Thursday, September 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅడవి బిడ్డల ఆక్రందన

అడవి బిడ్డల ఆక్రందన

- Advertisement -

‘జల్‌-జంగిల్‌-జమీన్‌’ ఒక నినాదం కాదు… ఆదివాసీల మనుగడకు మూలాధారం. అడవుల్లో ఉన్న అత్యంత విలువైన ఖనిజాలను, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు గిరిజనుల హక్కులను కాలరాసే చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటుండటం దుర్మార్గం. నేటికీ ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ప్రాంతాల్లో దుర్భర జీవితాన్ని గడుపుతూ, నిత్యం దోపిడీకి గురవుతూ, వ్యాధులు, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న ఆదివాసీల రక్షణ ప్రభుత్వాల బాధ్యత. ‘భూమి, అడవులు మావే… అదానీ, అంబానీలవి కావు’ అంటూ ఢిల్లీ వేదికగా నినదించిన మన్యం బిడ్డల గోడును పట్టించుకోకపోతే వారి మనుగడకే కాదు… ప్రకృతి, సమస్త మానవాళి మనుగడకూ వినాశనమే. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ (ఎఎఆర్‌ ఎం) ఆధ్వర్యాన హస్తినలోసాగిన ఆదివాసీల భారీ ధర్నా, ప్రదర్శన, జాతీయ సదస్సు లేవనెత్తిన డిమాండ్లు ఎంతో సహేతుక మైనవి. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో పొందుపరిచిన హక్కులు, అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఎ), పంచాయతీలకు విస్తరించిన షెడ్యూల్డ్‌ ప్రాంతాల చట్టం (పీసా), 1/70 తదితర చట్టాలు అమలులో ఉన్నప్పటికీ ఆదివాసీలకు భూమి, అడవులు, సహజ వనరులపై హక్కులు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి. లోకూర్‌ వ్యాఖ్యలు అక్షర సత్యం.

ఆ చట్టాలను నిర్వీర్యం చేసే దుర్మార్గపు ప్రతిపాదనలను కేంద్రంలోని మోడీ సర్కారు ముందుకు తీసుకురావడం మరింత ఆందోళనకరం. గ్రామ సభల అధికారాలను పక్కనపెట్టి ఖనిజ వనరుల పేరుతో ఆదివాసీలను తరిమివేయడం, మణిపూర్‌లాంటి ప్రాంతాల్లో జాతి హింస పెచ్చరిల్లేలా కుట్రలు పన్నడం వారి హక్కులను హరించడమే. తెలంగాణలోనూ పోడు భూముల విషయంలో గిరిజనుల హక్కులను నిర్లక్ష్యం చేస్తూ అటవీశాఖ చర్యలు చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య ఘర్షణలు తీవ్ర చర్చకు దారితీశాయి. రెండునెల్ల క్రితం అశ్వాపురం మండలం మనుబోత్లగూడెం వద్ద ఒక గిరిజన మహిళపై అటవీ సిబ్బంది దాడి చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. భూమి, అడవి తమ జీవనాధారమని గిరిజన కుటుంబాలు చెబుతుండగా, మరోవైపు అటవీ సంరక్షణ పేరుతో చర్యలు కొనసాగుతున్నాయి. కార్పొరేట్‌, ప్రైవేట్‌ రంగం విస్తరించడంతో వారి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ కుంచించుకు పోతు న్నాయి. అలాగే భద్రాచలం ఎజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన నర్సు హైదారాబాద్‌‌లోని తుక్కు గూడలో హత్యకు గురైన ఘటన ఆదివాసీ మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ప్రజలకు సేవలందించే బాధ్యతలో ఉన్న ఒక ఆదివాసీ బిడ్డ ప్రాణాలు కోల్పోవడం పాలనాతీరుపై అనేక ప్రశ్నలు లేవనెత్తు తోంది. గిరిజన మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు, ఈ హత్యకు బాధ్యులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. మారుమూల గిరిజన ప్రాంతాల్లోనూ మలేరియా, ఇతర వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సదుపాయాలు, రహదారులు లేకపోవడంతో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, అవసరమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. అలాగే గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా, అడవుల సంరక్షణ పేరుతో సాగుదారులపై కేసులు పెట్టడం, సాగును అడ్డుకోవడం సమస్యను మరింత జఠిలం చేస్తుంది. అటవీ హక్కుల చట్టం కింద అర్హత ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి హక్కులు కల్పించడంతోపాటు, ఇప్పటికే పట్టాలు పొందిన వారి భూములపై స్పష్టమైన సర్వే, సరిహద్దుల నిర్ణయం చేపట్టాలి. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలకు రైతులను బలిపశువులను చేయకూడదు.

గిరిజనాన్ని చెట్టుకొకరు పుట్టకొకరుగా తరిమేసే ప్రమాదకరమైన ది మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ (డెవలప్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) అమెండ్‌మెంట్‌ బిల్లు 2026ను కేంద్రం ఉపసంహరించుకోవాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు ఆదివాసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లను పెంచడం ప్రభుత్వాల బాధ్యత. పోడు భూముల సమస్యకు ఇక తాత్కాలిక పరిష్కారాలు కాదు… శాశ్వత పరిష్కారం కావాలి. గిరిజన రైతుకు పట్టా ఇచ్చి మళ్లీ అదే భూమిలో సాగు చేసుకోవడానికి అడ్డంకులు సృష్టించడం సరికాదు. గ్రామసభల నిర్ణయాలను గౌరవించి, ఎఫ్‌ఆర్‌ఎ, పీసా, ఐదో షెడ్యూల్‌ హక్కులను సమర్థంగా అమలు చేయాలి. గిరిజనుల జీవనాధారాన్ని కాపాడుతూనే అడవులను సంరక్షించే సమగ్ర విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. ఆదివాసీ బిడ్డల ఆవేదన అరణ్య రోదనగా మారితే నష్టపోయేది సమాజమే. వారి భూమి, అడవి, జీవనాధారాలను కాపాడటం అంటే ప్రకృతిని, భవిష్యత్‌ తరాల మనుగడను కాపాడటమే. ‘జల్‌-జంగిల్‌-జమీన్‌’పై ఆదివాసీల హక్కులను గౌరవించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. అరణ్య రోదనను ఆలకించి, అడవి బిడ్డల హక్కులను కాపాడాల్సిన సమయం ఇదే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -