ఫీజు బకాయిల చెల్లింపులపై వివరణ ఇవ్వండి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుల విషయంలో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలను ఎప్పటిలోగా విడుదల చేస్తారో నిర్దిష్టంగా వెల్లడించాలని సూచించింది. బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోతే కళాశాలల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించిన న్యాయస్థానం, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని చెప్పడం వల్ల ప్రస్తుత అడ్మిషన్ల ప్రక్రియ ఎలా కొనసాగుతుందో వివరించాలని కోరింది. బకాయిలతో పాటు విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలు ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి బుధవారం విచారణ నిర్వహించారు.
పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, గతంలో జారీ చేసిన ఒక జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుని కొత్త జీవో తీసుకొచ్చిందనీ, బకాయిల మొత్తాలను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించిందని తెలిపారు. రీయింబర్స్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకుండానే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం చెల్లించాలని కోరుతోందని వివరించారు. దీంతో బకాయిల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని కోరగా, అంత సమయం ఇవ్వలేమని పేర్కొన్న హైకోర్టు బకాయిల చెల్లింపులపై నిర్దిష్ట తేదీతో కూడిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
యువకుడి మృతిపై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
సూర్యాపేట జిల్లాకు చెందిన నిఖిల్ 2022లో అనుమానాస్పదంగా మృతి చెందడంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. హత్య, బెదిరింపులు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరం జరిగి ఉండవచ్చన్న కోణాలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ, కాల్‌డేటా, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ తదితర సాక్ష్యాలను మళ్లీ పరిశీలించాలని సూచించింది. మెడికల్ నివేదికను నిపుణులతో పునఃపరిశీలన చేయించడంతో పాటు పోలీసు, సీఐడీ దర్యాప్తు రికార్డులన్నింటినీ సీబీఐకి అందజేయాలని ఆదేశించింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి అవసరమైన నివేదికలను కుటుంబ సభ్యులకు అందించాలని పేర్కొంది. కుమారుడు అదృశ్యమైన కొద్ది రోజులకే గాయాలతో మృతదేహం లభించినప్పటికీ నిష్పాక్షిక దర్యాప్తు జరగలేదని ఆరోపిస్తూ నిఖిల్ తండ్రి దారావత్ భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎ.తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు నిఖిల్‌ది ఆత్మహత్య కాదని, ప్రేమ వ్యవహారానికి సంబంధించిన బెదిరింపులు, దాడులే మరణానికి కారణమై ఉండవచ్చని వాదించారు.
సీసీటీవీ ఫుటేజీ, కాల్‌డేటా, లొకేష్ వివరాలను సమగ్రంగా పరిశీలించకుండా, పోస్టుమార్టం నివేదిక రాకముందే ఆత్మహత్యగా నిర్ధారించారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు దర్యాప్తు నిష్పాక్షికంగానే జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి, పంచనామా వివరాల్లో శరీరంపై పలు గాయాలు నమోదయ్యాయనీ, మరణ కారణంపై స్పష్టత కోసం ఫోరెన్సిక్ పరీక్షలు అవసరమని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నిర్ధారణలు వెలువడకముందే దర్యాప్తు ఆత్మహత్య కోణంలో సాగినట్లు రికార్డులు సూచిస్తున్నాయనీ, కీలక ఎలక్ట్రానిక్ సాక్ష్యాల భద్రత, వైద్య నివేదికల విషయంలో లోపాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఎస్టీ యువకుడితో సంబంధాన్ని యువతి కుటుంబం వ్యతిరేకించిన కోణంలో కూడా సమగ్ర దర్యాప్తు జరగలేదని పేర్కొంటూ, వాస్తవాలను వెలికితీసేందుకు స్వతంత్ర దర్యాప్తు అవసరమని తేల్చి కేసును సీబీఐకి బదిలీ చేశారు.
హెచ్‌సీఏ అప్పీల్ విచారణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ, దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని హెచ్‌సీఏ, సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ అనంతరం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్ రావును ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే నిష్పాక్షిక దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను జిందాతిలిస్మాత్ క్రికెట్ క్లబ్, ఎస్ఏ అంబర్‌పేట క్రికెట్ క్లబ్, సాగర్ క్రికెట్ క్లబ్‌లు సవాలు చేశాయి. చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు అప్పీలుదారుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, హెచ్‌సీఏకు చెందిన అన్ని ఆర్థిక, సాంకేతిక వ్యవహారాలపై ఏకసభ్య కమిషన్ పర్యవేక్షణ విధించడం సముచితం కాదన్నారు. కొందరిపై వచ్చిన ఆరోపణల ఆధారంగా మొత్తం కమిటీని తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు. తదుపరి విచారణను జులై 21కు వాయిదా వేసింది.
రీపోస్ట్‌మార్టానికి వీలుందో లేదో చెప్పండి
హైకోర్టు ఆదేశాలతో రీ–పోస్టుమార్టం అంశం పరిశీలనలోకి వచ్చింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు మృతి కేసులో రీ–పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉందో లేదో తెలియజేయాలని పోలీసు అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది ద్వారా పోలీసుల నుంచి స్పష్టమైన సూచనలు తీసుకురావాలని పేర్కొంది. మరణానికి గల వాస్తవ కారణాలు వెలుగులోకి రావాలంటే రీ–పోస్టుమార్టం అవసరమని, అందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, రీ–పోస్టుమార్టం నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. అలాగే కేసు దర్యాప్తుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
బాల్క సుమన్‌కు షరతులతో బెయిల్
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ కె. సుజనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి భవన్‌కు చెందిన జూనియర్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత మే 26న హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్లో ఆయన చేసిన ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందనీ, సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయడం, అగ్నిప్రమాదాలకు పాల్పడడం, రైల్వే పట్టాలను దెబ్బతీయడం వంటి చర్యలకు ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తొలుత నాంపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 211/2026గా కేసు నమోదు కాగా, అనంతరం దానిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి క్రైమ్ నంబర్ 489/2026గా తిరిగి నమోదు చేశారు. రాజకీయ కక్షసాధింపుతోనే తప్పుడు కేసులో ఇరికించారని బాల్క సుమన్ తరపు న్యాయవాది వాదించారు. ప్రసంగం అనంతరం ఎలాంటి హింసాత్మక ఘటనలు, ఆస్తుల ధ్వంసం లేదా అల్లర్లు జరగలేదనీ, కేవలం ఊహాగానాల ఆధారంగానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. బాల్క సుమన్ చేసిన వీడియో ఆధారాలు కూడా ఉన్నాయనీ, ప్రజలు, ఆస్తుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు చేయరాదని పీపీ కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సీఎంకు హైకోర్టులో ఊరట
ఎన్నికల ప్రచారం కేసులు కొట్టివేత
హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి టీపీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన ఐదు క్రిమినల్ కేసులను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్న సమయంలో అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనీ, లౌడ్స్పీకర్లను వినియోగంతో ప్రజలకు అసౌకర్యం కలిగించారనే ఆరోపణలతో అధికారులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన పేరుతో నమోదైన ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కె. సుజన, నిబంధనలకు అనుగుణంగా కేసులు నమోదు కాలేదనీ, ఆరోపణలకు తగిన ఆధారాలు కూడా లేవని తేల్చారు. ఇదే వ్యవహారంలో ప్రధాన నిందితుడిపై నమోదైన కేసును ఇప్పటికే కోర్టు కొట్టివేసిన విషయాన్ని తీర్పులో పేర్కొన్నారు.



