తన శాఖ పథకంలో తనకే రూ.99 లక్షల సబ్సిడీ!
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి నిర్వాకం
అదే స్కీంలో కేంద్ర కార్యదర్శి కుటుంబానికీ రూ.1.16 కోట్లకుపైగా లబ్ధి
పథకం రైతుల కోసమా…అధికారంలో ఉన్నవారి కోసమా?
మోడీ చెప్పే నైతిక ప్రమాణాలు, పారదర్శకత ఇవేనా?
కేంద్ర ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి విఫలమైన మోడీ సర్కారు.. ఇప్పుడు వారి కోసం ఉద్దేశించిన పథకాలను దుర్వినియోగపరుస్తోందనే వార్తలు వస్తున్నాయి. మోడీ పాలనలో ప్రభుత్వ పథకాలు అధికారంలో ఉన్నవారికి లబ్ధి చేకూర్చేలా మారుతున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన శాఖ పరిధిలోని పథకం ద్వారా రూ.99 లక్షల సబ్సిడీ పొందగా, మరోవైపు కేంద్ర ఐఏఎస్ అధికారి నరేశ్ పాల్ గంగ్వార్ కుటుంబ సభ్యులు అదే పథకం కింద రూ.1.16 కోట్లకుపైగా సబ్సిడీలు పొందారు. ఈ విషయం ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో మోడీ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పుకునే పారదర్శకత, నైతిక ప్రమాణాలపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి తన శాఖ పరిధిలో అమలవుతున్న ఒక ప్రభుత్వ పథకం కింద తన సొంత దోసకాయ సాగు ప్రాజెక్టు కోసం దాదాపు రూ.99 లక్షల ప్రభుత్వ సబ్సిడీ పొందిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పథకాన్ని అమలు చేసే నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ)లో ఆయన పదవీరీత్యా ఎక్స్-అఫీషియో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఒకపక్క బోర్డులో ఒక ప్రభావవంతమైన స్థానాన్ని కలిగి ఉండి.. మరోపక్క అదే బోర్డు పర్యవేక్షించే పథకం కింద సబ్సిడీ పొందడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో ఇది ‘విరుద్ధ ప్రయోజనాల’ (కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) కిందకు వస్తుందనే చర్చా మొదలైంది. ఈ విషయాన్ని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దర్యాప్తు కథనం వెల్లడించింది.
ఏమిటీ పథకం?
ఈ సబ్సిడీ.. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్)లో భాగమైన ‘‘డెవలప్మెంట్ ఆఫ్ కమర్షియల్ హార్టికల్చర్ త్రూ ప్రొడక్షన్ అండ్ పోస్ట్-హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్’’ అనే పథకం కింద మంజూరైంది. ఈ పథకం ఉద్దేశం దేశంలో పెద్దఎత్తున వాణిజ్యపరంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం. ఇందులో ప్రధానంగా దోసకాయ, టమాటా, క్యాప్సికం, అలాగే గులాబీ, ఆర్కిడ్, ఆంథూరియం, లిల్లీ తదితర పూల సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వరకు, గరిష్ఠంగా ఒక కుటుంబానికి రూ.1 కోటి వరకు సబ్సిడీ అందుతుంది.
కేంద్రమంత్రి ప్రాజెక్టుకు సబ్సిడీ ఇలా..
రాజస్తాన్‌లోని డీడ్వానా-కుచమన్ జిల్లా పీహ్ గ్రామంలో భగీరథ్ చౌదరికి వ్యవసాయ భూమి ఉంది. అక్కడ 16,592 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దోసకాయ సాగు కోసం నాలుగు పాలీహౌస్‌లు, కృత్రిమ చెరువులు, ఇతర సదుపాయాలతో కూడిన ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.1.99 కోట్లు. దీనిలో రూ.49.80 లక్షలు ఆయన స్వంత పెట్టుబడిగా ఉంది. అలాగే రూ.1.49 కోట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి టర్మ్ లోన్ కాగా.. రూ.99.03 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందింది. భగీరథ్ చౌదరి ప్రాజెక్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికారిక బోర్డుపై ఇది ‘నేషనల్ హార్టీకల్చర్ బోర్డ్ అసిస్టెడ్ ప్రాజెక్ట్’ అనీ, 50 శాతం (రూ.99.60 లక్షలు) సబ్సిడీ అని కూడా పేర్కొన్నారు.
ఏడాదిలోపే పూర్తైన ప్రక్రియ
గతేడాది ఏప్రిల్ 15న కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి ఈ పథకం కింద సబ్సిడీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. అదే ఏడాది ఏప్రిల్ 29న, అంటే కేవలం 14 రోజుల్లోనే ప్రాథమిక అనుమతి లభించింది. అనంతరం బ్యాంకు, ఎన్‌హెచ్‌బీ, ఉద్యానవన శాఖ అధికారులు కలిసి భగీరథ్ చౌదరి ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ఈ ఏడాది మార్చి 11న అధికారులు తుది ఆమోదం ఇచ్చారు. మార్చి 30న రూ.99.03 లక్షల సబ్సిడీ నేరుగా కేంద్రమంత్రి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఈ ప్రక్రియ అంతా ఏడాదిలోపే పూర్తి కావడం గమనార్హం.
మంత్రి పాత్ర ఏమిటీ?
నేషనల్ హార్టికల్చర్ బోర్డు నిర్వహణ మండలికి కేంద్ర వ్యవసాయ మంత్రి పదవీరీత్యా ఎక్స్ అఫీషియో అధ్యక్షుడు. వ్యవసాయ శాఖ సహాయ మంత్రి ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షుడిగా ఉంటారు. బోర్డు వెబ్సైట్లో ఎక్స్ అఫీషియో ఉపాధ్యక్షుడిగా భగీరథ్ చౌదరి పేరు, ఆయన అధికారిక ఈ-మెయిల్ కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వ పథకం కింద ప్రాజెక్టులకు తుది ఆమోదం ఇచ్చేది ప్రత్యేక ప్రాజెక్ట్ అప్రూవల్ కమిటీ. ఆ కమిటీలో మంత్రి లేదా సహాయ మంత్రి సభ్యులు కాదని నిబంధనలు చెప్తున్నాయి. అందువల్ల సాంకేతికంగా చౌదరి తన సొంత ప్రాజెక్టును తానే ఆమోదించలేదు. అయినప్పటికీ, తాను బాధ్యత వహిస్తున్న శాఖ పథకం ద్వారా తానే లబ్ధిదారుడిగా ఉండటం నైతికంగా సరైందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
భగీరథ్ చౌదరి నుంచి స్పందన కరువు
ఈ విషయంలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ భగీరథ్ చౌదరికి పలు ప్రశ్నలు సంధించింది. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? కేంద్ర మంత్రిగా తన సొంత శాఖలో అమలవుతున్న పథకం కింద సబ్సిడీ తీసుకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించింది. అయితే వీటికి సంబంధించి కేంద్రమంత్రి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని తెలిసింది. సాధారణ రైతులకు రుణాలు, సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందే విషయంలో సవాలక్ష షరతులు పెట్టే ప్రభుత్వ పథకాలు, బ్యాంకులు.. కేంద్ర మంత్రికి ఏడాది లోపే సబ్సిడీ ఎలా మంజూరు చేశాయని సామాజిక కార్యకర్తలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ దరఖాస్తు
ఈ పథకానికి కేంద్ర మంత్రి గతంలోనూ దరఖాస్తు చేశారు. 2018లో కూడా ఈ పథకానికి అప్లై చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి. అయితే హార్డ్‌కాపీ ఆలస్యంగా అందడంతో ఆ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అదే ఏడాది ఆయన కుమారుడు కూడా దరఖాస్తు చేయగా.. ప్రాజెక్టులోని నిర్మాణం పథక నిబంధనలకు అనుగుణంగా లేదని అధికారులు తిరస్కరించారు. దీంతో మోడీ ప్రభుత్వంలో రైతుల కోసం ఉద్దేశించిన పథకాల అమలు తీరులో అనేక అనుమానాలు నెలకొంటున్నాయి.
కేంద్రమంత్రి ఆస్తులు
భగీరథ్ చౌదరి గతేడాది మార్చి 31 నాటికి ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించిన ఆస్తుల వివరాల్లో మొత్తం రూ.4.41 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు. పీహ్ గ్రామంలోని భూములు కూడా అందులో పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో ఈ ఎన్‌హెచ్‌బీ ప్రాజెక్టు వివరాలు అందులో లేవు. దీనిపై స్పందించిన ఆయన కార్యాలయం.. ‘ప్రాజెక్టు వివరాలు ప్రభుత్వానికి వెల్లడిస్తాం’ అని తెలిపింది.
ఐఏఎస్ అధికారి కుటుంబానికీ భారీ సబ్సిడీలు
ఈ దర్యాప్తులో మరో అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్న నరేశ్ పాల్ గంగ్వార్ (1994 బ్యాచ్ రాజస్తాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి) కుటుంబ సభ్యులు కూడా ఇదే ఎన్‌హెచ్‌బీ పథకం కింద భారీ సబ్సిడీలు పొందారు. దీని విలువ రూ.1.16 కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఆయన తల్లి బిందుమతి దోసకాయ సాగు కోసం గతేడాది జనవరిలో రూ.46.03 లక్షల సబ్సిడీని అందుకున్నారు. అలాగే ఆయన కుమారుడు కుమార్ వృత్విక్ చేపట్టిన దోసకాయ సాగు ప్రాజెక్టుకు సైతం 2023 మార్చిలో రూ.46.49 లక్షల సబ్సిడీ అందింది. ఇక ఐఏఎస్ భార్య డాక్టర్ రంజితా సింగ్ చేపట్టిన ప్రాజెక్టుకు రూ.24.36 లక్షలు ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ ప్రక్రియ మొత్తం 2021-22లో జరిగింది. అయితే ఈ మూడు ప్రాజెక్టులూ రాజస్తాన్‌లోని జైపూర్‌లోనే ఉన్నాయి.
ఆస్తుల ప్రకటనపై వివాదం
గంగ్వార్ 2021-22 ఆస్తుల ప్రకటనలో ఒక ప్రాజెక్టు వివరాలను మాత్రమే పేర్కొన్నారు. మిగిలిన వాటి గురించి వెల్లడించలేదు. అయితే దీనిపై గంగ్వార్‌ను ప్రశ్నించగా.. తన తల్లి, కుమారుడు తనపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కాదనీ, అందువల్ల నిబంధనల ప్రకారం వారి ఆస్తులు, ప్రాజెక్టులను తన వార్షిక ఆస్తుల ప్రకటనలో వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే 2024-25 ఆస్తుల ప్రకటనలో భార్య, తల్లి, కుమారుడు, కుమార్తె పేర్లపై ఉన్న వ్యవసాయ భూమిలో ఎన్‌హెచ్‌బీ పథకం కింద సుమారు రూ.50 లక్షల ప్రాజెక్టు ఆమోదం పొందిన విషయాన్ని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఓ ప్రభుత్వ పథకం కింద కేంద్ర మంత్రి, ఐఏఎస్ అధికారి కుటుంబాలు సబ్సిడీలు పొందడం చట్టవిరుద్ధం కాకపోయినా.. నైతికంగా ఇది సరికాదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. పథకం నిబంధనల ప్రకారం వారు అర్హులై ఉండవచ్చు. అయితే, తమ అధికార పరిధిలో ఉన్న ప్రభుత్వ పథకాల నుంచే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కుటుంబాలు లబ్ధి పొందడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని అంటున్నారు.
దోసకాయ సాగుతో దోచుకున్నారు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



