Magazines

మహాకుట్ర బహిర్గతం

54 నిమిషాల క్రితం

Major
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 5 నిమిషాల చదవడం

ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌)‌ మొదలైనప్పటి నుంచి మేము ఈ ప్రక్రియ తీరుతెన్నులను ‘పీపుల్స్‌ ‌డెమోక్రసీ’లో నివేదికలు, సంపాదకీయాల ద్వారా అక్షరబద్దం చేస్తూనే వచ్చాము. 2025 జూన్‌24న బీహార్‌‌లో మొదలైనప్పటి నుంచి ఈ ప్రక్రియ వివాదమయంగానే నడుస్తున్నది. మొట్టమొదట భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) దాన్ని దేశవ్యాపితంగా అమలు చేస్తానన్నది. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు, శాసనబద్దమైన నిబంధనల మాట అటుంచి గతంలో జరిగిన ఉదా హరణలు కూడా దాదాపు లేవు. ఇది కేవలం 2002-2003లో జరిగిన దాన్ని పునరావృతం చేయడమేనని ఈసిఐ చాలా తేలిగ్గా చెప్పేసి సరిపెట్టింది. ఎన్నిసార్లు కోరుకున్నా 2002-2003లో జరిగిన కసరత్తు వవరాలను ప్రజలకు అందు బాటులో వుంచేందుకు ఈసిఐ నిరాకరించింది. కానీ ఇప్పుడు ఈ మొత్తం సమస్య పూర్తిగా నసాళానికంటేలా తయారైంది. ఈసిఐ చెప్పిన మాటకు తాడూ బొంగరం లేదని తేలిపోయింది. 2002-2003 కసరత్తులో ఓటరును ఒక దరఖాస్తు పూర్తి చేయాలని అడిగిందే లేదు.

లేక తన అర్హత నిరూపించుకోవడానికి ఎలాంటి అధికార పత్రాలు చూపించాల్సిన అవసరం కూడా కలగలేదు. ఇక రెండవ ప్రశ్న ‘సర్‌’ అర్హతలకు సంబంధించింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక పరిశీలనలు జరిగినా నియోజకవర్గ పరిధిలో లేదా కొంత భాగంలో జరిగాయి. అంతేగానీ దేశమంతటా గుండుగుత్తగా ఒకటే ‘సర్‌’ ఎన్నడూ జరగలేదు.కానీ ఈ దఫా మాత్రం ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌లోతైన పరిశోధనాత్మక కథనం బయటపెట్టినట్టు ఈసిఐ విపరీత ప్రవర్తన ఏదో పచ్చి మోసం వాసన కొడుతూ వచ్చింది. ఈసిఐ పని విధానాన్ని మెరుగుపర్చడం కోసం అనుభవం మీద ఏర్పాటు చేసుకున్నదే బహుళ సభ్య ఎన్నికల సంఘం. రాజకీయ వ్యవస్థ లోని అన్ని పార్టీలు తేడాలు లేకుండా ఏకగ్రీవంగా ఆమోదిం చిన మార్పు అది. ఇక మీదట అన్ని నిర్ణయాలు కమిషన్‌ ‌సభ్యులందరి ఆమోదంతో తీసుకోవాలన్నది ఈ బహుళ సభ్య సంఘం ఏర్పాటులో మూలసూత్రం. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశమే వుండదు.


దాటవేతలతో దగా
‘సర్‌’ ప్రక్రియ ముందుకు సాగుతన్నకొద్దీ వచ్చిన ప్రశ్నలు, విమర్శలు వేటికీ పారదర్శకమైన సమాధానాలు అందలేదు. వాటిలో అతి కీలకమైన చర్చ జరిగిన ప్రశ్న తాజా ఓటరు జాబితా (అప్‌‌డేట్‌) తయారీని, పౌరసత్వాన్ని కలగాపులగం చేయవచ్చునా అన్నదే. ఈ ప్రశ్నకు దురుద్దేశాలు అంటకట్టడం జరిగిందే తప్ప తాను ఆ వైఖరితో పనిచేస్తున్నట్టు కమిషన్‌ బహిరంగంగా అంగీకరించనే లేదు. కానీ మొత్తం పథకం అసలు ఉద్దేశాలు బయటపెట్టుకుంది. మరోవైపున అత్యంత భారీ సంఖ్యలో దీన్ని చేపట్టడం వల్ల రాజ్యాంగ హక్కులు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయి. వారడిగిన ప్రశ్నలకూ పత్రాలకూ - ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా జాబితాలో పేరుంచడానికి, అర్హత నిర్ణయించడానికీ సంబంధమే లేదు. కనుక పిట్టచూపుతో చూస్తే ఈ మొత్తం తంతు సామూహిక ఓటు హక్కు రద్దుగా దిగజార్చబడిందన్నది స్పష్టమైంది. ఇది రాజ్యాంగంలోని 326వ అధికరణం స్ఫూర్తికి భిన్నం.మొట్టమొదటగా తీసుకుంటే మొత్తం ప్రతిపక్షాలూ పౌర సంస్థలూ ఇది ఎటు దారితీస్తుందనే దానిపై ముందే హెచ్చరికలు చేశాయి. బీహార్‌‌లోనే చూస్తే 65 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అయితే ఇలా సామూహికంగా తొలగింపులు చేయడానికి ఆధారమేమిటో వాస్తవాలతో నివేదిక ఇచ్చిన దాఖలాలే లేవు.

అంతేకాకుండా జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌ప్రతిపాదిస్తున్న చారిత్రాత్మక స్థాయి పేరాశను పూర్తి చేయడానికి అవసరమైన వ్యవస్థ వనరులు కూడా ఈసిఐకి లేవు. కనక ఈ మొత్తం కసరత్తు వేరే ఉద్దేశంతో రూపొందించబడిందని స్పష్టమవుతున్నట్టు గుర్తించడం శ్రేయస్కరం. సరిహద్దుల ఆవల నుంచి వచ్చే చొరబాటుదారులతో భారతదేశం నిండిపోతున్నదనే హిందూత్వ భావనలూ బీజేపీ రాజకీయ ప్రచారాల తోకగా మారేందుకే అది ఉద్దేశించబడింది. అయితే హిమాచల్‌ ‌ప్రదేశ్‌, జమ్ము కాశ్మీర్‌ ‌మినహా వరుసబెట్టి రాష్ట్రాలలో ఈ కసరత్తు పూర్తిచేసి, పదమూడున్నర కోట్ల ఓట్లు తొలగించినప్పటికీ ఈసిఐ పౌరులు కానివారికి ఓట్లుండటం గురించి, చొరబాటుదారులను గురించి నమ్మదగిన సమాచారమేమీ సేకరించలేకపోయింది. ప్రత్యేకించి పేదలు, దళితులు, ఆదివాసులు, వలసదారులు, ముస్లింలు మహిళలలో ఒక అనిశ్చితిని సృష్టించడమే ఇక్కడ లక్ష్యం. తొలగింపులను పరిశీలిస్తే వారి జనాభా నిష్పత్తితో పోల్చినపుడు అత్యధిక భాగం వీరే తొలగించబడినట్టు అర్థమవుతుంది.


కథనంతో కకావికలు
గత పదహారు నెలలుగా వ్యక్తమవుతున్న దారుణమైన సందేహాలు నిజమేనని సెప్టెంబరు 23న ‘ఇండియన్‌ ఎక్స్‌‌ప్రెస్‌’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ధృవీకరించింది. ఈసిఐ ఏకగ్రీవంగా కాదు కదా మెజారిటీతో కూడా నిర్ణయాలు తీసుకోవడంలేదు. ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్‌ ‌సంధు, వివేక్‌ ‌జోషీలతో వైరుధ్యాలు, సిఈసి జ్ఞానేశ్‌ ‌కుమార్‌ ‌మాత్రం కేవలం వివాదాస్పద అంశలపై పట్టుపట్టడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వుంది. పార్లమెంటు ద్వారా సంబంధిత నిబంధనలు మార్చకుండానే ఫారం 6 స్వరూపం మార్చడం, ఓటర్ల తొలగింపు కోసం వ్యక్తులు, గ్రూపులు, స్వయంగా ఇసిఐ కూడా ఫారం 7 కట్టలు కట్టలుగా సమర్పించడం అనేవి ప్రత్యేకించి ఆరోపణలుగా వచ్చాయి. సమావేశాలలో అధికారపూర్వక ఆమోదం లేకుండానే అనేక నిర్ణయాలు అమలు చేయబడ్డాయి. ఇలా జరగడం అనివార్యమే. ఈసిఐకి వున్న యంత్రాంగం, సిబ్బంది, మానవ వనరుల రీత్యా ‘సర్‌‌’ను జయప్రదంగా పూర్తి చేయడం అసంభవం. దాంతో కృత్రిమ మేధకూ అనధికార వినియోగానికి దారితీసింది. పరీక్షకు నిలవని సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించడం సామూహిక తొలగింపులకు దోహదం చేసింది.

ఐ.టి పరికరాల వినియోగంలోనూ బాధ్యతల విభజనకు సంబంధించి కూడా జ్ఞానేష్‌ ‌కుమార్‌ ఒక్కడే లోపాయికారి నిర్ణయాలు తీసుకున్నారనేది ఇంకా ప్రమాదకరమైన ఆరోపణ. ఎన్నికల జాబితాల డేటాబేస్‌ ఎంతగా కేంద్రీకృతం చేయబడిందంటే ఎలక్టొరల్‌ ‌రిజిస్ర్టేషన్‌ ఆఫీసర్‌ (ఇఆర్‌‌వో) పాత్ర పూర్తిగా నిరాకరించబడింది. గోవా తదితర చోట్ల జరిగిన తంతును ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పరిశోధన నిర్దిష్టంగా ఉదహరించింది. పశ్చిమ బెంగాల్‌‌ నుంచి వచ్చిన అదనపు కథనాలు కూడా ఆధార పత్రాలను సాక్ష్యాలతో సహా ముందుంచుతున్నాయి. ఇఆర్‌‌వోల ప్రమేయం లేకుండానే ఇసిఐ ఆదేశాలతోనే సామూహిక తొలగింపులు జరిగాయని న్యాయపరమైన ట్రిబ్యునళ్ల విచారణలో చెప్పాయి. కేంద్రీకృత డేటా బేస్‌ ‌కూడా ఆడిటింగ్‌ ‌తనిఖీ జరగకుండానే తప్పించుకుంది. ఎలాంటి ఓటర్ల జాబితాకైనా గుండెకాయ లాంటి ఈ పరీక్ష జరక్కపోవడం అత్యంత ప్రమాదాన్ని సూచిస్తుంది. పరిశోధనలో సందేహాలు నిజమేనని నిరూపితం కావడంతో భారీ నిరసన వెల్లువ తలెత్తడం అనివార్య పరిణామం. సిఈసి, ఈసి ల నియామకానికి ఏర్పాటయ్యే ఎంపిక కమిటీని పునర్మిర్మించాలని సుప్రీంకోర్టు చేసిన ప్రతిపాదనను తిరస్కరించడంలోనే ప్రభుత్వ విముఖత వెల్లడైంది.


నయా ఫాసిస్టు దాడి
అందుకే, ఇరవై శాతం మంది ఓటర్లు తొలగించబడిన, నిశ్శబ్ద మానవ హననానికి దారితీసిన దీనంతటిని పచ్చి నయా ఫాసిస్టు దాడిగా చూడవలసి వస్తున్నది. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను పునరుద్ధరించడానికి ఒకే ఒక మార్గం జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ను సాధ్యమైనంత త్వరగా తొలగించడమే. ఒకవేళ ‘ఇండియన్‌ ఎక్స్‌‌ప్రెస్‌’ ‌కథనం వాస్తవాలపై ఏమైనా సందేహాలుంటే వాటిని స్వయంగా ఎన్నికల సంఘం అధికారిక ప్రకటనే నిజమని నిరూపించింది. పై చర్యలతో పాటు ‘సర్‌’ ‌ప్రక్రియను ఉన్నఫళాన నిలిపేయడమే మరో ముఖ్యమైన చర్య. ఢిల్లీలో ‘సర్‌’ ‌ఫలితాలపై వెల్లువెత్తిన నిరసన నేపథ్యంలో బిఎల్‌‌వో లకు ఇచ్చే యాప్‌‌లో కొత్త అంశం ప్రవేశపెట్టారంటేనే ఈ కుట్రలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతుంది. ప్రతికూల విమర్శలను చల్లబర్చడం కోసం విఐపి ఓటర్ల పునరుద్ధరణకు ఫాస్ట్‌ ట్రాక్‌ ‌కల్పించబడింది. ఒక వ్యక్తి ఒకే ఓటు సూత్రం నెత్తురుటేర్లలో ఖతం చేయబడింది. కనుక ఇంకేమాత్రం జాప్యం లేకుండా ఈ చర్యలు చేపట్టాలి. ‘సర్‌‌’ను అనుమతించి ప్రజాస్వామ్యానికి ఈ చావుదెబ్బ కొట్టడానికి అవకాశమిచ్చి ఇప్పటికే తప్పుచేసిన అత్యున్నత న్యాయవ్యవస్థ కూడా తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదు. మిగిలిన ఇద్దరు కమిషనర్లు దారుణమైన నిజాలు బయటికి రావడానికి సహకరించారు గనక జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ను నియ మించిన ప్రభుత్వమే సంజాయిషీ ఇవ్వాల్సి వుంటుంది. బీజేపీ నేతలు, పలువురు ముఖ్యమంత్రులు కూడా కుమార్‌‌ను సమర్థిస్తూనే వున్నారు. 1950లో ప్రారంభమైన మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల మనుగడకు ఇది ప్రధాన సవాలుగా తయారైంది. భారీ సంఖ్యలో భారతీయుల పౌర సత్వం పెద్ద ప్రశ్నార్థకమై కూర్చుంది. జ్ఞానేశ్‌ ‌కుమార్‌‌ను తొల గించి, ‘సర్‌’ ‌నిలిపివేయడం తప్ప మరో గత్యంతరం లేనేలేదు. ​( సెప్టెంబరు 30 ‘పీపుల్స్‌ ‌డెమోక్రసీ’ సంపాదకీయం)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్