Friday, June 19, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎరువుల కోసం కేంద్రంపై యుద్ధమే

ఎరువుల కోసం కేంద్రంపై యుద్ధమే

- Advertisement -

వీబీ గ్రామ్‌జీ అమలుపై మంత్రి వర్గ ఉప సంఘం
ఈ నెల 30న రైతు భరోసా
సర్కార్‌ గుర్తించిన ఏడు రకాల సన్నాలకే బోనస్‌
ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌‌కు లేదు
ఇక నుంచి పేపర్‌లెస్‌ విధానంలో మంత్రి వర్గ సమావేశాలు
క్యాబినెట్‌ ‌నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు

​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల సరఫరాపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌‌లోని బీఆర్‌. అంబేడ్కర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి అధ్యక్ష‍తన జరిగిన అనధికార మంత్రి వర్గ సమాశంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్‌, రాష్ట్రంలో వీబీ గ్రామ్‌‌జీ అమలు తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క క్యాబినెట్‌ ‌నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో పండుతున్న పంటలను కేంద్ర సంస్థలు తగిన స్థాయిలో కొనుగోలు చేయకపోవడంపై మంత్రి వర్గం ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా ధాన్యం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా పత్తి, నాఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించాలని డిమాండ్ చేశారు. నెలకు రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయిస్తామని హామీ ఇచ్చిన కేంద్రం, గత కొన్ని నెలలుగా ఆ మేరకు సరఫరా చేయడం లేదని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా ఫలితం లేదన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో ఉత్పత్తి అవుతున్న యూరియాలో అధిక భాగాన్ని తెలంగాణకు కేటాయించాలని డిమాండ్‌ ‌చేశారు.

స్థానికంగా ఉత్పత్తి అవుతున్న ఎరువులను రాష్ట్ర రైతులకు అందించడం ద్వారా రవాణా వ్యయాలు తగ్గడంతో పాటు వ్యవసాయ సీజన్‌లో ఎరువుల కొరతను నివారించవచ్చని పేర్కొన్నారు. పంటల కొనుగోలు, ఎరువుల సరఫరాపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మంత్రులు, ఎంపీలు త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని కలవనున్నట్టు తెలిపారు. అక్కడి నుంచి సానుకూల స్పందన రాకుంటే ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) స్థానంలో జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వీబీ గ్రామ్‌‌ జీ పథకం ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, సీతక్క సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అధ్యయనం చేసి, తెలంగాణపై పడే ఆర్థిక భారం ఎంతుంటుందో కమిటీ అంచనా వేయనుందన్నారు. ఉప సంఘం నివేదిక అధారంగా అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.  ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జూన్ 30న ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే రైతు సమ్మేళనంలో విడుదల చేయనున్నట్టు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రైతు భరోసా నిధులను నేరుగా జమ చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న బోనస్‌ను ఏడు  సన్నరకాల వరి వంగడాలకు కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిపారు. బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్-15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638, డబ్ల్యూజీఎల్-44, కేఎన్‌ఎం-7715 వరి వంగడాలకు మాత్రమే వర్తిస్తుందని వివరించారు. మార్కెట్ డిమాండ్, వినియోగదారుల అభిరుచులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఈ ఏడాది నమోదయ్యే అవకాశం ఉండటం, మధ్య మధ్యలో పొడి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తొలి వర్షాలు పడగానే విత్తనాలు వేయడానికి తొందరపడవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి, విత్తనాలు వేయాలని రైతులకు సూచించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిపారు. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా ప్రతిపాదించిన రుణానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరనున్నట్టు చెప్పారు.

తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు హైదరాబాద్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌‌కు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. పేపర్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను డిజిటల్‌ ‌విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ బుక్ ద్వారానే మంత్రులకు క్యాబినెట్ సమావేశం ఎజెండా అందజేస్తామని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు స్పెషల్ ట్యాబ్ లను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా అందజేసినట్టు వివరించారు. ఈ నెల 21న జరిగే నీట్ పరీక్షలకు హాజరయ్యే 2.95 లక్ష‍ల మంది విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచిత ప్రయాణం పొందవచ్చన్నారు. ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌‌కు లేదని మంత్రులు తెలిపారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ఈ రబీ సీజన్‌‌లో దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.18,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో కొనుగోళ్లపై రైతులకు దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే చెల్లించిందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -