Magazines

బైబై గణేశా..ప్రశాంతంగా గణేశ్‌ నిమజ్జనం

54 నిమిషాల క్రితం

Goodbye Ganesha
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 2 నిమిషాల చదవడం

గంగమ్మ ఒడికి మహా గణపతి

ట్యాంక్‌‌బండ్‌‌కు భారీగా తరలివచ్చిన సందర్శకులు

ఏరియల్‌ వ్యూలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌



నవతెలంగాణ–సిటీబ్యూరో ​
హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల విగ్రహాలు శోభాయాత్రలుగా తరలిరాగా, హుస్సేన్‌సాగర్‌ సహా నిమజ్జన కేంద్రాలకు సందర్శకులు భారీగా పోటెత్తారు. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పులు, నృత్యాలు, భక్తి గీతాలతో ప్రధాన రహదారులు సందడిగా మారగా, భారీ బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. శుక్రవారం ఉదయం నుంచి సాగిన నిమజ్జన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. గోషామహల్‌, మెహదీపట్నం, షేక్‌పేట్‌, బాలాపూర్‌, చార్మినార్‌, బేగంబజార్‌, మోహింజా మార్కెట్‌, ఆబిడ్స్‌ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో గణనాథులు శోభాయాత్రగా తరలివచ్చాయి. ట్యాంక్‌బండ్‌ పరిసరాలు సందడిగా మారాయి.


గంగమ్మ ఒడికి ఖైరతాబాద్‌ బడా గణపతి
ఖైరతాబాద్‌ 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. సాంకేతిక సమస్య కారణంగా సుమారు మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 9.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌–4 వద్ద మధ్యాహ్నం 2.15 గంటలకు మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. ఇక బాలాపూర్‌ గణేశ్‌ విగ్రహం నిమజ్జనం ట్యాంక్‌బండ్‌పై క్రేన్‌ నం.12 వద్ద పూర్తి చేశారు.

భారీ బందోబస్తు
నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్ల పరిధిలో 50 వేల మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 20 వేల మంది పోలీసులు విధులు నిర్వహించారు. 8,142 మంది అదనపు పోలీసులతోపాటు 42 ప్లాటూన్లు, 53 బాంబు తనిఖీ బృందాలను రంగంలోకి దించారు. శోభాయాత్ర మార్గాల్లో 10 వేలకు పైగా సీసీ కెమెరాలు, 24 డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు.


​మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఏరియల్‌ ‌వ్యూ
గణేశ్‌ నిమజ్జనాల ప్రక్రియను హెలికాప్టర్​ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, సీపీ సజ్జనార్​ పరిశీలించారు. చార్మినార్‌, ఎంజే మార్కెట్‌, నెక్లెస్‌రోడ్ ప్రాంతాలను ఏరియల్‌ వ్యూలో పరిశీలించారు. నిమజ్జనం కోసం మొత్తం 14,840 విగ్రహాల దరఖాస్తులు వచ్చాయని సీపీ సజ్జనార్‌ తెలిపారు. 10 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యాయని వెల్లడించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్