– హుస్నాబాద్ మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
వానకాల సాగులో రైతులు సరైన విత్తన ఎంపిక చేసుకుని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలను తీసుకోవాలని హుస్నాబాద్ వ్యవసాయ మండల అధికారి వేల్పుల పూజ అన్నారు. శనివారం హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్, జిల్లెల్లగడ్డ, పొట్లపల్లి, మాలపల్లి, బంజరుపల్లి గ్రామాలలో గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ మాట్లాడుతూ నేలలో సరైన తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే రైతులు విత్తనాలు విత్తుకోవాలని సూచించారు.
సమగ్ర ఎరువుల యాజమాన్యం, ఆరుతడి పంటల సాగు మరియు మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్న రకం వరి విత్తనాలను ఎంచుకోవాలని సూచించారు. అదేవిధంగా పంట అవశేషాలను రైతులు ఎట్టి పరిస్థితులను కాల్చవద్దని, వ్యర్థాలను కాలిస్తే వచ్చే నష్టాల గురించి తెలియజేస్తూ, వ్యర్థాలను భూమిలోనే కలియ దున్నడం వలన నేల యొక్క కర్బన శాతం పెరుగుతుందని వివరించారు. మరియు మండలంలో ప్రస్తుతం జనము, జీలుగా 50% సబ్సిడీలో రైతులకు అందుబాటులో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు వెన్న స్వర్ణలత రాజు, రాచపల్లి శ్రీనివాస్, పంచాయతీ సెక్రెటరీలు, ఏఈవోలు మరియు రైతులు పాల్గొన్నారు.



