రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ (దీని సభ్యులను ఎఫ్ఆర్ఎస్ – FRS అని సంక్షిప్తీకరిస్తారు) అధికారికంగా నవంబర్ 28, 1660న స్థాపించబడింది. ప్రముఖ వైరాలజిస్ట్, వ్యాక్సిన్ పరిశోధకురాలైన డాక్టర్ గగన్‌దీప్ కాంగ్, లండన్‌లోని రాయల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్తగా 2019లో చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్-జనరలైన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కూడా రాయల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికయ్యారు. ఆమె మరెవరో కాదు, భారతరత్న భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె. భారతదేశం నుండి రాయల్ సొసైటీ ఫెలోలుగా ఎన్నికైన మొదటి తండ్రీ-కూతుళ్ల ద్వయంగా ఈ ఘనత భారతీయ విజ్ఞానశాస్త్రంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. అంతేకాదు ఈ సొసైటీకి ఎన్నికైన రెండవ భారతీయ మహిళ కూడా ఈమెనే కావడం మరో విశేషం.
చెన్నైలో మూలాలు ఉన్న సౌమ్య స్వామినాథన్ 1959లో జర్మనీలో పుట్టారు. తనలోని ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే ప్రజారోగ్య నిపుణురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. క్షయ, హెచ్‌ఐవి, కోవిడ్-19 మహమ్మారి వంటి ప్రధాన ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించారు. దశాబ్దాలుగా ఆమె విజ్ఞానశాస్త్రం, ఆరోగ్య సంరక్షణ విధానం, ప్రపంచ సంక్షోభ ప్రతిస్పందన వంటి రంగాలలో అవిశ్రాంత కృషి చేసి ప్రజారోగ్య రంగంలో ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకరిగా గుర్తింపు పొందారు.
తండ్రీ-కూతుళ్ల ద్వయం
రాయల్ సొసైటీకి ఆమె ఎన్నిక కావడం భారతీయ విజ్ఞానశాస్త్రానికి, అలాగే ప్రపంచ పరిశోధన, ఆరోగ్య సంరక్షణ నాయకత్వానికి దేశం అందిస్తున్న, పెరుగుతున్న తోడ్పాటుకు ఒక గర్వకారణంగా పరిగణించబడుతోంది. ఈ గౌరవంతో డా సౌమ్య ప్రతిష్టాత్మక ఐజాక్ న్యూటన్ స్థాయి శాస్త్రవేత్తల సరసన చేరారు. లండన్‌లో ఈ వార్తను ప్రకటించిన వెంటనే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) మాజీ డీజీ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ మాజీ అధ్యక్షుడు రఘునాథ్ మశేల్కర్ మాట్లాడుతూ “ఒక శాస్త్రవేత్త అందుకోగల అత్యున్నత అంతర్జాతీయ గౌరవాలలో ఒకటైన రాయల్ సొసైటీ ఫెలో (ఎఫ్‌ఆర్‌ఎస్)గా డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఎన్నికయ్యారు. 1973లోనే ఆమె తండ్రి, భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌గా ఎన్నికవడంతో, భారతదేశం నుండి ఎఫ్‌ఆర్‌ఎస్ పొందిన మొట్టమొదటి తండ్రీ-కూతుళ్ల ద్వయం వీరే” అని అన్నారు.
ప్రధాన సైన్స్ అకాడమీలలో ఫెలోగా
డాక్టర్ సౌమ్య స్వామినాథన్ యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ లలో చదువుకొని అక్కడే కొన్ని సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. ఆమె 480కి పైగా పీర్-రివ్యూడ్ ప్రచురణలు, కొన్ని పుస్తకాలను కూడా రచించారు. ఆమె యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్, అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (యూకే)తో పాటు భారతదేశంలోని అన్ని ప్రధాన సైన్స్ అకాడమీలలో ఫెలోగా ఉన్నారు. ఆమె కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, EPFL లౌసాన్, లండన్‌లోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి గౌరవ డాక్టరేట్లను పొందారు. ఆమె ప్రస్తుతం “అవర్ కామన్ ఎయిర్” అనే గ్లోబల్ కమిషన్‌కు సహ-అధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే కోఫీ అన్నన్ కమిషన్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీలో సభ్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కరోలిన్స్కా విశ్వవిద్యాలయం (స్వీడన్), టఫ్ట్స్ విశ్వవిద్యాలయం (యూఎస్)లలో అనుబంధ ప్రొఫెసర్‌షిప్‌లను కలిగి ఉన్నారు.
వ్యాక్సిన్ అభివృద్ధి సహకారానికి
భారతదేశంలో వ్యాక్సిన్ అభివృద్ధికి, క్లినికల్ ట్రాన్స్‌లేషనల్ మెడిసిన్‌లో శిక్షణా కార్యక్రమాల స్థాపనకు డా.సౌమ్య స్వామినాథన్ చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేయబడింది. ఆమె జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ప్రధాన సలహాదారుగా విధానపరమైన దిశలను, దిద్దుబాటు చర్యలను సూచిస్తూ, క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాలను సాధించే వ్యూహానికి నాయకత్వం వహిస్తున్నారు. 2017 అక్టోబరు నుండి 2019 మార్చి వరకు ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ (డీడీపీ) గా సేవలందించారు. అలాగే కోవిడ్-19 ఉధృతి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ (MSSRF) బోర్డులో చైర్‌పర్సన్‌గా పని చేస్తూనే ఇతర ప్రముఖ పరిశోధనా సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వైద్య శాస్ర్తానికే అంకితం
వైద్య సంరక్షణ, పరిశోధనలలో 40 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ స్వామినాథన్, కీలకమైన పరిశోధనలను ప్రభావవంతమైన ఆరోగ్య కార్యక్రమాలుగా మార్చడానికి తన వృత్తి జీవితాన్ని అంకితం చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన మాజీ కార్యదర్శిగా, ఆమె ఆరోగ్య విధాన రూపకల్పనలో విజ్ఞాన శాస్త్రాన్ని ఏకీకృతం చేయడానికి, భారతీయ వైద్య సంస్థలలో పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడానికి, ప్రజారోగ్య శాస్త్రాలలో ప్రపంచ భాగస్వామ్యాలను ప్రోత్సహించడానికి ప్రాధాన్యతనిచ్చారు.
అందుకున్న అవార్డులు
డా.సౌమ్య 1999లో XI నేషనల్ పీడియాట్రిక్ పల్మోనరీ కాన్ఫరెన్స్, ఉత్తమ పేపర్ కోసం డాక్టర్ కెయా లాహిరి గోల్డ్ మెడల్ అందుకున్నారు. అలాగే 2008లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్షణిక ఓరేషన్ అవార్డు, 2009లో టీబీ, ఊపిరితిత్తుల వ్యాధులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ యూనియన్, వైస్ చైర్, హెచ్.ఐ.వి విభాగం, 2011లో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఫెలో, 2011లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అప్లైడ్ మైక్రోబయాలజిస్ట్స్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2012లో తమిళనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు, అదే ఏడాది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా, ఫెలో, 2013లో ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు, ఫెలో, 2016లో NIPER, ASTRAZENECA పరిశోధన ఎండోమెంట్ అవార్డు వంటివి ఎన్నో అందుకున్నారు.


