Saturday, June 6, 2026
E-PAPER
Homeజాతీయంఅంకెలేగా.. వేసేద్దాం!

అంకెలేగా.. వేసేద్దాం!

- Advertisement -

2025-26లో 7.7 శాతం వృద్ధి
అనిశ్చితిలోనూ అమాంతం పెరుగుదల

న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితులు నెలకొన్నప్పటికీ భారత వృద్ధి రేటు ముందస్తు అంచనాలు మించి అమాంతం పెరగడం అనేక అనుమానాల ను కలిగిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడీపీ 7.7 శాతం పెరిగిందని కేంద్ర గణాంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఒ) శుక్రవారం వెల్లడించింది. ఇంతక్రితం 2024-25లో జీడీపీ 7.1 శాతంగా చోటు చేసుకుంది. దేశంలో అధిక ధరలు, పెరిగిన నిరుద్యోగం, హరించుకుపోతున్న ఆదాయాలకు తోడు అమెరికా అధిక టారిఫ్‌‌లు, పశ్చిమాసియా లో యుద్ధ సంక్షోభం, ఎగుమతుల పతనం తదితర ప్రతికూల పరిణామాల్లోనూ జీడీపీ పెరిగింది. పెరుగుతున్న అంతర్జాతీయ, దేశీయ ముప్పుల కారణంగా జీడీపీ ఒత్తిడికి గురి కావొచ్చని ఆర్బీఐ సహా అనేక సంస్థలు, ఆర్థికవేత్తలు హెచ్చరించినప్పటికీ భారత వృద్ధి రేటును మోడీ సర్కార్‌ ‌పెంచి చూపించడంతో అంకెలేగా వేసేయ్యు అన్న తీరు స్పష్టమవుతోంది. 2022-23 కొత్త ఆధారిత సంవత్సరం ప్రకారం ఎన్‌ఎస్‌ఓ గణాంకాలను ప్రకటించింది. 2026 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం లోనూ 7.8 శాతం వృద్ధి నమోదయ్యింది. గతేడాది మార్చి త్రైమాసికంలో ఉన్న రూ. 81.40 లక్షల కోట్ల జీడీపీ.. క్రితం క్యూ4లో రూ. 87.77 లక్షల కోట్లకు పెరిగింది. గత మార్చిలో దేశంలోకి వచ్చిన విదేశీ నిధుల కంటే దేశం వెలుపలికి తరలిపోయిన నిధుల మొత్తమే ఏకంగా 11.7 బిలియన్ల (దాదాపు రూ. 97,000 కోట్లు) మేర ఎక్కువగా ఉంది.

మరోవైపు ఎగుమతుల్లోనూ స్తబ్దత చోటు చేసుకుంది. మార్చి నెలలో ఎగుమతులు ఏకంగా 57.9 శాతం మేర పడిపోయాయి.అమెరికా అధిక టారిఫ్‌‌లు, పశ్చిమాసియ పరిణామాలతో 2025-26లో భారత ఎగుమతులు కేవలం 1 శాతం పెరిగి 441.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. యూఎస్‌-ఇరాన్‌ ‌ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి గ్యాస్‌ ‌సరఫరా, ముడి సరుకుల కొరతతో దేశీయంగా అనేక పరిశ్రమలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దేశంలో కొత్త పెట్టుబడులు నిలిచిపోయాయి. ఉద్యోగాల కల్పన అత్యంత పేలవంగా ఉంది. జీడీపీలో అధిక వాటా కలిగిన సర్వీసు సెక్టార్‌‌లోని ఐటి రంగంలో పెట్టుబడులు పడిపోవడంతో పాటుగా ఈ రంగంలో ఉన్న ఉద్యోగాలు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. ఇంకా కొత్త ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. నిరుద్యోగ వృద్ధి వేగంగా పెరుగుతోంది. మరోవైపు అధిక ధరలతో ప్రజల ఆదాయాలు అమాంతం పడిపోతున్నాయి. దేశీయ ప్రయివేటు రంగానికి చెందిన పెద్ద కంపెనీలు కొత్త ఫ్యాక్టరీలు లేదా ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయి.

దేశీయంగా వినియోగ డిమాండ్ పూర్తి స్థాయిలో పుంజుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. అమ్మకాలు లేక ఖర్చులు తగ్గించుకోవడానికి ఇటీవల దిగ్గజ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హెచ్‌‌యుఎల్‌ తమ ఉద్యోగుల్లో 8 శాతం మందిని ఇంటికి పంపించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అమాంతం పడిపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 7.2 శాతం లోపు వృద్ధి ఉండొచ్చని ఆర్బీఐ తొలుత అంచనా వేసింది. ఎన్‌ఎస్‌ఓ 7.1 శాతంగా, ప్రపంచ బ్యాంక్‌ 6.6 శాతం, ఐఎంఎఫ్‌ 6.5 శాతం, ఏడీబీ 6.6 శాతం, ఎస్‌అండ్‌‌పీ 6.5 శాతంగా ఉండొచ్చని అయా సంస్థలు అంచనా వేశాయి. రాయిటర్స్‌ ‌పోల్‌‌లో ఆర్థిక నిపుణులు కూడా 7.2 శాతం మేర ఉండొచ్చని భావించారు. ఈ అంచనాలు మించి అమాంతం జీడీపీ పెరగడం అనుమానాలకు తావిస్తోంది. ‘తయారీ, సేవా రంగాల బలమైన ప్రదర్శనతో అంచనాలను మించి ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత జీడీపీ 7.7 శాతంగా, మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలోనూ 7.8 శాతంగా వృద్ధి చెందింది. భారత ఆర్థిక పటిష్టత కోసం మరిన్ని సంస్కరణలు చేపడతాం.’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -