కొన్ని ఘటనలు హృదయాన్ని కలచి వేస్తాయి. రాయటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ, అవి ఆ సమాజంలోని అంతర్గత సంక్షోభాన్ని, పతనాన్ని సూచిస్తాయి. భారతీయ సమాజంలో గురువుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. గురుశిష్యులు మధ్య అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయత, ఆధారాభిమానాలతో విలసిల్లిన ఈ నేలపై ఇటీవల జరుగుతున్న సంఘటనలు ఆ సంబంధంలో ప్రపంచీకరణ ప్రభావంతో వస్తున్న మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. విద్య, విలువలు, నైతికత, సామాజిక పతనం… ఇవన్నీ ఈ సమాజం మన ముందుంచిన బాధ్యతాయుతమైన ప్రశ్నలు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఉదంతం ఒక తాజా ఉదాహరణ. ఆమె నిర్వహిస్తున్న పాఠశాలలో పదవ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులే ఆమెను అత్యంత కిరాతకంగా 27 కత్తి పోట్లు పొడిచి హత్య చేశారు. దేశవ్యాప్తంగా గురువులపై అఘాయిత్యాలు, అవమానపరిచే ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. కారణాలు ఏవైనా విద్య వ్యాపారీకరణ, ప్రపంచీకరణ దుష్ఫలితాలు ఎంతో ఆందోళనలను కలిగిస్తున్నాయి. గురు శిష్యుల మధ్య ఉండాల్సిన మంచి వాతావరణం, ఇలా అగౌరవంగా, ఆగ్రహంగా, ఘర్షణలు, హింస నెల కొనటం దిగజారిన సామాజిక స్థితి గతులను తెలుపుతోంది.
దుర్వ్యసనాలకు బానిసలైన ఇద్దరు విద్యార్థులను మంచిగా ఉండాలని మందలించినందుకు ప్రిన్సిపల్‌పై కక్ష కట్టారు. ఆమెను దారుణంగా చంపి, ఆమె ఇంట్లో ఉన్న డబ్బులు దోచు కెళ్లి, జల్సాలకు ఖర్చు చేశారు. పోలీసుల కథనం ప్రకారం చూస్తే..ఈ ఇద్దరు విద్యార్థులు మద్యం, గంజాయికి అలవాటు పడ్డారు. యూట్యూబ్‌లోని వీడియోలు చూస్తూ, తప్పుడు మార్గాలలో డబ్బులు సంపాదించడానికి అలవాటు పడ్డారు. నిందితులు ఇద్దరూ చిన్న వయసులోనే పక్కా ప్లాన్‌తో హత్య చేయడం, అంత చిన్న వయసులోనే ఇంత నేర ప్రవృత్తి కలిగి ఉండటం చూస్తుంటే పిల్లల పెంపకం, విద్యా విధానం లోని డొల్లతనం, మృగ్యమైపోతున్న మానవ సంబంధాలు కొట్ట వచ్చినట్లు కనపడుతున్నాయి. చిన్న పిల్లలలో ఇంత రాక్షస ప్రవృత్తికి గల కారణాలు చూస్తే ,విద్యా వ్యవస్థ ప్రయివేటీకరణ, వ్యాపారీ కరణ, చదువు అంటే మార్కులు, ర్యాంకులు, ఫీజులు ,ఫలితాలు అనే వాణిజ్య అంశాలకే ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎటువంటి సౌకర్యాలు లేకుండా, పుట్టగొడుగుల్లా గల్లీకి ఒక పాఠశాల వెలిసింది. ఇక్కడ వ్యాపార సంబంధాలే గానీ,మానవీయ సంబంధాలు ఉండవు. నేడు చదువు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ లాంటి సైన్స్ సబ్జక్ట్స్ తప్ప సామాజిక శాస్త్రాలకు తావులేదు. అందుకే మర మనుషులు తయారవుతున్నారు. సోషల్ సైంటిస్టులు తయారు కావడం లేదు.
ఈ అంతరం రానురాను పెరిగిపోతూ ఉంది. దీని కారణంగా మొత్తం సమాజం యాంత్రికరణ చెంది, పిల్లలు పెద్ద పెద్ద ఉన్నత చదువులు చదివి, డబ్బులు సంపాదిస్తున్న, జీవితం, సమాజం విసరే సవాళ్లను , సమస్యలను అర్థం చేసుకొని, పరిష్కరించుకోలేక, ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. చావే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. దీనికి జ్ఞానం లోపించిన చదువులు కూడా ఒక కారణం. అలాగే సామాజికంగా చూస్తే ఇంత హింస ప్రవృత్తికి కారణం సినిమాలు, టీవీలు, వెబ్ సిరీస్, సోషల్ మీడియా పిల్లలను బలంగా చెడు వైపు ప్రభావితం చేస్తున్నాయి. మద్యం, జూదం, గంజాయి ఇతర చెడు అలవాట్లను సమాజం ప్రోత్సహించేదిగా ఉంది. ఈ అలవాట్లు సాధారణ జీవన శైలిలో భాగంగా మారిపోయాయి. జూదం, మాదక ద్రవ్యాల విషయంలో విద్యాలయాలు, తల్లిదండ్రులు ,పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో బాధ్యతగా పనిచేస్తూ, పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి. విద్యార్థులలో చదువులో పోటీ బాగా పెరిగింది ‘‘కుండకు చిల్లి పెట్టి నీరు నింపండి’’ అన్న చందంగా చదువులు ఉన్నాయి. ఆడుతూ, పాడుతూ గడపాల్సిన బాల్యం నిత్యం ఒక పరుగు పందెంగామారింది. దీంతో పిల్లల్లో కోపం, అసహనం, భయం , బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
చదువుల పేరుతో తల్లిదండ్రులకు దూరంగా ఉండటం తో ఒంటరితనంతో కుమిలిపో తున్నారు. క్రమశిక్షణ పేరుతో కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల అందరి ముందు అవమానపరచటం, నిరంతరం కొట్టడం, తిట్టటం, వివిధ రకాలుగా శిక్షించడం లాంటి పద్ధతుల వలన పిల్లల హృదయాలు అసహనంతో నిండిపోతున్నాయి. ఈ ధోరణి మారాలి. ప్రతి పాఠశాలలో ఒక కౌన్సిలర్ (సైకాలజిస్ట్) ఉండాలి. మొత్తం విద్యావ్యవస్థలోనే మౌలిక మార్పులు తీసుకురావాలి. పిల్లలు ఒక సమాజం. వారు ఒక కుటుంబ సంపద కాదు, ఈ ప్రపంచం వెలిగించవలసిన విద్య దీపాలు.అందుకే ‘‘నేటి బాలలే… రేపటి పౌరులు’’ అన్నారు నెహ్రూ, ‘‘దేశ భవిష్యత్ తరగతి గదిలో రూపు దిద్దుకుంటుంది’’ అని పేర్కొన్నారు కొఠారి. భారతీయ విద్యా వ్యవస్థను మౌలికంగా ఉన్నతీకరించాలనే తపన నుండి వచ్చిన భావనలివి. ‘‘బ్రిటిష్ వలసవాదుల ప్రయోజనాలకు అనుకూలంగా రూపొందించిన మెకాలే విద్యా విధానాలే నేడు అమల్లో ఉన్నాయి. ఇవి భారతీయుల ప్రయోజనాలు, అవసరాలకు విరుద్ధం. కాబట్టి భారతీయ విద్యను పూర్తిగా భారత ప్రజల చరిత్ర, సంస్కృతి, అవసరాలకు అనుగుణంగా పురార్నిర్మాణం జరగాలి, దానికోసం దాదాపు ఒక విప్లవమే రావాలి’’ అని కొఠారి కమిషన్ (1964-66) పేర్కొంది. కొఠారి ఎంతో దూరదృష్టితో కామన్ స్కూల్ విధానాన్ని రూపొందించాడు. ఆ విలువైన సిఫార్సులను మన పాలకులు పక్కన పెట్టారు.
చదువంటే మార్కులు, గ్రేడులు, ర్యాంకులు అంటూ అశాస్త్రీయ పద్ధతులతో మెకాలే విద్యా విధానాన్నే నేటికి కొనసాగిస్తున్నారు. అసలు విద్య అంటే ఏమిటి? విద్యా అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడం. మనిషిని సమగ్రంగా అభివృద్ధి పరుస్తూ, గొప్ప చైతన్యాన్ని మానవులలో కలిగించటం. అలాగే విద్య ఆ సమాజానికి పునాది అయినటువంటి ఆర్థిక వ్యవస్థకి, వ్యక్తికి- ప్రకృతికి, వ్యక్తికి- వ్యక్తికి మధ్యగల పరస్పర ఉత్పత్తి సంబంధాన్ని అర్థం చేయించి, ఆ సమాజాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దడానికి జ్ఞానాన్ని అందించటం విద్య అసలు ధ్యేయం. మానవజాతి ఇప్పటిదాకా సంపాదించిన జ్ఞానాన్ని, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్యం, సమస్త కళలను ఒక తరం నుండి మరొక తరానికి అందించే వ్యవస్థ. ఏ దేశంలో నైనా జాతి నిర్మాణానికి విలువలతో కూడిన విద్యార్థులను తయారు చేయాలంటే మంచి విద్యా విధానం అందరికీ అందు బాటులో ఉండాలి. విద్య సామాజికం. బడి ఒక జాతి భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యున్నత వ్యవస్థ. ఆ దేశ అభివృద్ధి, ప్రణా ళికలు, ఆదేశం తనకు ఎలాంటి మనుషులను కోరుకుంటున్నదో, ఎలాంటి విజ్ఞానం కావాలని కోరుకుంటున్నదో బడిని చూస్తే చాలు తెలిసిపోతుంది. ఇంత ప్రాధాన్యత గల మన విద్యారంగం మొదటి నుండి నిరాదరణకు గురవుతోంది. దీని ఫలితమే నేటి ఈ దుష్ఫలితాలు ఇకనైనా విద్యాసంస్థలు వ్యాపార సంస్థలుగా కాకుండా గొప్ప మానవీయతతో కూడిన వ్యక్తిత్వాలను తీర్చిదిద్దే విధంగా తయారవ్వాలి. ఇది జరగాలంటే మొత్తం విద్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. అప్పుడు మాత్రమే నాణ్యమైన పౌరులు తయారవుతారు. అప్పుడే ఒక మంచి విలువలతో కూడిన సమాజం ఏర్పడుతుంది.
షేక్. కరిముల్లా, 9705450705



