కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మైనింగ్ లీజు ఇవ్వాలి
సీసీఐని పునరుద్ధరిస్తే ఆరు వేల మందికి ఉపాధి:
కేంద్ర మంత్రి కుమారస్వామికి కేటీఆర్ బృందం వినతి
కేంద్ర మంత్రి కుమారస్వామికి కేటీఆర్ బృందం వినతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను వెంటనే తెరిపించాలని కేటీఆర్ నేతృత్వంలోని బృందం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నాడిక్కడ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డీ. కుమారస్వామితో ఈ బృందం భేటి అయింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్న, బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, సీసీఐ సాధన సమితి సభ్యుల బృందం ప్రతినిధుల పాల్గొన్నారు. దాదాపు అరగంట సేపు సాగిన ఈ సమావేశంలో ప్లాంట్ పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న ఆటంకాలను కేటీఆర్ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 1980వ దశకంలో ఏర్పాటైన ఈ ప్లాంట్ ఒకప్పుడు 6000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించి జీవనాధారంగా నిలిచిందన్నారు. ఇక్కడ రాబోయే 100 ఏండ్లకు సరిపడా లైమ్‌స్టోన్ (సున్నపురాయి) నిల్వలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల ఈ ప్లాంట్‌ను తిరిగి విజయవంతంగా నడపడానికి అన్ని రకాల అవకాశాలు సంపూర్ణం గా ఉన్నాయని వివరించారు. కాగా సీసీఐ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి అనంతరం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడ 2300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, అందులో 770 ఎకరాలు కంపెనీకి చెందిన పట్టా ల్యాండ్ కాగా, 1500 పైచిలుకు ఎకరాలు లీజ్ ల్యాండ్ రూపం లో ఉందని పేర్కొన్నారు.
ఇక్కడ రూ. 2000 కోట్ల పెట్టుబడితో సరికొత్త ఫ్యాక్టరీని పెట్టినట్టయితే చాలా బాగుంటుందని కేంద్ర మంత్రి అభిప్రా యపడ్డారని చెప్పారు. అయితే సీసీఐ ప్లాంట్ పునఃప్రారంభం కావడానికి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహం, చిత్తశుద్ది ఎంతో అవసరమన్నారు. కేంద్రం అడిగిన వివరాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం ఎలాంటి ప్రతిపాదన లు చేస్తుందో, ఎంత పెట్టుబడి పెడుతుందో వెంటనే బహిరంగంగా ప్రకటించాల ని డిమాండ్ చేశారు. మారుమూల ప్రాంతానికి చెందిన వేలా దిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సీసీఐ ప్లాంట్‌ను తిరిగి తెరిపించే వరకు బీఆర్ఎస్ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని నేతలు స్పష్టం చేశారు. 2019 పార్లమెంట్ ఎన్ని కల ప్రచారంలో అమిత్ షా, ఆనాటి సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ ఈ ప్లాంట్‌ను తప్పకుండా తెరిపిస్తామని స్వయంగా హామీ ఇచ్చారన్నారు. కానీ నేడు క్షేత్రస్థాయిలో దీన్ని తెరిపించాల్సింది పోయి తుక్కు (స్క్రాప్) కింద మార్చి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



