Thursday, August 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిశిరోముండన ఆచారం: చారిత్రక వాస్తవాలు, మతపరమైన అర్థాలు!

శిరోముండన ఆచారం: చారిత్రక వాస్తవాలు, మతపరమైన అర్థాలు!

- Advertisement -

చారిత్రికంగా ఒక విషయాన్ని నిర్ధారించుకోవాలంటే, శిల్పాలు, స్థూపాలు, లేదా ఇతర ఆనవాళ్లు, ఆనాటి పాలకులు ప్రకటించిన శాసనాలు, నాణాలు లేదా కట్టడాల శిధిలాలు లేదా ఆ కాలపు రచనలు దొరకాలి. అవీ కాకపోతే, ఆయా కాలాల్లో మన దేశానికి వచ్చిన విదేశీ యాత్రికులెవరైనా డైరీలు, నోట్స్ రాసుకుంటే, వాటివల్లనైనా విషయాలు తెలియాలి. బౌద్ధం గురించి తెలియజెప్పేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ లభ్యమయ్యాయి. ఇంకా, ఇప్పటికీ లభ్యమవుతూనే ఉన్నాయి. మరి, ‘‘మాది లక్షల సంవత్సరాల నాటి సనాతన ధర్మం’’ అని చెప్పుకునే వారి గ్రంథాలు, శిధిలాల ఆనవాళ్లు, ఇతర ఆధారాలు అన్ని ఏమయ్యాయి? చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే, వైదిక మతస్తులు దాదాపు అన్ని విషయాలు బౌద్ధం నుంచే స్వీకరించినట్టు పూర్తి ఆధారాలు దొరుకుతున్నాయి, తప్పంచి – వైదికుల నుంచి బౌద్ధులు స్వీకరించిన దాఖలాలు లేవు. శంకరాచార్య లాంటి వైదికుల మతగురువునే ‘ప్రచ్ఛన్న బౌద్ధుడు’ – అని పిలుచుకున్నారు. అంటే, TRUE COPY OF BUDDHA OR SHADOW OF BUDDA-! అన్నమాట శంకరాచార్యుల లేదా రామానుజాచా ర్యుల ప్రభావం బౌద్ధ భిక్షువుల మీద పడినట్టు వారి ఆలోచనా ధోరణిని మార్చుకుని, వైదిక సంప్రదాయాలు పాటించినట్టు ఒక్కటంటే ఒక్క ఉదాహరణ లేదు కదా ?

ఫాహియాన్, హూన్‌త్సాంగ్‌ చీనీ యాత్రికులు భారత దేశంలో విస్తృతంగా పర్యటించి, ఆ కాలంలో వారికి కనిపిం చిన అనేక విషయాలు గ్రంథస్తం చేశారని మనకు తెలుసు. వారు రాసుకున్న నోట్స్‌లో ఎ‌క్కడా రామాయణ, మహాభారత గ్రంథాల ప్రసక్తి లేదు. అంటే, అవి అప్పటికి రాయబడలేదని కదా అర్థం? ప్రాచీన బౌద్ధగ్రంధాలు వెలువడిన కాలానికి పురాణాలు కూడా వెలువడ్డాయి – అని చెప్పడానికి ఆధారాలు దొరకలేదు. దొరికిన అన్ని ఆధారాలను బట్టి, మొదట బౌద్ధగ్రంథాలే వెలువడ్డాయని తెలుస్తూ ఉంది. అశోక చక్రవర్తి పరిపాలించిన కాలంలో దేశవ్యాప్తంగా స్థూపాలు, శాసనాలూ వేయించాడు. ఆ విషయం మనకు తెలుసు. వైదిక పవిత్ర గ్రంథాలు అప్పటికే వెలువడి ఉంటే గనక, వాటి ప్రసక్తి ఎక్కడో ఒకచోట ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బయట పడేది కదా? వేదాలు, పురాణాలు, రామాయణ మహా భారతాల ప్రసక్తి అప్పటికి ఎక్కడా కనిపించదు. మన పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలలో బౌద్ధ స్థూపాలు, శాసనాలు, శిల్పాలు విహారాల శిధిలాలు పెద్ద సంఖ్యలో లభిస్తూ వచ్చాయి కానీ, వైదిక పవిత్ర గ్రంథాల ప్రసక్తి ఎక్కడా కనిపించలేదు. రాముడు, కృష్ణుడు, ధర్మరాజుల నాటి ఆధారాలు, నాణాలు, కట్టడాల శిధిలాలు వంటివి ఏవీ లేవు. ప్రాచీన భారత దేశ చరిత్రపై పరిశోధనలు చేసిన పరిశోధకులు కూడా ఇలాంటి వివరాలు ఏవీ ఇవ్వలేదు.

అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేమంటే, వైదిక పురాణాలన్నీ సృజనాత్మక రచనలు! అందులోని కథ, పాత్రలు కల్పితం. ఆయా పాత్రలేవీ ఈ దేశం మట్టిలోంచి పుట్టుకొచ్చినవి కావు. అందుకే అవి చరిత్రలో భాగం కాదు. ఇక ఈ తరం ప్రజలు సైన్సుకు, చరిత్రకు ప్రాధాన్యమిస్తారు. వాటినే ప్రామాణికంగా భావిస్తారు. అందుకే వీరి వ్యక్తిత్వం నిజాల వైపు నిలబడుతుంది. రాముడు, సీత, లక్ష్మణుడు వంటి అనేక పేర్లు సాధారణంగా హిందూ దేవీ దేవతల పేర్లు అని భావిస్తూ ఉంటారు. కాని హిందువుల పవిత్ర గ్రంథాలు రాయబడక ముందే అంటే సాధారణ శకానికి ముందు (BCE) 3-1 శతాబ్దాల మధ్య కాలంలో ‘దశరథ జాతక కథలు’ అనే బౌద్ధగ్రంథంలో ఈ పేర్లు కనిపిస్తాయి. అలాగే, ఇంద్రుడు, బ్రహ్మ, అగ్ని, వరుణ వంటి పేర్లు ‘దిఘ నికాయ’, బౌద్ధ గ్రంధంలో ఉన్నాయి. అలాగే వాసుదేవుడు, కంసుడు వంటి పేర్లు ‘ఘట పండిత జాతక కథ’ల్లో కనిపిస్తాయి. హీలియోడోరస్ స్థూపం మీద వాసుదేవ పేరు కనిపిస్తుంది. ఇది సాధారణ శకం (C.E) రెండవ శతాబ్దానికి సంబంధించింది.

ఇంతవరకు జరిగిన పరిశోధనల్లో వైదిక పవిత్ర గ్రంథాలు బ్రాహ్మి, ఖరోష్టి లిపులలో లభించలేదు. పాలి భాషలో కూడా లభించలేదు. ఆ తర్వాత చాలా కాలానికి వెలుగులోకి వచ్చిన నాగరి లిపిలో వేదాలు, పురాణాలు వెలువడ్డాయి. అవి సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతం లిపిలేని ఒక మాండలిక భాష, ఆర్యులు భారత దేశానికి వచ్చినపుడు వారితో పాటు ఇక్కడికి వచ్చింది. లిపి లేనందువల్ల వారు ఈ దేశంలోని నాగరి లిపిలో తమ సంస్కృత గ్రంథాలు రాసుకున్నారు. తర్వాత, ఆ లిపినే తమది దేవనాగరి లిపి అని ఉన్నతీకరించుకుని, గొప్పలు చెప్పుకున్నారు. అయితే, అసలు విషయమేమంటే- ఈ దేశంలోని బ్రాహ్మీ, ఖరోష్టి వంటి ప్రాచీన లిపులలో బౌద్ధ సాహిత్యం ఉంది. ఇక ఏ సాహిత్యం మొదట వెలువడింది అన్న విషయం- దీనివల్ల కూడా తెలిసిపోతూ ఉంది కదా? నాగార్జునకొండ సాధారణ శకం (C.E) 3-4 శతాబ్దాల మధ్య ఒక గొప్ప బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. విద్యా కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. పలు దేశాల నుంచి భిక్షువులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించేవారు. ఆచార్య నాగార్జునుడి వల్ల ఈ కొండకు ఈ స్థలానికి ఆ పేరు వచ్చింది.

బుద్ధుడి తర్వాత రెండో బుద్ధుడని పిలువబడ్డ నాగార్జునుడు తన ‘శూన్య వాదం’తో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు, ఈ తెలుగు ప్రాంతాన్ని పాలించిన అనాటి రాజులు బౌద్ధ ధమ్మానికి చాలా ప్రాముఖ్యమిచ్చారు. విహారాల, స్థూపాల, శిల్పాలు, శాసనాల ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ భద్ర పరచబడి ఉన్నాయి. ఇక్కడి తవ్వకాలలో ఒక శంఖు బయటపడింది. దానిపై బ్రాహ్మ లిపిలో ఒక వాక్యం ఉంది. ‘‘భగవతో అథభుజ సమీసా’’ అన్నది ఆ వాక్యం. ఇందులో భగవతో అంటే బౌద్ధ సంప్రదాయంలో బౌద్ధులు బుద్ధుణ్ణి గౌరవంగా పిలుచుకునే పిలుపు. భాగవా – అంటే వారి భాషలో పరిపూర్ణుడా అని అర్థం. THE PERFECT MAN అని. ఈ పదాన్ని స్వీకరించిన వైదికులు కనిపించని దేవుణ్ణి భాగవానుడు అని పిలుచుకున్నారు. అది రెండింటి మధ్య వ్యత్యాసం. అథబుజ- అంటే ఎనిమిది మూలలు అని అర్థం. అష్టాంగిక మార్గం ప్రసాదించిన వాడా అన్న అర్థంలో ఆ మాట వాడారు. సమీసా – అంటే స్వామి-అని. ఇది కూడా గౌరవ సూచకమే! శంఖుపై చెక్కిన చిత్రాలలో ధమ్మ చక్రం ఉంది. అంటే ఎనిమిది SPOKES కలిగిన చక్రం – సృష్టంగా ఇది అష్టాంగిక మార్గం గూర్చి తెలియజేసేదే. దీనివల్ల ఆనాటి సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిస్థితులు అర్ధం చేసుకోవచ్చు. ఆరాధనా పద్ధతులు, విధానాలు కూడా తెలుసుకోవచ్చు. శంఖు ధర్మ ప్రచారానికి ప్రతీక.

బుద్ధుడు బోధించిన ధర్మం దూరదూరాలకు వ్యాపించా లన్న భావాన్ని శంఖు నినాదంతో పోలుస్తారు. శంఖం ఊదినప్పుడు శబ్దం దూర దూరాలకు చేరినట్టే, బౌద్ధ ధమ్మం కూడా దూర ప్రాంతాలకు చేరాలన్న సంకల్పానికి ఇది సంకేతం! బౌద్ధంలో శంఖునాదం శుభాప్రారంభానికి సూచిక. శంఖు తెలుపురంగులో ఉంటుంది గనుక- నిర్మలత్వానికి శుభ్రతకు అది సూచిక. తరువాతి కాలంలో దీన్ని వైష్ణవ సంప్రదాయం స్వీకరించింది. విష్ణుమూర్తి చేతిలో శంఖు, చక్రం, గదా, పద్మం వంటివి చేరాయి. బౌద్ధంలో ధర్మ ప్రచారానికి వాడిన శంఖుచక్రాలు వైష్ణవ సంప్రదాయంలో ఆయుధాలయ్యాయి. శంఖం పూరించడం యుద్ధానికి పిలుపుగా మారింది. ద్ధమ్మచక్రం కాస్తా సుదర్శన చక్రమై, శత్రు సంహారానికి ఉపయోగపడింది. వైష్ణవ సంప్రదాయంలో శంఖం మరోరకంగా కూడా ఉపయోగంలోకి వచ్చింది. దేవుడికి అభిషేకం జరుగుతున్నప్పుడు శంఖం నిండా నీరునింపి దేవుడికి సమర్పిస్తారు. మళ్లీ ఆ నీటినే భక్తులకు తీర్ధంగా పెడతారు. ‘శంఖంలో పోస్తేగాని తీర్థం కాదు’ అనే వాడుక మాట ఈ సంప్రదాయంలో నుంచే వచ్చింది. శంఖంలో నీరు నిలువ చేస్తే, అది శుద్ధి అవుతుందని వైదిక మతస్తుల విశ్వాసం.

సాంచీ శిల్పంలో ఆనాటి శిల్పకారులు బుద్ధుడు గాలిలో తేలుతున్నట్టు, ప్రత్యేకంగా చెక్కుకున్నారు. జ్ఞానోదయమ య్యాక ‘బుద్ధుడు గాలిలో కలిసి విశ్వవ్యాప్తమయ్యాడు’ అనే భావనతో సింబాలిక్‌గా అలా చిత్రించుకున్నారు. దాన్ని వారు ‘అర్హత రూపం’ అని అన్నారు. అంటే, బుద్దుడు అర్హుడయ్యాడని అర్థం. ఆ శిల్పాన్ని స్వీకరించిన వైదిక మతస్తులు మారుతి – హనుమాన్ అంజనీయ అనే ఒక పురాణ పాత్రను సృష్టించు కున్నారు. గాలిలో తేలే బుద్ధుడి చేతిలో త్రిరత్న చిహ్నం ఉంటుంది. ఆ శిల్పాన్ని మార్చుకున్నాక, హనుమంతుడి చేతిలో ఒక పర్వతం చిత్రించుకున్నారు. సాంచి, జున్నార్ ప్రాంతంలోని ప్రాచీన గుహలను సూక్ష్మంగా పరిశీలించిన పరిశోధకులు వైదిక సాహిత్యంలో హనుమంతుడి సృష్టి ఎలా జరిగిందన్నది బయట పెట్టారు. ‘ఫాదర్ అఫ్ ఇండియన్ ఆర్డియాలజీ’గా పిలవబడ్డ అలెగ్జాండర్ కన్నింగ్ హమ్ హనుమంతుడి గురించి ఒక మాట చెప్పాడు-‘హనుమాన్ భారత దేశపు మూలవాసులకు ప్రతీక’ అని అన్నాడు. దీన్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే, చాలా విషయాలు చెప్పుకోవచ్చు- ఇక్కడ మరొక ముఖ్యమైన సంప్రదాయం గురించి కూడా చెప్పుకోవాలి. బౌద్ధులలో శిరోముండనం అనాదిగా వస్తుంది. భిక్షవులు, భిక్షుణిలు మొట్టమొదట శిరోముండనం చేయించుకోవాలి. అహంభావం లేకుండా ఉండడానికి, సంసార సుఖ వ్యామోహాలు లేకుండా జీవించడానికి, ప్రజలకు ధర్మబోధ చేస్తూ గడపడానికి, స్వంత ఆస్తి లేకుండా స్వచ్ఛమైన సేవకు లుగా కొనసాగడానికి బౌద్ధంలో కొన్ని నియమాలు ఉన్నాయి.

త్రిరత్నాలను, పంచశీలను పఠిస్తూ ఉండడం – శిరోముం డనం చేయించుకుని, ప్రధాన భిక్షువు ఆశీర్వాదం తీసుకోవడం ఉంటుంది. ఇక హిందూ ధర్మానికి వస్తే – శిరోముండనాన్ని హిందూ ధర్మ గ్రంధాలేవీ ఒప్పుకోలేదు. వివాహిత స్త్రీకి అయితే నిషిద్ధం. భర్త చనిపోయిన విధవరాండ్రకే శిరోముండన ముంటుంది. శిరోముండనం అశుభ సూచకం, అరిష్టం అని భావించడం వల్ల, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అశుభం జరిగిందన్నదానికి సూచనగా శిరోముండం చేయించుకుంటారు. వైదిక రుషి పుంగవులందరూ పొడవాటి జుట్టుతో, మీసాలు గడ్డాలతో ఉంటారు. బోడిగుండు సన్యాసులు హిందూ మతంలో లేరు. బోడిగుండుతో బౌద్ధ సన్యాసులు ఎదురైనా అమంగళం అని భావించారు. అయితే బౌద్ధాన్ని అనుకరించే క్రమంలో విధిలేక శిరోముండనాన్ని ఆచరిస్తున్నారు. దాన్ని దేవుడికి తలనీలాలు సమర్పించేదిగా మార్చుకున్నారు. హిందువులు బోడిగుండు చేయించుకున్నా, తమ ప్రత్యేకత నిలుపుకోవడానికి పిలక ఉంచుకుంటారు. కానీ తిరుపతి బౌద్ధ క్షేత్రమని రుజువైనప్పటి నుంచి బౌద్ధ సంప్రదాయాన్ని అనుసరించి, అక్కడ పిలక మిగుల్చుకోకుండా శిరోముండనం చేయించుకుంటున్నారు. హిందూ మతంలోని త్రిమూర్తులన్న భావనా గాని, గుళ్లో తీర్థం మూడుసార్లు పెట్టడం గానీ, వైష్ణవులు నుదుట మూడు నిలువుబొట్లు పెట్టుకోవడం గానీ బౌద్ధంలోని త్రిశరణాలని గుర్తుచేస్తాయి. పరిశీలిస్తూ పోతే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. ముందున్న వారినేకదా ఎవరైనా అనుకరిస్తారు, అనుసరిస్తారు !! ​
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -