని సోమవారం ప్రశ్నించారు. పశ్చిమ ఇంగ్లండ్‌లోని ఆర్‌ఏఎఫ్ ఫెయిర్‌ఫోర్డ్ సైనిక వైమానిక స్థావరం వైపుగా మూడు పెద్ద తెల్లని వాహనాలు వెళుతున్నాయంటూ అందిన సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున అధికారులు ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ స్థావరాన్ని అమెరికా బాంబర్లు ఉపయోగిస్తున్న కారణంగా అది తమకు చట్టబద్ధమైన లక్ష్యమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ఇదివరకే ప్రకటించింది. కాగా నిందితులు భారీ నష్టానికి కుట్ర పన్నారని, వారిని బ్రిటన్, అమెరికా అధికారులు విచారిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చెప్పారు.
అనుమానితుల గురించి బ్రిటన్ ఉగ్రవాద నిరోధక డిటెక్టివ్‌లు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇరాన్‌పై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పాటు ఇది రష్యా విధ్వంసక చర్య లేదా ఇస్లామిస్ట్ కుట్ర అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్న అధికారులు ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు ఇప్పటి వరకూ పెద్దగా సమాచారాన్ని విడుదల చేయలేదు. ట్రంప్ అనుమానిస్తున్న స్థాయిలో ఆ వ్యక్తులు నిఘా నీడలో ఉన్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మాస్కులు ధరించిన వ్యక్తులు పొలాలలోకి పరిగెత్తడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చానని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రైతు చెప్పారు. అయితే ఆ రైతు వద్ద కేవలం పాక్షిక సమాచారం మాత్రమే ఉన్నదని, దర్యాప్తు జరుగుతున్న సమయంలో తానేమీ ఊహాగానాలు చేయబోనని బ్రిటన్ రక్షణ మంత్రి వెన్ స్ట్రీటింగ్ తెలిపారు. 'ఇరాన్, దాని ప్రాక్సీలుహాని కలిగించాలని చూస్తుంటారని మాకు తెలుసు. వారు మా ప్రజాస్వామ్యాన్ని అసహ్యించుకుంటారు. మా ప్రయోజనాలకు, మా మిత్రుల ప్రయోజనాలకు హాని కలిగించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను మేము వమ్ము చేస్తుంటాం' అని అన్నారు.
తాజా ఘటన నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ ఆదివారం తన లేబర్ పార్టీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఫెయిర్‌ఫోర్డ్‌లో వైమానిక స్థావరం చుట్టూ పోలీసులు 400 మీటర్ల కారిడార్‌ను ఏర్పాటు చేశారు. పరిసరాలలోని 85 గృహాలలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. స్థావరం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలను బట్టి అరెస్ట్ తర్వాత కొందరు నిందితుల ఒంటిపై చొక్కాలు కన్పించలేదు.
అమెరికా వైమానిక స్థావరం వద్ద ఐదుగురి అరెస్ట్
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)