మైనర్లను విడుదల చేయండి
మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో
సిట్‌ను ఏర్పాటు చేయాలి : రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పరీక్ష పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో అరెస్టయిన విద్యార్థుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి, వారిపై ఎలాంటి బలవంతపు, కఠిన చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం తన తాత్కాలిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 18 ఏండ్లలోపు వారిని, అలాగే ఎలాంటి నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన ధర్మాసనం మంగళవారం విద్యార్థులపై పోలీసుల తీరును తప్పుబట్టింది. రాజ్యాంగం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించిందని గుర్తు చేసింది. తక్షణమే మైనర్లను విడిచి పెట్టాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి మాత్రమే రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నిరసనకారుల పట్ల పోలీసులు తీసుకున్న చర్యలపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. వాళ్లు తమ వాదనలు వినిపించవచ్చని తెలిపింది. సీసీటీవీ ఫూటేజ్, డ్రోన్ రికార్డింగ్‌లు, వైర్లెస్ కమ్యూనికేషన్స్, ఇతర రికార్డులకు చెందిన వీడియోలను దాచిపెట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. అదే విధంగా పోలీసులు రికార్డు చేసిన నిరసనకారులకు చెందిన పర్సనల్ డేటా కానీ, వివరాలను కానీ పబ్లిష్ చేయవద్దని ఆదేశించింది. పెల్లెట్ గన్స్ వాడిన అంశంపైనా ధర్మాసనం వాదనలు విన్నది. నేర చరిత్ర లేని విద్యార్థులను తక్షణమే రిలీజ్ చేయాలని పేర్కొంది. ఆగస్టు 3న తదుపరి విచారణను చేపట్టనుంది.
స్వతంత్ర విచారణ జరగాల్సిందే
‘నిర్దోషులపై అతిక్రమణలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం ఊరుకోదు. తన పని తాను చేసుకుపోతుంది’ అని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఘటనలపై ‘స్వతంత్ర విచారణ’జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. విద్యార్థులకు, పోలీసులకు జరిగిన గాయాల పట్ల నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని పేర్కొంది. దీని కోసం మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కాగా ‘బాధ్యులను తేల్చనప్పుడు, విచారణకు అర్థమే లేదు’ అని సీజేఐ పేర్కొన్నారు.
శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధమైన హక్కు
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలపై న్యాయం కోరుతూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో, వారిపై బలాన్ని ప్రయోగించడం సరికాదని కోర్టు భావించింది. దేశవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో జరుగుతున్న నిరసనల సమయంలో శాంతిభద్రతల నిర్వహణకు, అల్లర్లను అదుపు చేయడానికి సంబంధించి ఒకే విధమైన (ఏకీకృత) ప్రొటోకాల్ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది. వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు వేర్వేరుగా ప్రవర్తించడం సరికాదని, నిర్దిష్ట నియమావళి ఉండాలని సూచించింది.
బీహార్, అసోంలో విద్యార్థులపై కేసుల ఉపసంహరణ
నీట్ పరీక్షా పత్రం లీకేజీలో అవకతవకలపై ఆందోళనలు చేపట్టిన విద్యార్థులకు ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులను బీహార్, అసోం ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయి. నిరసనకారులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని, వివిధ ఆరోపణల కింద జైలు పాలైన వారిని విడుదల చేస్తామని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే అసోంలో జులై 26 నాటికి నమోదైన ఐదు కేసుల్లో అరెస్టైన 13 మందితో పాటు, ఇరు రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్న నిరసనకారులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రతినిధులతో చర్చించిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చారు. అసోం, బీహార్ తరహాలోనే రాజస్తాన్‌లోనూ విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరిం చుకుంటామని తెలిపినట్టు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. కేంద్రం హామీలను ఉల్లంఘిస్తోందని, మళ్లీ ఉద్యమం చేస్తామని సోమవారం సీజేపీ ప్రతినిధులు హెచ్చరించిన నేపథ్యం లో ఆయా రాష్ట్రాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థులపై పోలీసుల చర్యపై
ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ పట్ల నేషనల్ హ్యూమనట్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.



