– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బొందపెట్టే జీవో 7
– హెచ్‌పీఎస్‌లో అవినీతి చర్యలేవీ? : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌లో నాణ్యమైన విద్య – ఫీజుల నియం త్రణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడారు. ప్రయివేటు విద్యా సంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతి పై ప్రభుత్వం స్పందించాలని కోరారు. విద్యాశాఖ మంత్రి కూడా సీఎం కావడం మన ఖర్మ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఒక్క రూపాయి పెంపు లేకుండా జీవో జారీ చేయాలని కోరారు. ప్రయివేటు పాఠశాలల్లో దాదాపు 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెంచుతున్నార ని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. త్వరలోనే తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని ఆమె హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తి గా నిలిపేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎంఎస్ -7 జీవోతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడే ప్ర యత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న రూ.11వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలు విడుదల చేయాలన్నారు. బకాయిల కారణంగా డ్రాపౌట్స్ పెరిగిపోతున్నాయనిఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో అడ్డగోలు అవినీతి జరుగుతోందని కవిత ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగు తున్న హెచ్‌పీఎస్ ఈ ఏడాది 120 శాతం ఫీజు పెంచిం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఒకే వ్యక్తి గత 14 ఏళ్లుగా ఒకటే పదవిలో కొనసాగుతూ కొత్తగా వచ్చే వారికి అవినీతి పాఠాలు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. సత్య నాదెళ్ల వంటి పూర్వ విద్యార్థులు ఇచ్చిన విరాళాలకు సం బంధించి ఎలాంటి లెక్క పత్రం లేని పరిస్థితి ఉందని విమర్శించారు.
దీనికి తోడు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన కొందరు ఏకంగా 30 ఎకరాల క్యాంపస్ భూమిని కబ్జా చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. హెచ్‌పీఎస్ పనితీరుపై సమగ్ర సమీక్ష జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం విద్య, వైద్యం కోసం 70శాతం ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ అధికా రంలోకి వస్తే పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామ ని తెలిపారు. తాను ఇచ్చిన మాటను తప్పితే అమరుల స్థూపం స్తంభానికి క్టటేసి రాళ్లతో కొట్టాలన్నారు.
ఐక్య ఉద్యమాలతోనే పరిష్కారం : అశోక్ రెడ్డి
అందరం కలిసి పోరాడితేనే ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులుఅశోక్ రెడ్డి తెలిపారు. హెచ్‌ఎస్పీఏ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నాణ్య మైన విద్య అందిస్తామనీ, ఫీజులను నియంత్రిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ సిఫారసు చేసిన 18శాతం నిధులు కాకుండా 6 శాతంతో కేటాయింపులతో సరిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయివేటు స్కూల్స్‌లో ఫీజులను నియత్రించకుండా గాలికొదిలేసిందని విమర్శించారు. సమావేశంలో సీఆర్పీఎఫ్ స్టేట్ కన్వీనర్ జనార్ధన్ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల లక్ష్మణ్, పీడీఎస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, భాగ్య (తల్లుల సంఘం),తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సాధన వేదిక రాష్ట్ర నాయకురాలు మానస, రాంబాబు మల్లేశ్ (తెలం గాణ పేరెంట్స్ అసోసియేషన్), ఆర్.రవీంద్ర నాయక్ (ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ) మాట్లాడారు.



