నగర భరోసా కేంద్రంలో విచారణ
బాధితురాలి చెంప, మెడపై గాయాలు గుర్తించిన డాక్టర్లు
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితుడు ఉదయ్ ని డబ్ల్యూపీఎస్ పోలీసులు మంగళవారం సూర్యాపేట వద్ద అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు. పోలీస్ అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 18 న జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు సహచర మహిళా ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ఉదయ్ ను కేంద్ర డీపీటీఓ విభాగం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే రోజు సంజీవరెడ్డి నగర్ లోని సోదరుని ఇంటికి వెళ్లిన నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హాస్పిటల్‌లో చేరాడు.బాధితురాలితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగా తనపై కేసు పేటరంటూ సూసైడ్ నోట్ కూడా రాసుకున్నాడు. మూడు రోజుల పాటు చికిత్స పొందిన ఉదయ్ కృష్ణ రెడ్డి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఈ కేసు కొట్టివేయాలంటూ హై కోర్టు లో పిటిషన్ వేశాడు. దీనిపై కోర్టు లో విచారణ సాగుతుండగానే ఈ కేసు దర్యాప్తును అత్తాపూర్ పీఎస్ నుంచి నగర పీఎస్ కు మార్చారు.
తరువాత ఉదయ కృష్ణ రెడ్డి ని డీసీపీ లావణ్య పిలిపించి విచారించారు. విచారణ తరువాత వెళ్ళిపోయిన ఉదయ్ కృష్ణ రెడ్డి అప్పటినుంచి పోలీస్ లకు అందుబాటులోకి రాలేదని సమాచారం. చివరికి మంగళవారం సూర్యాపేట లో ఉదయ్ కృష్ణ రెడ్డి ఉన్నటు సమాచారం అందడం తో పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇక్కడ భరోసా కేంద్రంలో డీసీపీ లావణ్య , చార్మినార్ ఇన్స్పెక్టర్ జ్యోత్స్న లు ఉదయ కృష్ణ రెడ్డి ని విచారిస్తున్నారు. కాగా ఈ కేసు నమోదు అయినరోజు భాదితురాలికి చికిత్స జరిపిన డాక్టర్లు ఆమె మెడ గొంతు భాగం తో పాటు చెంప పైన , ఎడమ కాలు పైనా గాయాలు ఉనటు గుర్తించారు. ప్రస్తుతం ఉదయ కృష్ణ రెడ్డి ని విచారిస్తున్న అధికారులు నిందితుడి ని రాత్రి పొద్దుపోయిన తరువాత సంబధిత న్యాయమూర్తి ఎదుట అయినా నివాసం లో హాజరు పరిచే అవకాశం ఉందని తెలిసింది.



