Saturday, June 6, 2026
E-PAPER
Homeజాతీయంభారత్-చైనా సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోం

భారత్-చైనా సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోం

- Advertisement -

ఇండియాపై అమెరికా ఒత్తిడి చేసింది
ట్రంప్‌ ఏకపక్ష విధానాలు ఉమ్మడిగా ఎదుర్కోవాలి : రష్యా అధ్యక్షుడు పుతిన్

సెయింట్ పీటర్స్‌బర్గ్, న్యూఢిల్లీ : భారత్, చైనా మధ్య ఉన్న ‘సున్నితమైన’ సరిహద్దు విషయంలో, ద్వైపాక్షిక సంబంధాల్లో మాస్కో జోక్యం చేసుకోదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తమ దీర్ఘకాల సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి అంతర్జాతీయ ప్రముఖ మీడియా అధిపతులతో జరిగిన విస్తృత సమావేశంలో మోడీ, జిన్‌పింగ్‌లను ఆయన ప్రశంసించారు. న్యూఢిల్లీ, బీజింగ్‌లతో రష్యాకు దశాబ్దాలుగా ఉన్న భాగస్వామ్యాలు సహజంగా పెరిగాయని, ఒకదానికొకటి పూర్తిగా స్వతంత్రమైనవని ఆయన అన్నారు. భార‌తదేశ విదేశాంగ విధానాన్ని పుతిన్ ప్ర‌శంసించారు. ఇండియాతో బంధాన్ని మ‌రింత విస్తృతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కూడా చెప్పారు. ర‌ష్యాతో సంబంధాల విషయంలో భార‌త్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చిందని, కానీ ఆ ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మైన‌ట్లు పుతిన్ పేర్కొన్నారు. అంత‌ర్జాతీయ సంబంధాల‌ను అమెరికా బ‌ల‌హీనప‌రిచే ప్ర‌య‌త్నం చేస్తుందని విమర్శించారు. భార‌త ఆర్థిక వృద్ధి గురించి కూడా ప్రస్తావించారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న భారత పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారత్‌, చైనా దౌత్య వ్యవహారాలపై ఆయన స్పందించారు. రెండు దేశాల నేతలూ సరిహద్దు సమస్యతో పాటు ఇతర సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలతో నాలుగేళ్లకుపైగా సైనిక ప్రతిష్టంభన కొనసాగిన సంగతి తెలిసిందే.

అనంతరం సంబంధాల పునరుద్ధరణకు గత ఆగస్టులో, మోడీ, జిన్‌పింగ్‌ టియాంజిన్‌లో సమావేశమయ్యారు. ఇది రెండు ఆసియా దిగ్గజాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు దోహదం చేసింది. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలుండాలని రష్యా ఎప్పటినుంచో చెబుతోంది. మరోవైపు రష్యా-భారత్-చైనా త్రైపాక్షిక సంబంధాల చారిత్రక నేపథ్యాన్ని అందుకు ఏర్పడిన బ్రిక్స్‌ (బిఆర్‌ఐసిఎస్‌) ‌కూటమి ఏర్పాటు గురించి కూడా పుతిన్‌ వివరించారు. ప్రపంచ క్రమాన్ని దెబ్బతీయడానికి ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి రష్యా, భారత్ , చైనా (ఆర్‌ఐసి) యంత్రాంగాన్ని పునరుద్ధరించడానికి బీజింగ్, మాస్కో కృషి చేస్తున్నాయన్నారు. భారత్‌, పాక్‌‌ మధ్య ఉన్న సరిహద్దు సమస్యల చిక్కులు కూడా తనకు తెలుసన్నారు. అమెరికా యుద్ధోన్మాదంతో ప్రపంచ దేశాలపై సుంకాల పేరుతో, అణ్వాయుధాల పేరుతో దాడులు చేస్తున్న తరుణంలో మాస్కో వ్యూహాత్మకంగా భారత్‌, చైనాను ప్రస్తావించిందని పలువురు విశ్లేషిస్తున్నారు.

భారత్‌తో సంబంధాల పునురుద్దరణకు సిద్ధం : చైనా రాయబారి జు ఫీహాంగ్
పుతిన్‌ ‌వ్యాఖ్యల నేపథ్యంలో భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో గురువారం పోస్ట్‌ ‌చేశారు. భారత్‌తో సంబంధాల పునురుద్దరణకు చైనా సిద్ధంగా ఉందని రాయబారి జు ఫీహాంగ్ తెలిపారు. “మనం ఎంత ఎక్కువ మార్పిడి చేసుకుంటే, మనం ఒకరినొకరు అంత బాగా అర్థం చేసుకుంటాము, మన పరస్పర విశ్వాసం అంత బలంగా పెరుగుతుంది” అని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, గతంలో జరిగింది చిన్న భాగం మాత్రమేనని అన్నారు. ఈ సంవత్సరం బ్రిక్స్‌ (‌బిఆర్‌ఐసిఎస్‌) అధ్యక్ష పదవిని భారతదేశం నిర్వహిస్తుందని, 2027లో చైనా అధ్యక్ష పదవిని చేపడుతుందని జు ఫీహాంగ్ గుర్తు చేశారు. బ్రిక్స్‌ అధ్యక్షుడిగా భారత్‌ చేస్తున్న కృషికి చైనా పూర్తి మద్దతు ఇస్తుందని, బ్రిక్స్‌, ఎస్‌‌సిఒ రెండింటిని నడిపించడానికి, సమానమైన, క్రమబద్ధమైన బహుళధ్రువ ప్రపంచం వైపు ప్రయాణానికి భారత్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని జు ఫీహాంగ్ స్పష్టం చేశారు. చైనా తన పొరుగు దేశాలతో, ముఖ్యంగా దక్షిణాసియా దేశాలతో స్నేహపూర్వక, సహకార సంబంధాలను కొనసాగించడానికి కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. స్నేహం, చిత్తశుద్ధి, పరస్పర ప్రయోజనం అనే సూత్రాల ద్వారా చైనా మార్గనిర్దేశం చేస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -