నాలుగో రోజూ క్షిపణుల జ్వాలలు
ఇరాన్ విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలను కూల్చేస్తాం : అమెరికా
మరిన్ని ఇంధన మార్గాలను మూసేస్తాం : ఇరాన్
నవతెలంగాణ – జనరల్ డెస్క్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారేలా కన్పించడం లేదు. అమెరికా సైన్యం మంగళవారం వరుసగా నాలుగో రోజు రాత్రి కూడా ఇరాన్‌పై దాడులు చేసింది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత అమెరికా సేనలు దాడులను ఉధృతం చేశాయి. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సముద్రయాన కారిడార్లపై పెత్తనం కోసం అమెరికా ప్రయత్నిస్తే మరిన్ని ఇంధన మార్గాలను మూసివేస్తానని హెచ్చరించింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ దళాలు బుధవారం జోర్డాన్, కువైట్, బహ్‌రైన్‌పై విరుచుకుపడ్డాయి. జోర్డాన్‌లోని అజ్రక్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక ఆస్తులపై ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇరాన్ కనుక చర్చలకు రాకపోతే వచ్చే వారం దాని విద్యుత్ ప్లాంట్లను, బ్రిడ్జిలను ధ్వంసం చేస్తానని ట్రంప్ బెదిరించారు. ‘చివరి వరకూ ఇంధన లక్ష్యాల జోలికిపోను. చివరగా వాటి పైనే దాడి చేస్తాం’ అని చెప్పారు. మధ్యప్రాచ్యంలో ఘర్షణలు కొనసాగుతుండడంతో చమురు ధరలు బుధవారం మరో రెండు శాతం పెరిగాయి.
భారత మెరైన్ ఇంజినీర్ మృతి
సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌక జీఎఫఎస్ గెలాక్సీపై ఒమన్ తీరంలో ఇరాన్ జరిపిన దాడిలో గాయపడిన భారతీయ మెరైన్ ఇంజినీర్ హేరంబ్ కర్మార్కర్ (30) చనిపోయాడు. ఈ మేరకు కంపెనీ నుంచి తమకు సమాచారం అందిందని కర్మార్కర్ మామ వివేక్ టాండన్ రాయిటర్స్ వార్తా సంస్థకు తెలియజేశారు. కర్మార్కర్ మృతితో మూడు రోజుల వ్యవధిలో ఇరాన్ దాడులలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య రెండుకు చేరింది. రెండు ఎమిరేట్స్ చమురు ట్యాంకర్లపై ఇరాన్ చేసిన దాడిలో మన దేశానికి చెందిన ఓ నావికుడు మరణించగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా దాడి… ఏడుగురు మృతి
అమెరికా దాడుల్లో ఇప్పటి వరకూ 30 మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం సమాచారం అందించగా ఓ సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఏడుగురు సిబ్బంది మరణించారని, అనేక మంది గాయపడ్డారని టెహ్రాన్ మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది. బంపర్‌లోని సైనిక స్థావరంలోని అతిథి గృహం, గార్డు పోస్ట్‌లు, నివాస ప్రాంగణాలపై మంగళవారం రాత్రి అమెరికా దళాలు 13 క్షిపణులను ప్రయోగించాయని వివరించింది. ఇరాన్ క్షిపణి – డ్రోన్ కేంద్రాలు సహా హార్ముజ్ సమీపంలోని అనేక సైనిక లక్ష్యాలపై అమెరికా దాడులు చేసింది. హోవేజెహ్ నగరంలో ఉన్న గోధుమ నిల్వ కేంద్రాన్ని కూడా అమెరికా వదలలేదు.
రక్షణ బిల్లును అడ్డుకున్న డెమొక్రాట్లు
అమెరికా సెనెట్‌లో ట్రంప్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. 1.15 ట్రిలియన్ డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లును సెనెట్‌లోని డెమొక్రాట్లు అడ్డుకున్నారు. ఇరాన్ యుద్ధంతో తాము విసిగిపోయామని అంటూ అమెరికా సేనలను యుద్ధభూమికి పంపే ముందు కాంగ్రెస్‌ను ట్రంప్ సంప్రదించలేదని విమర్శించారు. ‘ఎలాంటి అనుమతులు, వ్యూహం లేకుండా ట్రంప్ యుద్ధాన్ని మొదలు పెట్టారు. దాని నుంచి ఎలా బయటికి రావాలో కూడా ఆయనకు తెలియడం లేదు’ అని సెనెట్‌లో డెమొక్రాట్ నేత, న్యూయార్క్ సెనెటర్ చక్ స్కూమర్ వ్యాఖ్యానించారు. బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. బిల్లుకు అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 46 ఓట్లు వచ్చినప్పటికీ వంద మంది సభ్యులున్న సెనెట్ నుంచి బిల్లు ముందుకు పోవాలంటే 60 ఓట్లు అవసరమవుతాయి. బిల్లును రిపబ్లికన్ సభ్యులందరూ బలపరిచారు. పెంటగాన్ భారీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపితే ఇరాన్ యుద్ధాన్ని సమర్ధించినట్లు అవుతుందని డెమొక్రాట్లు అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రజల కోసం ఉద్దేశించిన సామాజిక కార్యక్రమాలకు కోత పెడుతూ సైనిక బడ్జెట్‌ను ఒకటిన్నర ట్రిలియన్ డాలర్లకు పెంచాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నాలను కూడా వారు వ్యతిరేకించారు. ఈ మొత్తానికి అదనంగా బడ్జెట్ రీకన్సిలియేషన్ ప్రక్రియ కింద మరో 350 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ను ట్రంప్ కోరారు. దీనికి కాంగ్రెస్ ఓకే చెబితే డెమొక్రాట్ల మద్దతు అవసరం లేకుండానే నిధులు మంజూరు అవుతాయి.
అందరూ కలిసే చేయాలి..
లేదంటే ఎవరూ చేయొద్దు.. చమురు వ్యాపారంపై ఇరాన్
పశ్చిమాసియాలో చమురు ఎగుమతులు చేస్తే అన్ని దేశాలు కలిసే చేయాలని.. లేదంటే ఎవరూ చేయకూడదని ఇరాన్ స్పష్టం చేసింది. బహ్రెయిన్ లోని యూఎస్ నేవీ స్థావరంపై ఐఆర్‌జీసీ దాడులు చేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమను కాదని ముందుకు వెళ్తే.. అమెరికా మిత్రదేశాల చమురు, గ్యాస్ ఎగుమతి మార్గాలను కూడా లక్ష్యంగా చేసుకుంటా మని.. పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ ఎగుమతుల మొత్తాన్ని ఆపుతామని హెచ్చరించింది.
‘హార్ము జ్ జలసంధిపై నియంత్రణ సాధించామని చెబుతూ.. అమెరికా నిన్న రాత్రి హిందూ మహా సముద్రంలో సముద్రపు దొంగలను మోహరించింది. నౌకల రాకపోకలకు మార్గాలను మూసివేసి.. చమురు, గ్యాస్‌లను ప్రపంచానికి అందకుండా చేసింది. దీనివల్ల ఆ దేశ ఆర్థిక ప్రత్యర్థుల ప్రయోజనాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వారి దుర్మార్గాలకు తగిన బుద్ధి చెప్పడానికి మా దళాలు బహ్రెయిన్‌లోని 5వ ఫ్లీట్ బేస్‌పై విజయవంతంగా దాడి చేశాయి. ఈ దాడుల్లో ఎన్‌ఎస్‌ఐ మేనేజ్‌మెంట్ సెంటర్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. పశ్చి మాసియాలో వ్యాపారం చేస్తే అందరూ కలిసే చేయాలి. లేదంటే ఎవరూ చేయకూడదు’ అని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయిల్
ఓ వైపు అమెరికా-ఇరాన్‌లు పరస్పర దాడులు చేసుకుంటుంటే.. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో గాజాలోని ఓ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఇరాన్‌కు సహకారాన్ని ఆపడానికి చైనా కృషి చేయట్లేదు: అమెరికా రాయబారి
ఇతర దేశాలపై దాడులు చేయడానికి ఇరాన్‌కు పలు చైనా కంపెనీలు సహకరిస్తున్నాయని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ట్ ఆరోపించారు. ఈ విషయంలో చైనా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. హూతీలపై ఆయుధాల నిషేధాన్ని విధించిన ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని కూడా పలు చైనా కంపెనీలు, ఇతర సంస్థలు ఉల్లంఘించాయని పేర్కొన్నారు.
మూతపడనున్న మరో జలసంధి
అమెరికా, దాని మిత్రదేశాలకు ఉపయోగపడుతున్న అన్ని ఎగుమతి కారిడార్లను మూసేస్తానని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) హెచ్చరికలు జారీ చేసింది. ఐఆర్‌జీసీ దళాలు ఇప్పటికే హార్ముజ్ జలసంధిని మూసేశాయి. తాను నిర్దేశించిన మార్గాలలో కాకుండా ఇతర కారిడార్లలో ప్రయాణం సాగిస్తున్న నౌకలపై దాడులు చేస్తున్నాయి. గత వారం రోజులలో ఇరాన్ ఏడు నౌకలపై దాడులు చేసిందని, ఈ దాడులలో 12 మంది సిబ్బంది చనిపోవడమో లేదా గాయపడడమో జరిగిందని అమెరికా ఆరోపించింది. ఇదిలావుండగా హౌతీలతో బాబ్ ఎల్- మందెబ్ జలసంధిని మూసివేయించాలని ఇరాన్ యోచిస్తోంది. అదే జరిగితే ఇంధన సరఫరాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది.
దాడులు ఉధృతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



