కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
వినాయక నిమజ్జనం సందర్భంగా భువనగిరి మండలం
హన్మపురంలో దాడికి గురైన దళిత యువకుడిని పరామర్శించిన సామాజిక ఉద్యమ నేతలు
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం హన్మపురం గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 23న మంగళవారం తెల్లవారు జామున దళిత యువకులను కులం పేరుతో దూషించి దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఏనుగు రాజశేఖర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మరో 10 మందిని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపూర్ గ్రామంలో బాధిత దళితులకు అండగా సామాజిక ఉద్యమ నేతలు పర్యటించారు. దాడికి గురైన బండారి మనోజ్, బండారు జస్వంత్‌ను పరామర్శించడంతో పాటు ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ సంఘం జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ సభలో స్కైలాబ్‌బాబు మాట్లాడారు. ఈనెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ఉదయం డీజే ఆపరేటర్ చరణ్ టైమ్ అయిపోయిందని ఎంత వేడుకున్నా మద్యం మత్తులో ఉన్న గ్రామ పెత్తందారులు వినలేదన్నారు. తన మిత్రుడు బండారు మనోజ్‌కు ఫోన్ చేసి వారికి చెప్పాలని కోరాడు. అక్కడికి వెళ్లిన మనోజ్‌ను ‘మాదిగ లం.. కొడకా.. నీకేంపని..నువ్వేందుకు వచ్చావురా ఇక్కడికి..’ అంటూ పది మంది పెత్తందారులు మూకుమ్మడి దాడి చేయడంతో పాటు హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ రాజీ చేయించడానికి ప్రయత్నించినా దాడి చేసిన వారు తప్పు ఒప్పుకోలేదన్నారు. దీనిపై ఈనెల 26న భువనగిరి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారని, అయినా పోలీసులు ఆ గ్రామానికి నేటి వరకు వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం పేరుతో దూషించి హత్యాయత్నానికి పాల్పడిన సెక్షన్స్ నమోదు చేసి వారందరిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వినాయక నిమజ్జనం సందర్భంగా దళితులు విపరీతమైన దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొన్నారని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 పేర్కొంటున్నప్పటికీ ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయని ప్రశ్నించారు. డీఎస్పీ వెంటనే గ్రామాన్ని సందర్శించి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని, సోషల్ మీడియా వీడియో ఆధారంగా ఆ దుండగులందరిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 48గంటల్లో డీఎస్పీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సామాజిక ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదం రాజ్, పీఎంపీ రాష్ట్ర కన్వీనర్ సుర్పంగ శివలింగం, సీనియర్ దళిత నాయకులు బట్టు రామచంద్రయ్య, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రవివర్ధన్, మాజీ సభ్యులు బర్రె సుదర్శన్, బీఎస్పీ నాయకులు బాసాని మహేందర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బలింగం, బీఎస్పీ జిల్లా నాయకులు బాసాని మహేందర్, గ్రామ దళిత కుల పెద్దమనిషి మహేందర్, గ్రామ యువకులు, మహిళలు పాల్గొన్నారు.
దళితులపై దాడి చేసిన దోషుల్ని అరెస్టు చేయాలి
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్లు (0)