ఓటింగ్ నుంచి సామాజిక బాధ్యత వరకు అన్నింటా నిరాశ, నిస్పృహలు
గ్రామాల్లో వెల్లివిరుస్తున్న రాజకీయ భాగస్వామ్యం, పరస్పర సహకారం
తెలంగాణ సామాజిక-ఆర్థిక, రాజకీయ కుల సర్వే (సీపెక్) వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఒకే వీధిలో ఉంటారు… ఒకే అపార్ట్‌మెంట్లో పక్కపక్క ప్లాట్లల్లో నివసిస్తుంటారు. కాని ఒకరి పేరు మరొకరికి తెలియదు… ఎదురుపడ్డప్పుడు మొహమాటానికి హలో అని పలకరించు కుంటారు. రాజకీయ చైతన్యం, పౌరస్పందన అంతంత మాత్రమే. హైదారాబాద్‌తో పాటు రాష్ట్రంలోని టూటైర్ నగరాల్లోని పరిస్థితి ఇది. తెలంగాణ పల్లెల్లో మాత్రం పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. రాజకీయ భాగస్వామ్యం, పౌర నిమగత బలంగా ఉన్నాయి. గ్రామీణ కుటుంబాలు అధిక స్థాయిలో ఎన్నికల్లో పాల్గొనడం, స్థానిక పరిపాలనలో పాలుపంచు కోవడం, రాజకీయ ప్రక్రియలతో నిమగమవడం, పరస్పర సహకారం అందించుకోవడంలో ముందున్నారని సీపెక్ సర్వే వెల్లడించింది. జ్ఞాన వంతులం, మేధావులం అని చెప్పుకునే పట్టణ ప్రాంత ప్రజలు ప్రజాస్వామ్యానికి ఊపిరి అయిన ఓటింగ్‌లో పాల్గొనడంలో గ్రామీణ ప్రాంత ప్రజలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నారు. రాష్ట్రంలో క్రమంగా మారుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలు భవిష్యత్ తెలంగాణకు ప్రమాదకరమని భావిస్తున్నారు.
సీపెక్ డాటా కొంత ఆశ్చ్యరంగా అనిపించి నప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల మధ్య వైరుధ్యాన్ని స్పష్టం చేసింది.
రాష్ట్రం, దేశం పట్ల రెండు ప్రాంతాల్లో నివసించే ప్రజల వైఖరిని వెల్లడించింది. రాజకీయ భాగస్వామ్యం, పౌర నిమగత, ఓటింగ్‌లో పాల్గొనడం, స్థానిక పరిపాలనలో పాలుపంచుకోవడం రాజకీయ ప్రక్రియలతో నిమగమవడం వంటివి గ్రామాల్లో కనిపిస్తున్నాయని తెలిపింది. గ్రామ పంచాయతీలు, మండల స్థాయి కమిటీలు, కుల సంఘాలు, సంక్షేమ కమిటీలు వంటి గ్రామ స్థాయి పరిపాలనా నిర్మాణాలతో ప్రజల సంబంధాలు సన్నిహితంగా ముడిపడి ఉన్నాయి. ఈ సంస్థలు ప్రభుత్వానికి, పౌరులకు మధ్య అధిక స్థాయిలో ప్రత్యక్ష సంబంధాన్ని సృష్టిస్తున్నాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలతో సహా గ్రామీణ కుటుంబాలు స్థానిక ఎన్నికలు, బహి రంగ సభలు, రాష్ట్ర వనరులను, సంక్షేమ కార్యక్రమాలను పొందేందుకు రాజకీయ ప్రక్రియలను ఒక మార్గంగా ఉపయోగించుకుంటున్నాయి. ఫిర్యాదుల పరిష్కార వేదికలను ఏర్పాటు చేసుకుని ముందుకు వెళుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాలు క్షేత్రస్థాయిలో మరింత విస్తృతమైన రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన కుల సమూహాల్లో కొంత వైరుధ్యం ఉంది. పంచాయతీ ఎన్నికల నుంచి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వరకు ఓటింగ్‌లో గ్రామాలు రాష్ట్రంలోని పట్టణాలతో పోల్చితే ముందు వరసలో ఉన్నాయి. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ సరాసరి ఓటింగ్ 85 శాతంగా నమోదైంది. అయితే పట్టణ రాజకీయ ప్రాతినిధ్యం దీనికి భిన్నంగా ఉంది. పట్టణ ఓసీ (జనరల్ క్యాస్ట్) సమూహాలు, ఎంపిక చేసిన ఓబీసీలు, వృత్తి, ఎన్నికైన పదవులు, పార్టీ నాయకత్వం, పట్టణ స్థానిక సంస్థలు వంటి అధికారిక, రాజకీయ నాయకత్వంలో అధిక ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. అయినప్పటికీ రోజువారీ రాజకీయ భాగస్వామ్యం గ్రామాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అనేక పట్టణ కుటుంబాల్లో ముఖ్యంగా వలస, తక్కువ ఆదాయం, అద్దె ఇండ్లల్లో నివసించే వారు పౌర లేదా రాజకీయ సంస్థలతో పరిమిత సంబంధాన్ని కలిగి ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. వృత్తిపరమైన ఒత్తిళ్లు, బలహీనమైన సామాజిక సంబంధాలను కలిగి ఉన్నారు.
అయితే పట్టణాలు కొన్ని సమూహాలకు ఉన్నత స్థాయి రాజకీయ, అధికారిక పదవులను పొందేందుకు అవకాశం కల్పించే వేదికలుగా మారాయని నివేదిక పేర్కొంది. అయితే వారు సైతం తమ పదవులను కాపాడుకునే వరకు మాత్రమే ప్రజా భాగస్వామ్యాన్ని కలిగి ఉంటున్నారు. సమస్యల పట్ల వారు స్పందించడం లేదు. పౌరసమాజం బాధ్యతను కూడా నిర్వర్తించడం లేదు. ఓటింగ్‌లో అయితే అన్ని వర్గాల పట్టణ ప్రజలు తమకెందుకులే అనే నిరాశ, నిస్పృహలో కొట్టు మిట్టాడుతున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాల్లో సరాసరి 73 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది గ్రామాలతో పోల్చితే 12 శాతం తక్కువగా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లలో మరీ తక్కువగా 66 శాతం మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక మెట్రో సిటీ అయిన హైదరాబాద్‌లో అధ్వానంగా ఉంది. 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం 45 శాతం పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే దాదాపు సగం వరకు తేడా గోచరిస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సామాజిక ఎదుగుదలకు ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు.



