మహిళ, ఇద్దరు పిల్లలు మృతి
కంగ్టీ మండలం బోర్గి గ్రామంలో ఘటన
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
బట్టలు ఉతకడానికి వ్యవసాయ బావి వద్దకెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు బావిలో జారి పడి ప్రాణం కోల్పోయారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్లి మండల పరిధిలోని బొర్గి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సావిత్రిబాయి(30), నికిత (13), నందిని (13) మృతి చెందారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జాదవ్ పరశురాం హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. స్వగ్రామంలో వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. పరశురాం భార్య సావిత్రిబాయి(30) తన ఇద్దరు కుమార్తెలు నిఖిత, శివాని, బావ రాజు కుమార్తె నందినితో కలిసి మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో గ్రామ సమీపంలోని బోరు బావి వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లారు. నందిని(13) బావి నుంచి బకెట్‌తో నీరు తోడు తుండగా కాలుజారగా.. పక్కనే ఉన్న నిఖిత(13) పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఇద్దరూ జారి బావిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు సావిత్రిబాయి బావిలోకి దూకింది.
ఈ సమయంలో పైన ఉన్న శివాని కూడా లోపలికి దిగే ప్రయత్నం చేయగా.. బావిలో నుంచి సావిత్రిబాయి ‘బావిలోకి దిగకు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వు’ అని కేకలు వేసింది. దాంతో శివాని పరిగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. వెంటనే గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. అప్పటికే ముగ్గురూ మృతిచెందారు. నిఖిత మొగుడంపల్లి పాఠశాలలో ఆరో తరగతి చదువుతుండగా, నందిని సిరాపూర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. నందిని తండ్రి రాజు, కుటుంబ సభ్యులు పిట్లం ప్రాంతంలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్‌ఐ దుర్గారెడ్డి పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



