రైతు నేస్తం కార్యక్రమంలో ఏడీఏ కృష్ణ
నవతెలంగాణ-జన్నారం/ దండేపల్లి
రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు ఆధునిక సాగు విధానాలపై అవగాహన పెంచుకుని, శాస్త్రీయ పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాఖ ఏడీఏ కృష్ణ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో వినియోగించుకోవడం ద్వారా పెట్టుబడి ఖర్చులను తగ్గించడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. దండేపల్లి మండలం గూడెం రైతువేదికలో శనివారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి ఏడీఏ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సేవలు, రైతుల నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
ఫార్మర్ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోవాలి
ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో తన పేరు నమోదు చేసుకోవాలని ఏడీఏ సూచించారు. రైతుల వివరాలు వ్యవసాయ శాఖ రికార్డుల్లో సక్రమంగా నమోదై ఉండటం వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వ్యవసాయ సేవలు రైతులకు సులభంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు తమ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని సూచించారు.
శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు
ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు కూడా తమ సాగు విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేల స్వభావాన్ని తెలుసుకుని పంటలను ఎంపిక చేసుకోవడం, అవసరమైన మేరకే ఎరువులు, పురుగుమందులు వినియోగించడం, నీటిని పొదుపుగా ఉపయోగించడం వంటి శాస్త్రీయ పద్ధతులను పాటించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్న సూచనలు, సలహాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అధికారుల సూచనలు పాటించాలి
పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువస్తే సాంకేతిక సలహాలు అందిస్తామని ఏడీఏ కృష్ణ తెలిపారు. పంటలలో తెగుళ్లు, చీడపీడలు కనిపించినప్పుడు విచక్షణారహితంగా మందులు పిచికారీ చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. పంటల దిగుబడి, నాణ్యత పెంచేందుకు సమగ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీకాంత్, ఏఈవోలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రైతులు తమ వ్యవసాయ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పలు అంశాలపై సూచనలు, సలహాలు పొందారు.







కామెంట్‌లు (0)