పదేండ్లలోనే 120 మంది ఆత్మహత్యలు, అసహజ మరణాలు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో విద్యార్థుల మృతులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. 2006 నుంచి 2026 సెప్టెంబరు వరకు 20 ఏండ్ల కాలంలో దేశంలోని వివిధ ఐఐటిల్లో 171 మంది విద్యార్థులు ఆత్మహత్యలు లేదా ఇతర అసహజ కారణాలతో మరణించినట్టు ఓ డేటా విశ్లేషణ వెల్లడించింది. ఇందులో గత పదేండ్లలోనే (మోడీ హయాంలో) 120 మంది మరణించగా, 2006-2015 మధ్య 51 మంది చనిపోయారు. అంటే గుర్తించిన మొత్తం మరణాల్లో సుమారు 70 శాతం 2016 తరువాతే నమోద య్యాయి. ఈ వివరాలను ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, గ్లోబల్ ఐఐటీ అలుమ్ని సపోర్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరజ్ సింగ్ ఆర్టీఐ సమాధానాలు, మీడియా కథనాల ఆధారంగా సేకరించారు. విద్యార్థుల సంఖ్య పెరగడాన్ని మాత్రమే కార ణంగా చూపలేనంతగా మరణాల సంఖ్య పెరిగిం దని ఆయన విశ్లేషణ పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై
అధిక ప్రభావం
డేటాసెట్‌లో సామాజిక వర్గాల వారీగా కూడా వ్యత్యాసాలు కనిపిం చాయని విశ్లేషణ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఆత్మహత్య మరణాల రేటు జనరల్ కేటగిరీ విద్యార్థులతో పోలిస్తే సుమారు రెండింతలుగా ఉన్నట్టు ధీరజ్ సింగ్ అంచనా వేశారు. ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సగటు వయసు కూడా జనరల్, ఒబిసి విద్యార్థుల కంటే తక్కువగా ఉన్నట్టు విశ్లేషణలో పేర్కొన్నారు. కోవిడ్ అనంతర కాలంలో ఈ వ్యత్యాసం మరింత పెరిగినట్టు డేటా విశ్లేషణ చెబుతోంది. ఎస్సీ విద్యార్థు ల్లో ఆత్మహత్య మరణాల రేటు జనరల్ కేటగిరీతో పోలిస్తే 2.6 రెట్లు, ఎస్టీ విద్యార్థుల్లో 4.2 రెట్లు ఉన్నట్టు అంచనా వేశారు.
క్యాంపస్‌లోనే 82 శాతం
వివరాల ప్రకారం ఆత్మహత్యలుగా నమోదైన ఘటనల్లో సుమారు 82 శాతం ఐఐటీ క్యాంపస్‌లలోనే చోటుచేసుకున్నాయి. పరీక్షలు, ఫలితాల ప్రకటన సమయాల్లో మరణాల సంఖ్య పెరగడం, సెమిస్టర్ సెలవుల్లో తగ్గడం వంటి నమూనాలు కూడా డేటా విశ్లేషణలో కనిపించాయని ధీరజ్ సింగ్ పేర్కొన్నారు. మొత్తం ఆత్మహత్యల్లో సుమారు 70 శాతం ఉరివేసుకోవడంతో జరిగినట్టు విశ్లేషణలో వెల్లడైంది. ఈ పరిస్థితులు విద్యార్థులపై విద్యాపరమైన ఒత్తిడి, సంస్థాగత వాతావరణం, సామాజిక వివక్ష, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై మరింత లోతైన పరిశీలన అవసరాన్ని సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు నియమించిన జాతీయ టాస్క్‌ఫోర్స్ కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు విద్యాపరమైన ఒత్తిడి, కుల వివక్ష, ఆర్థిక ఒత్తిడి, లైంగిక వేధింపులు, పరీక్షల్లో వైఫల్యం తదితర అనేక కారణాలు దోహదం చేస్తున్నాయని తన మధ్యంతర నివేదికలో పేర్కొంది.


