Wednesday, July 29, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యార్థులేమైనా ఉగ్రవాదులా?​

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?​

- Advertisement -

కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలి
మహిళలను అవమానించిన
ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖనా? : ప్ర‌తిప‌క్షాలు

2024 చట్టం కఠినంగా ఉంటే పేపర్ లీక్‌ ఎలా జరిగింది?
‘పేపర్‌ ‌లీకేజీ నిరోధక బిల్లు’లో మార్పులు కంటితుడుపు చర్య‌లే
మహిళలను అవమానించిన ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖా?
యాంటీ పేపర్ లీక్‌ బిల్లుపై చర్చలో ప్ర‌తిప‌క్షాల నిల‌దీత‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీశాయి. ‘‘నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలి. విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారు. వారిపై టియర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించారు. విద్యార్థులపై పెల్లెట్‌ గన్స్‌ ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేంద్ర ప్రభుత్వ వైఖరిపై యువత ఆగ్రహంతో ఉంది. దేశ యువతను చూసి కేంద్రం భయపడుతోంది’’ అని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. మంగళవారం లోక్‌స‌భ‌లో ప‌బ్లిక్ ఎగ్జామినేష‌న్స్ స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చ జ‌రిగింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌ల్లో క‌ఠిన శిక్ష అమ‌లు చేసేందుకు పేప‌ర్ లీకేజీ నిరోధ‌క బిల్లులో స‌వ‌ర‌ణ చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ లేదా స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ ఏవైనా లీకేజీ కేసుల్లో ద‌ర్యాప్తును కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో పూర్తి చేయనున్న‌ట్టు చెప్పారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు: కాంగ్రెస్‌ ‌నేత గౌర‌వ్ గొగోయ్‌
​ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై కంటే ఇన్‌స్టా రీల్స్ పైనే దృష్టి పెడుతున్నార‌ని కాంగ్రెస్ నేత‌ గౌరవ్‌ గొగోయ్‌ ఎద్దేవా చేశారు. పేపర్‌ లీక్‌లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే.. మోడీ మాత్రం రీల్స్‌ చేస్తూ కూర్చున్నారని ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టేందుకు ప్రభుత్వం 2024లో ప్రవేశపెట్టిన చట్టం కఠినంగా ఉంటే పేపర్ లీక్‌ ఎలా జరిగిందని ప్రశ్నించారు. లీకేజీ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఈ బిల్లుకు ప్రతిపాదించిన సవరణలను పరిశీలిస్తే.. అర్థవంతమైన మార్పును తీసుకురావాలని ప్రభుత్వం అనుకోవట్లేదనే విష‌యం తెలుస్తోందన్నారు. ఈ పరీక్షా సంస్కరణలు కేవలం కంటితుడుపు చర్యలేన‌ని, గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి హామీలే ఇచ్చిందని పేర్కొన్నారు. 2024 నీట్ పేప‌ర్ లీకేజీ జరిగినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, అప్పుడు కూడా ఎలాంటి లీకేజీ జరగలేదని కప్పిపుచ్చడానికి ఆయన ప్రయత్నించారని దుయ్యబట్టారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ నేతలు పార్లమెంట్‌లో ఘన స్వాగతం పలకడాన్ని తప్పుపట్టారు. తప్పును ఎదిరించి పోరాట స్ఫూర్తిని చాటిన విద్యార్థులకు గొగోయ్‌ ధన్యవాదాలు తెలిపారు. నిరసనకారులపై ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తించిందని విమర్శించారు. నిరసనకారులను అలా కొట్టాలని వారిని ఎవరు ఆదేశించారని ప్రశ్నించారు.

మోడీని కాపాడిన బీజేపీ : ఎస్పీ నేత అఖిలేశ్‌ యాద‌వ్‌
​ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి దించి ప్రధాని మోడీని బీజేపీ కాపాడిందని ఎస్పీ నేత‌ అఖిలేశ్‌ యాదవ్ అన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించేలా ఒత్తిడి తెచ్చిన యువత నిరసనలను ప్రశంసించారు. దేవాలయాల విరాళాలను దొంగిలించిన వారు.. ప్రశ్నపత్రాల లీకేజీని ఆపలేరని చ‌మ‌త్క‌రించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని వెనకబడిన వర్గాల విద్యా హక్కులను దోచుకుంటోందని ఆరోపించారు. ‘‘చట్టం అంత బలంగా ఉంటే బీజేపీ పదేండ్ల పాలనలో 20 పేపర్ లీకేజీలు ఎలా జరిగాయి?. ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త బిల్లు.. పాత బిల్లుకు చిన్న సవరణ మాత్రమే. అలాంటి ఈ బిల్లుతో ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నారు’’ అని ఆయన అడిగారు.

ఆర్ఎస్ఎస్ కబ్జాలో విద్యావ్యవస్థ
దేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ కబ్జా చేసిందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. 152 సార్లు పేపర్ లీక్స్‌ జరిగాయని, అయినా ఒక్కరిపైనా కూడా చర్యల్లేవని విమ‌ర్శించారు. ప్రతి ఏటా బడ్జెట్‌‌లో విద్యాశాఖ కేటాయింపులను తగ్గిస్తున్నారని అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరగాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారని ప్రశ్నించారు. విద్యార్థులపై లాఠీచార్జీ చేయాల్సిన అవసరం ఏమిటని కేంద్రాన్ని నిలదీశారు. ప్రశ్నపత్రాల లీక్‌తో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమ‌ర్శించారు. పేపర్‌ లీక్‌ ఘటనలకు కారణమైన మాఫియాను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. మహిళలను అవమానించిన ప్రహ్లాద్‌ జోషికి విద్యాశాఖ కేటాయించారని ఆరోపించారు.

కాగా ప్రతిపక్ష నేతల విమ‌ర్శ‌ల‌ను బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ తిప్పికొట్టారు. యూపీఏ హయాంలో 2014 కు ముందు ఏకంగా 22 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. ఇప్పుడు ప్రధాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌ నేతలు.. అప్పుడు రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. ఈ బిల్లుపై అభిషేక్ బెన‌ర్జీ (టీఎంసీ), సుప్రియా సులే (ఎన్‌సీపీ), ద‌యానిధి మారెన్ (డీఎంకే), ఎస్‌.వెంక‌టేష‌న్ (సీపీఐ(ఎం)), డింపుల్ యాద‌వ్ (ఎస్పీ), కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్‌), లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు (టీడీపీ), మ‌ద్దిల గురుమూర్తి (వైసీపీ), శ్రీకాంత్ షిండే (శివ‌సేన‌-షిండే), అనురాగ్ సింగ్ ఠాకూర్‌, తేజ‌శ్వీ సూర్య (బీజేపీ), అలోక్ కుమార్ సుమ‌న్ (జేడీయూ), అరుణ్ భార‌తీ (ఎల్‌జేపీ), ష‌ర్మిలా సర్కార్ (టీఎంసీ రెబ‌ల్‌) త‌దిత‌రులు మాట్లాడారు.

స్తంభించిన రాజ్య‌స‌భ‌ విద్యార్థులపై దాడికి నిరసనగా 
కొనసాగిన ​ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌
పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు జరిపిన దాడిపై హోం మంత్రి అమిత్ షా వివరణ కోరుతూ మంగళవారం ప్రతిపక్షాలు పార్లమెంటులో ఆందోళ‌న చేప‌ట్టాయి. లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు ఏమాత్రం తగ్గలేదు. నిరసన కొనసాగుతుండగానే మంత్రి జీతన్ రామ్ మాంఝీ చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభను గురువారం సమావేశానికి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -