తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం పూర్తయింది. ఈ సందర్భంగా గత కాలాన్ని సమీక్షించడం, కేవలం ఒక వార్షికోత్సవ కార్యక్రమం కాదు. రాష్ట్ర నిర్మాణ ప్రక్రియ, అభివృద్ధి విధానాలు, ప్రజల ఆకాంక్షలు, ప్రభుత్వాల పనితీరు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను విమర్శనాత్మకంగా అంచనా వేసుకునే సందర్భం. తెలంగాణ ఉద్యమం ఒక్కరోజులో పుట్టింది కాదు. ప్రాంతీయ అసమానతలు, అభివృద్ధి ఫలితాల అసమాన పంపిణీ, సాగునీరు, ఉపాధి, వనరుల వినియోగం, స్థానిక ప్రజల భాగస్వామ్యం వంటి ప్రశ్నల చుట్టూ దశాబ్దాలపాటు సాగిన రాజకీయ-సామా జిక ప్రక్రియ. రాష్ట్ర విభజనపై భిన్నాభిప్రాయాలు ప్రజల తెలంగాణ కోసం ప్రత్యామ్నాయ కార్యాచరణఉన్న ప్పటికీ, తెలంగాణ ప్రజల్లో వ్యక్తమైన ఆకాంక్షలను, అభి వృద్ధి, స్వయం పాలనకు సంబంధించిన డిమాండ్లను విస్మరించడం సాధ్యం కాదు. ఆ ఆకాంక్షల నేపథ్యమే తెలంగాణ ఆవిర్భావం. తెలంగాణ ఉద్యమం ‘‘నీళ్లు-నిధులు-నియామకాలు’’ అనే నినాదంతో పాటు సామాజిక న్యాయం, సమతుల అభివృద్ధి, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ, స్థానిక వనరులపై స్థానిక ప్రజల హక్కు వంటి అంశాలను ముందుకు తెచ్చింది. తెలంగాణ వస్తే రైతు బాగుపడతాడని, నిరుద్యోగ యువతకు అవకాశాలు పెరుగుతాయని, వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందుతాయని, అట్టడుగు వర్గాలకు అధిక ప్రాధాన్యం లభిస్తుందని ప్రజలు ఆశించారు. అయితే రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు పూర్తవుతున్న ఈ సమయంలో ఒక ప్రాథమిక ప్రశ్న ఎదురవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
కానీ తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమైన ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయి? ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక, రాజకీయ విధానాలు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని పరిమితం చేస్తున్నాయి. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల స్వంత ఆర్థిక నిర్ణయాధికారం తగ్గింది. కేంద్ర పన్నుల పంపిణీ, ప్రత్యేక నిధుల కేటాయింపు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిర్మాణం వంటి అంశాల్లో రాష్ట్రాల పాత్ర క్రమంగా బలహీనపడుతోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కూడా తెలంగాణకు న్యాయం జరగలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వంటి అంశాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. సమాఖ్య వ్యవస్థ బలహీనపడితే రాష్ట్రాల అభివృద్ధి సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అందువల్ల తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర వివక్షకు వ్యతిరేకంగా పోరాటం అవసరం.
ఆర్థిక వృద్ధి -ఉపాధి సంక్షోభం
తెలంగాణ ప్రభుత్వం తరచూ రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటును ప్రస్తావిస్తుంది. నిజమే, కొన్ని ఆర్థిక సూచీలు పురోగతిని చూపిస్తున్నాయి. కానీ వృద్ధి, అభివృద్ధి ఒకటి కావు.ప్రశ్న ఏమిటంటే – ఆర్థిక వృద్ధి ఉపాధిని పెంచిందా? ఆదాయ అసమానతలు తగ్గాయా? గ్రామీణ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు పూర్తిగా సానుకూలంగా లేవు. తెలంగాణలో సేవారంగం, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాలు విస్తరించినప్పటికీ ఉపాధి వృద్ధి అదే స్థాయిలో జరగలేదు. దీనిని ఆర్థిక శాస్త్రవేత్తలు ‘జాబ్‌లెస్ గ్రోత్’గా అభివర్ణిస్తారు. యువతలో నిరుద్యోగం ఇంకా ప్రధాన సమస్యగానే ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు పూర్తిగా భర్తీ కాలేదు. ప్రయివేటు రంగంలోనూ స్థిరమైన ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన-విజయాలు, వైఫల్యాలు
తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ప్రారంభ దశలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొన్ని కీలక కార్యక్రమాలను చేపట్టింది. సాగునీటి విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో కొంత పురోగతి సాధించిన విషయం వాస్తవం. తెలంగాణ రాష్ట్ర ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కూడా ఆ ప్రభుత్వానికి ఒక పాత్ర ఉంది. అయితే అదే సమయంలో అధికార కేంద్రీకరణ, ప్రజాస్వామిక సంస్థల బలహీనత, భారీ అప్పులు, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వైఫల్యం, కార్పొరేట్ అనుకూల అభివృద్ధి విధానాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి.తెలంగాణ ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో సాగినా, పాలనలో ప్రజల భాగస్వామ్యం క్రమంగా తగ్గింది. ఉద్యమ సమయంలో ప్రస్తావించిన సామాజిక న్యాయం, భూ సంస్కరణలు, గ్రామీణ ఉత్పత్తి రంగాల అభివృద్ధి వంటి ప్రశ్నలు వెనక్కి వెళ్లిపోయాయి.బీఆర్‌ఎస్ పాలనలో భారీ ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, వాటి ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించలేదు. వ్యయాలు పెరగడం, ప్రణాళికా లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని ప్రాజెక్టులు నేడు ప్రభుత్వానికి ఆర్థిక గుదిబండగా మారాయి. ఇప్పటికే ఖర్చు చేసిన ప్రజాధనాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని పూర్తి చేసి, గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా వినియోగంలోకి తేవడం ప్రస్తుత ప్రభుత్వ ముందున్న కీలక సవాలు.
నయా ఉదారవాద అభివృద్ధి నమూనా పరిమితులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలనే ప్రధానంగా అనుసరించింది. ఈ నమూనాలో కార్పొరేట్ పెట్టుబడులకు ప్రాధాన్యం, ప్రభుత్వ రంగం పాత్ర తగ్గింపు, ప్రయివేటీకరణ, మార్కెట్ ఆధారిత అభివృద్ధి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విధానాల ఫలితంగా కొంత పెట్టుబడి, కొంత వృద్ధి సాధ్యమైనప్పటికీ సామాజిక అసమానతలు భారీగా పెరిగాయి. అభివృద్ధి ఫలితాలు కొద్దిమందికే పరిమితమయ్యాయి.తెలంగాణలో కూడా ఇదే వైరుధ్యం కనిపిస్తోంది. ఒకవైపు భారీ ఆస్తి సృష్టి జరుగుతుండగా, మరోవైపు పేదరికం, నిరుద్యోగం, అస్థిర ఉప్రజల తెలంగాణ కోసం ప్రత్యామ్నాయ కార్యాచరణపాధి కొనసాగుతున్నాయి.
వ్యవసాయం, సాగునీరు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
తెలంగాణ ఉద్యమంలో వ్యవసాయం కేంద్ర అంశంగా నిలిచింది. సాగునీటి విస్తరణలో కొన్ని పురోగతులు జరిగిన విషయం వాస్తవం. అయితే వ్యవసాయ రంగ నిర్మాణాత్మక సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రైతులు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలు ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, గిట్టుబాటు ధరల లేమి, మార్కెట్ అస్థిరత, అప్పుల భారం. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు అవసరమే. కానీ రైతు ఆదాయం పెరగడం, మార్కెట్ భద్రత కల్పించడం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం కూడా అంతే ముఖ్యం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడకపోతే రాష్ట్ర అభివృద్ధి సమతులంగా ఉండదు. తెలంగాణ ఆర్థిక పరిమాణం గణనీయంగా పెరిగిన విషయం వాస్తవం. 2025-26 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీడీపీ) సుమారు రూ.18 లక్షల కోట్లకు చేరుతుందని అధికారిక బడ్జెట్ అంచనాలు చెబుతున్నాయి. తలసరి ఆదాయం కూడా సుమారు రూ.4.19 లక్షలకు చేరి జాతీయ సగటును అధిగమించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వాటి విశ్వసనీయత సంగతి కాసేపు పక్కన బెడితే.. ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి రెండూ ఒకటి కావు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం వాటా 66 శాతానికి పైగా ఉండగా, వ్యవసాయ రంగం వాటా 17 శాతం చుట్టూ ఉంది. అయినప్పటికీ గ్రామీణ జనాభాలో గణనీయమైన వర్గాలు ఇంకా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నాయి. ఈ వైరుధ్యమే అభివృద్ధి నమూనాలోని నిర్మాణాత్మక సమస్యను సూచిస్తోంది. తెలంగాణ ప్రస్తుతం దేశంలో అగ్రస్థాయి వరి ఉత్పత్తి రాష్ట్రాల్లో ఒకటిగా ఎదిగింది. 2023-24లో సుమారు 118 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సాగు విస్తీర్ణం 2025-26 నాటికి 132 లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా. అయితే ఇదే సమయంలో పంటల వైవిధ్యం తగ్గడం, మార్కెట్ అసమతుల్యత, నిల్వ సమస్యలు, ధరల అస్థిరత వంటి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. రైతు సంక్షేమం అంటే కేవలం సాగునీరు మాత్రమే కాదు. ఉత్పత్తి వ్యయాల నియంత్రణ, మార్కెట్ భద్రత, పంటల వైవిధ్యం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కూడా అంతే కీలకం.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల అంచనాలు
2023 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మార్పుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. దీని వెనుక కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాకుండా కొత్త ఆశలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొంతకాలం గడుస్తున్న ఈ సమయంలో ప్రజలు ఇచ్చిన హామీల అమలు, ఉపాధి కల్పన, రైతాంగ సమస్యల పరిష్కారం, విద్యా-వైద్య రంగాల బలోపేతం వంటి అంశాల్లో స్పష్టమైన ఫలితాలు ఆశిస్తున్నారు. కొన్ని హామీల అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర ప్రభుత్వ పరిమితులు, గత పాలన నుంచి వచ్చిన అప్పుల భారం వంటి అంశాలు ప్రభుత్వానికి సవాళ్లుగా ఉన్నాయి. అయితే ఈ పరిమితులు ప్రజల అంచనాలకు ప్రత్యామ్నాయం కావు. తెలంగాణ ప్రజలు కోరుతున్నది పారదర్శక పాలన, ప్రజాస్వామిక చర్చ, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం ఆధారిత అభివృద్ధి. తెలంగాణ అభివృద్ధి నమూనాపై జరుగుతున్న చర్చలో అప్పుల ప్రశ్నను విస్మరించడం సాధ్యం కాదు. రాష్ట్ర బడ్జెట్ విశ్లేషణ ప్రకారం 2025-26లో ఆర్థిక లోటు సుమారు రూ.54,010 కోట్లుగా అంచనా వేయబడింది. మరోవైపు వివిధ ప్రభుత్వ హామీలు, కార్పొరేషన్ల అప్పులు, ప్రత్యక్ష,పరోక్ష బాధ్యతలు కలిపి రాష్ట్ర ఆర్థిక భారం భారీ స్థాయికి చేరినట్లు ప్రభుత్వ పత్రాలు, ఆర్థిక విశ్లేషణలు సూచిస్తున్నాయి. అభివృద్ధి ఫలితాలు ప్రజల ఆదాయాలను పెంచు తున్నాయా? లేక అప్పుల ఆధారిత వృద్ధి మాత్రమే పెరుగుతోందా? అనే ప్రశ్నను కీలకంగా చర్చించాల్సిన అవసరం ఉంది.
విద్య, వైద్యం-ప్రజా రంగానికి సవాళ్లు
విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కులు. కానీ ఈ రెండు రంగాల్లోనూ ప్రయివేటీకరణ ప్రభావం పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రయివేటు రంగ ఆధిపత్యం పెరుగుతోంది. మధ్యతరగతి, పేద కుటుంబాలపై విద్యా, వైద్య ఖర్చుల భారం పెరుగుతోంది. సంక్షేమ రాష్ట్రం అంటే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. తెలంగాణ బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల సగటుతో పోలిస్తే వాటి వాటాపై ప్రశ్నలు ఉన్నాయి. 2026-27 అంచనాల ప్రకారం తెలంగాణ మొత్తం వ్యయంలో విద్యకు సుమారు 9.8 శాతం, ఆరోగ్యానికి ఐదు శాతం మాత్రమే కేటాయించింది. ఇది రాష్ట్రాల సగటు కేటాయింపుల కంటే తక్కువగా ఉందని బడ్జెట్ విశ్లేషణలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సిబ్బంది కొరత కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. 2026 ప్రారంభ నాటికి ప్రభుత్వ వైద్యుల ఆమోదిత పోస్టుల్లో దాదాపు 38 శాతం ఖాళీగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
హైదరాబాద్ అభివృద్ధి – ప్రాంతీయ అసమానతలు
హైదరాబాద్ తెలంగాణకు ఆర్థిక శక్తికేంద్రం. ఐటీ, ఔషధ, సేవారంగాల్లో నగరం విశేష పురోగతి సాధించింది. అయితే ప్రశ్న ఏమిటంటే -ఈ అభివృద్ధి ఫలితాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చేరాయా? హైదరాబాద్ చుట్టూ పెట్టు బడులు ప్రజల తెలంగాణ కోసం ప్రత్యామ్నాయ కార్యాచరణకేంద్రీకృతమవు తుండగా, అనేక గ్రామీణ ప్రాంతాలు ఇంకా ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలను తగ్గించకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు.
బీజేపీ విధానాలు.. తెలంగాణపై వివక్ష
గత పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. అయితే ఈ మార్పులు భారత రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసే దిశగా కాకుండా, అధికార కేంద్రీకరణను పెంచే దిశగా సాగాయి. జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాల స్వంత పన్నుల విధానాధికారం గణనీయంగా పరిమితమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాల విస్తరణ, గవర్నర్ వ్యవస్థ వినియోగం, దర్యాప్తు సంస్థల రాజకీయ వినియోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, కార్మిక చట్టాల సరళీకరణ, వ్యవసాయ రంగంలో కార్పొరేట్ అనుకూల విధానాలు వంటి చర్యలు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తెలంగాణ విషయంలో సమస్య కేవలం సమాఖ్య వ్యవస్థను బలహీన పరచడానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచిన అనేక హామీలు నేటికీ అమలు కాలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, విద్యా సంస్థల ఏర్పాటు వంటి అంశాలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కేవలం ఒక రాజకీయ ఒప్పందం కాదు, అది పార్లమెంట్ ఆమోదించిన చట్టం. ఆ చట్టంలోని హామీలను అమలు చేయక పోవడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, పార్లమెంటరీ హామీలను నిర్లక్ష్యం చేయడమే అవుతుంది. తెలంగాణ దేశంలో అత్యధిక పన్ను చెల్లించే రాష్ట్రాలలో ఒకటిగా ఎదుగుతున్న ప్పటికీ, కేంద్ర నిధుల కేటాయింపు, జాతీయ ప్రాజెక్టుల మంజూరు, పారిశ్రామిక సంస్థల స్థాపన వంటి అంశాల్లో రాష్ట్రం ఆశించిన ప్రాధాన్యం పొందలేకపోయింది. ఫలితంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి పెరుగుతోంది.
ప్రజల తెలంగాణ కోసం ప్రత్యామ్నాయ కార్యాచరణ
పన్నెండేళ్ల తెలంగాణ అనుభవం కొన్ని స్పష్టమైన పాఠాలు నేర్పుతోంది. రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ప్రజల ఆకాంక్షలన్నింటికీ సమాధానం కాదని ఈ అనుభవం నిరూపించింది. ప్రజలు ఆశించిన తెలంగాణ, పాలక వర్గాలు నిర్మిస్తున్న తెలంగాణ ఒకటి కాదన్న వాస్తవం కూడా స్పష్టమవుతోంది. అందువల్ల నేడు తెలంగాణ ముందున్న అసలు ప్రశ్న‘ఎవరు అధికారంలో ఉన్నారు’ అనేది కాదు. ఎలాంటి తెలంగాణను నిర్మించాలి? అనేదే. అందుకే తెలంగాణ అభివృద్ధి దిశపై కొత్త చర్చ అవసరం. రాష్ట్ర అభివృద్ధిని కేవలం జీఎస్‌డీపీ వృద్ధి, పెట్టుబడుల ప్రవాహం, రియల్ ఎస్టేట్ విస్తరణతో కొలవడం సరిపోదు. ఉపాధి కల్పన, ఆదాయ పంపిణీ, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక భాగస్వామ్యం, ప్రాంతీయ సమతుల్యత వంటి ప్రమాణాలను కూడా కేంద్రంగా తీసుకోవాలి. తెలంగాణ భవిష్యత్తు కేవలం ప్రభుత్వాల మార్పుతో నిర్ణయించబడదు. అభివృద్ధి దిశ, వనరుల పంపిణీ, ప్రజా విధానాల స్వభావం, ప్రజల భాగస్వామ్యం-ఇవే తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రాష్ట్రం ఏర్పడటం ఒక రాజకీయ విజయం. కానీ ప్రజల తెలంగాణ నిర్మాణం ఇంకా కొనసాగుతున్న ప్రక్రియ. తెలంగాణ ఉద్యమం లేవనెత్తిన ఉపాధి, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి, స్వయం పాలన, ప్రజాస్వామిక భాగస్వామ్యం వంటి ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడే ప్రజలు కలగన్న తెలంగాణ సాకారమవుతుంది.
జూలకంటి రంగారెడ్డి, 9490098349



