Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌హైకోర్టు తీర్పును గౌరవించండి

‌హైకోర్టు తీర్పును గౌరవించండి

- Advertisement -


అధికారంలోకి వచ్చిన మొదటి రోజే హైడ్రా రద్దు
యువతలో పెరుగుతున్న అసంతృప్తి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైకోర్టు ‌తీర్పును, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కేటీఆర్ కోరారు. హైడ్రా ఒక ‘నవగ్రహాల రాక్షసి’ (తొమ్మిది తలల మొసలి)లా మారిందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను చట్టబద్ధమైన పాలన కోసం కాకుండా రాజకీయ వేధింపులు, ఎంపిక చేసిన కూల్చివేతలు, వసూళ్లకు ఒక సాధనంగా వాడుకుంటోందని విమర్శించారు. హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను సమర్థించుకోవడం సిగ్గుచేటని తెలిపారు. ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థను గౌరవించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే, హైకోర్టు పరిశీలనల స్ఫూర్తికి అనుగుణంగా మొదటి రోజే హైడ్రాను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. 
సామాన్యుల ఇండ్ల కూల్చివేతలే లక్ష్యం
సామాన్య ప్రజల ఇండ్లను కూల్చివేయడమే హైడ్రా లక్ష్యంగా చేసుకుంటోందని కేటీఆర్‌ ‌విమర్శించారు. ప్రభుత్వంలోని ప్రభావవంతమైన రాజకీయ నాయకులు, మంత్రులు, ఎంపీలు, శక్తివంతమైన బిల్డర్ల ఆక్రమణలను మాత్రం పట్టిం చుకోవడం లేదని ఆరోపించారు. కోర్టు రక్షణలు ఉన్నప్పటికీ పేద కుటుంబాల ఇండ్లను కూల్చివేసిన ప్రభుత్వం, చెరువులు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని రాజకీయ నాయకుల అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను రక్షించాలనే నిజమైన సంకల్పం ఉంటే, మొదట వారి స్వంత నాయకులు, మంత్రులు, ప్రభావవంతమైన వ్యక్తుల అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్‌ ‌చేశారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలనీ, ఇది కాంగ్రెస్ నాయకులకు రక్షణ కవచంగా, పేదలకు వ్యతిరేకంగా ఆయుధంగా మారకూడదని కోరారు.

హైడ్రా పేరుతో విధ్వంసం
హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి హైదరాబాద్‌లో భారీ విధ్వంసం సృష్టిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. రెండేండ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు ఇండ్లు నిర్మించలేకపోయిందనీ, దానికి బదులుగా వేలాది ఇండ్లను కూల్చివేసిందని విమర్శించారు. గతంలో ఈవీడీఎంగా ఉన్న సంస్థను కేవలం హైడ్రాగా పేరు మార్చి, బ్లాక్‌మెయిల్‌, వసూళ్ల యంత్రాంగంగా మార్చారని ఆరోపించారు. టీడీఆర్ వ్యవస్థలో అక్రమాలకు సంబంధించి తన మునుపటి ఆరోపణలను గుర్తు చేస్తూ, భారీ ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడానికి కృత్రిమ డిమాండ్‌ను సృష్టించారని పేర్కొన్నారు. అనేక కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, రేవంత్ రెడ్డి పదే పదే న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారనీ, హైడ్రాను సమర్థించడం జవాబుదారీతనం కాదనీ, అహంకారానికి నిదర్శనమని తెలిపారు.

బీజేపీ-కాంగ్రెస్ మధ్య రహస్య బంధం
బీజేపీ “రహస్య రాజకీయ మిత్రుడు”గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి బంధువులకు సంబంధించిన కాంట్రాక్టులు, అవినీతి ఆరోపణల నుంచి రేవంత్ రెడ్డిని బీజేపీ రక్షిస్తోందనే విషయం అందరికీ తెలుసని తెలిపారు. రేవంత్ రెడ్డితో తమకు ఎలాంటి రాజకీయ బంధం అవసరం లేదనీ. తమ పోరాటం ఆయన ప్రజావ్యతిరేక ప్రభుత్వంపైనేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన తాము నిలబడతామని పేర్కొన్నారు.
యువతలో పెరుగుతున్న అసంతృప్తి
యువతలో పెరుగుతున్న అసంతృప్తి, అశాంతి కేవలం నీట్ సమస్యకు మాత్రమే పరిమితం కాలేదనీ, ఇది విద్య, ఉపాధి రంగంలో ఉన్న లోతైన సంక్షోభాన్ని ప్రతిబింబిస్తోందని కేటీఆర్‌ ‌తెలిపారు. యువత ఆకాంక్షలను, ఆవేదనను ప్రభుత్వాలు ఇలాగే నిర్లక్ష్యం చేస్తే భారతదేశంలో కూడా నేపాల్ తరహాలో భారీ స్థాయి ‘జెన్-జీ’ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. యువతలో పెరుగుతున్న ఆగ్రహాన్ని తృణీకరించకుండా రాజకీయ పార్టీలు తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. భారతదేశానికి ఇప్పుడు జవాబుదారీతనం, పారదర్శకత, దీర్ఘకాలిక సంస్థాగత సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. నిజమైన ఉద్దేశంతో తెచ్చే ఎలాంటి పరీక్షల సంస్కరణల చట్టానికైనా బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని, నందన్ నిలేకని కమిటీ ఏర్పాటును స్వాగతిస్తూనే, డాక్టర్ కె రాధాకృష్ణన్ కమిటీ సిఫారసుల అమలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ​

జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించొద్దు
జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించొద్దనీ, ఎక్కువ జనాభా వృద్ధి ఉన్న రాష్ట్రాలకు బహుమతి ఇవ్వకూడదని కేటీఆర్‌ ‌సూచించారు. మహిళా రిజర్వేషన్‌ను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం పట్ల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల పెంపునకు సంబంధించిన నిబంధనలు దశాబ్ద కాలంగా అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. ఈ విషయంలో జాతీయ ఏకాభిప్రాయం అవస రమనీ, దక్షిణ భారత రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమిష్టిగా చర్చించాలని కోరారు. పార్లమెంట్‌లో సరైన సమయంలో పునర్విభజనపై బీఆర్‌ఎస్ వివరణాత్మక వైఖరిని ప్రకటిస్తుందనీ, తెలంగాణ ప్రయోజనాలను గట్టిగా కాపాడుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -