Magazines

కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో నేచర్ వాక్

1 గంట క్రితం

Forest
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ప్రకృతిపై అవగాహన..

 నవతెలంగాణ-జన్నారం

జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణి వారోత్సవాలు  ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రకృతి ప్రేమికులతో కలిసి ‘నేచర్ వాక్’ నిర్వహించారు. జన్నారం అటవీ ప్రాంతంలోని గోండుగూడ సఫారీ గేట్ నుంచి బైసన్ కుంట వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర సాగిన నడకలో అటవీ అధికారులు అడవిలోని జీవ వైవిధ్యం, వివిధ రకాల వృక్షాలు, వన్యప్రాణులు, పక్షుల గురించి వివరించారు. టేకు, నల్లమద్ది, బట్టకడిమి, తెల్లతుమ్మ, సండ్ర, ఇరికి, బూరుగు తదితర చెట్లను చూపిస్తూ వాటి ప్రాధాన్యత, ఉపయోగాలను వివరించారు.


 అలాగే ఇంధన్ పళ్లి రేంజ్ పరిధిలోని అడవులలో బర్డ్ వాక్ నిర్వహించారు, శాతవాహన కళాశాల విద్యార్థులు వారి కెమెరాలలో వివిధ రకాలైన పక్షులను బంధించుకున్నారు. ఎఫ్డిఓ రామ్మోహన్ అడవులు పక్షులు జంతువులపై విద్యార్థులకు వివరించారు. ఎండిన చెట్లకూ పర్యావరణంలో ప్రత్యేక పాత్ర

అటవీ ఆవరణ వ్యవస్థలో ఎండిన చెట్ల ప్రాధాన్యతను అధికారులు వివరించారు. ఎండిన చెట్లు క్రిమి కీటకాలు, సరీసృపాలు, పక్షులకు ఆవాసాలుగా ఎలా ఉపయోగపడుతున్నాయో తెలియజేశారు. అడవుల్లో గడ్డి భూములు, నీటి కుంటలు, సౌరశక్తితో నడిచే గొట్టపు బావుల ఆవశ్యకత, వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు.


పక్షులను ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు

నేచర్ వాక్ సందర్భంగా గ్రే హార్న్‌బిల్, రోజ్ రింగ్‌డ్ పారాకీట్, ప్లమ్ హెడ్‌డ్ పారాకీట్, కాలర్డ్ డవ్, స్పాటెడ్ డవ్, గ్రే హెడ్‌డ్ బార్బెట్, బ్రౌన్ క్యాప్డ్ వుడ్‌పెక్కర్, కార్మొరెంట్, బ్లూ టెయిల్డ్ బీ ఈటర్ తదితర పక్షులను విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు ప్రత్యక్షంగా వీక్షించారు. అలాగే వన్యప్రాణుల పాదముద్రలు, మలాన్ని పరిశీలించడం ద్వారా వాటి జాతులను గుర్తించే విధానాన్ని అధికారులు వివరించారు. అటవీ పర్యావరణ వ్యవస్థలో పెద్దపులి పాత్రతో పాటు ప్రాణవాయువు, నీటి వనరుల పరిరక్షణలో అడవుల ప్రాధాన్యతను తెలియజేశారు.

ప్రకృతి విద్యా కేంద్రం సందర్శన

బైసన్ కుంట వద్ద ఉన్న ప్రకృతి విద్యా కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ జంతువులు, పక్షుల ఫొటోలను తిలకించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన పులి, చిరుత పాదముద్రలు, వివిధ రకాల దుప్పులు, జింకల కొమ్ములను పరిశీలించారు. బైసన్ కుంటలోని నీటి పక్షులను కూడా వీక్షించారు.


ఈ సందర్భంగా పాల్గొన్న విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు టైగర్ రిజర్వ్‌లో నిర్వహించిన నేచర్ వాక్ ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు ప్రకృతి అందాలను దగ్గరగా వీక్షించే అవకాశం లభించిందని, ఈ కార్యక్రమం తమకు గొప్ప అనుభూతిని కలిగించిందని తెలిపారు. కార్యక్రమంలో జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎం. రామ్ మోహన్, రేంజ్ అధికారి బాబా ఖాదర్ వలీ, డిప్యూటీ రేంజ్ అధికారి మమత, సెక్షన్ అధికారి శంకర్, బీట్ అధికారులు రవి నాయక్, సంతోష్, వాచర్లు భీమయ్య, సుమన్, విజయ్, శ్రీరామ్, భూపతి, మహదు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్