నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని డోన్గావ్-వజ్రకండి మార్గమధ్యంలో గురువారం రాత్రి చిరుత పులి సంచరిస్తోందని గ్రామస్తులు తెలిపారు. డోన్గావ్ గ్రామానికి చెందిన యువకులు రాత్రిపూట కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా రోడ్డుపై నుండి చిరుత రోడ్డు దాటి పొదల్లోకి వెళ్తుండగా చేశామని వారు చెప్పారు. వెంటనే కారు ఆపి అందులో నుండే వీడియో కూడా తీశామని తెలిపారు.
విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా జడుసుకున్నారు. రాత్రి పొలాల వైపు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతోందని భయంతో వణికిపోతున్నారు. ఇటీవలే పెద్ద ఏడ్గి శివారులో పులి సంచరిస్తుందని సమాచారం అందకున్న ఫారెస్ట్ అధికారులు డ్రోన్ సాయంతో అన్వేషణ మొదలు పెట్టి ఉసూరుమనిపించారని గ్రామస్థులు తెలిపారు. ఇప్పుడలా కాకుంగా పకడ్బందీగా ప్లాన్ వేసి చిరుతను పట్టుకోవాలని అన్నారు. చిరుత సంచారంతో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు కాలయాపన చేయకుండా డోన్గావ్-వజ్రకండి గ్రామాల పరిధిలో సంచరిస్తున్న చిరుతను వెంటనే పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.



