సెప్టెంబర్ 17 ఒక చారిత్రక నన్నివేశం. దీన్ని పాలకులే వక్రీకరిస్తున్నారు. పైగా ఢిల్లీ పాలకులు తెగబడడానికి కారణం ఏమిటి? కొందరి మౌనం, కొందరి వక్రభాష్యాలతో వాస్తవ చరిత్ర చెరిగిపోతుందా? మారదని తెలిసి కూడా ఎందుకీ ఆయాసం? తెలంగాణ ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలివి. ఒకవైపు బ్రిటిష్ ఇండియా లో స్వాతంత్య్రోద్యమం సాగింది. మరోవైపు హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం నడిచింది. ఈ రెండింటి ఫలితమే 1948 సెప్టెంబర్ 17న స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ (హైదరాబాద్ రాజ్యంలో భాగంగా) విలీనం. ఈ రెండు పోరాటాలతో అణువంత సంబంధం కూడా లేని ఆరెస్సెస్, దాని రాజకీయ విభాగమైన బీజేపీ, ఇప్ప్పుడు వక్రభాష్యాలకు తెగబడుతున్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో విజయం సూచికగా జరుపుకునేదే ‘ఆగస్టు 15’ స్వాతంత్య్ర దినోత్సవం. దీన్ని నీరుగారుస్తూ, ఆగస్టు 14ను విభజనకు వ్యతిరేకం పేరుతో నిర్వహించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 ప్రాధాన్యతను తగ్గిస్తూ, రాజ్యాంగ సభ ఆమోదించిన నవంబరు 26ను ముందుకు తెచ్చింది. భిన్న జాతులు, సంస్కృతుల ఐక్యతను ప్రతిబింబించే విధంగా రవింద్రనాధ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నమే కాకుండా, ఇందుకు పూర్తి భిన్నమైన దిశలో ‘వందేమాతరం’ గీతాన్ని పూర్తినిడివితో ముందుకు తెచ్చారు. సెప్టెంబరు 17 విలీన దినోత్సవాన్ని కూడా “విమోచన దినోత్సవం” పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు. జాతీయోద్యమ విలువలు గానీ, స్వాతంత్య్రోద్యమంతో ఏమాత్రం సంబంధం లేని, ప్రజా పోరాటాల నేపథ్యం గానీ లేని ఆరెస్సెస్, బీజేపీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రతో ఆడుతున్న చెలగాటం.
సెప్టెంబరు 17న, పరేడ్ గ్రౌండ్స్‌లో, హోంమంత్రి అమిత్‌షా సైనిక కవాతు కార్యక్రమంలో పాల్గొంటారట! సైనిక వందనం స్వీకరిస్తారట! అది కూడా ఇక్కడ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్ర మాలకు సమాంతరంగా! విలీనం ఒక అధికారయుత సంఘటన. అదే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. దీనికి భిన్నంగా “విమోచనం” పేరుతో యూనియన్ ప్రభుత్వం వక్రభాష్యాలతో మరో కార్యక్రమం నిర్వహించటం రాజ్యాంగపు సమాఖ్య స్వరూపాన్ని పరిహసించటమే. అంతేకాదు, భూస్వామ్య, రాచరికాల మీద ప్రాణాలకు తెగించి పోరాడిన తెలంగాణ ప్రజల వారసత్వాన్ని తృణీకరించటమే. పురావస్తుశాలలో ఉన్న రాజదండాన్ని మోడీ ప్రభుత్వం పార్లమెంట్ హాల్లో పెట్టింది. దీనికీ, పరేడ్ గ్రౌండ్స్‌లో అమిత్‌షా సైనిక కవాతుకు సంబంధం కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు భూస్వామ్య దోపిడీతోపాటు రాచరికం అంతం కావాలని కోరుకున్నారు. నాడు హోంమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత సర్దార్ పటేల్, తెలంగాణ రైతాంగం వ్యతిరేకి స్తున్న నిజాం నవాబునే ‘రాజు’ పేరు తొలగించి ‘రాజప్రముఖ్’ పేరుతో ప్రజల నెత్తిన కూర్చోబెట్టారు. ఆనాటి భూస్వాములు, రజాకార్లు, నిజాం సైనికులను మించి యూనియన్ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. ఇప్పుడు బీజేపీ నేత, యూనియన్ హోం మంత్రి అమిత్‌షా కూడా తెలంగాణ ప్రజలను, సమాఖ్య స్వభావాన్ని ఖాతరు చేయకుండా, సైనిక కవాతుకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
రాచరిక వ్యవస్థలో రాజు చేతిలో రాజదండం ఉండేది.
స్వతంత్ర భారతదేశంలో రాచరికానికి తావులేదనీ, ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉంటుందని ఆనాటి ప్రధాని నెహ్రూ ప్రకటించారు. అందుకే రాజదండం ఉండవల్సింది పురావస్తు శాలలో అన్నారు. మ్యూజియంలోనే భద్రపరిచారు. ‘ప్రజాస్వామ్యం’ గిట్టని నేటి ప్రధాని మోడీ తనను తాను ప్రధాని పేరుతో ఉన్న రాజుగా భావిస్తున్నారు. అందుకే మ్యూజియంలో ఉండవల్సిన రాజదండం తెచ్చి చట్టసభలో పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమవుతున్నప్ప్పుడు, లౌకిక, ప్రజాస్వా మ్య దేశంలో కలుస్తున్నందుకు ప్రజలు సంతోషిం చారు. కానీ, అంతలోనే నెహ్రూ-పటేల్ ప్రభుత్వ తప్ప్పుడు వైఖరి, యూనియన్ సైన్యాల దౌర్జన్యాలతో నిజం గ్రహించిన ప్రజలు పోరాటం కొనసాగించారు. నిర్దిష్ట వాగ్ధానాలు పొందిన తర్వాతనే, 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాటం విరమించారు. భిన్న జాతులు, సంస్కృతుల ప్రజల మీద బ్రిటిష్ పాలకులు పెత్తనం చెలాయించారు. బ్రిటిష్ ఇండి యాలో స్వాతంత్య్ర పోరాట ఫలితంగానే స్వతంత్ర భారతదేశం, పాకిస్థాన్‌లు ఏర్పడ్డాయి. బ్రిటిష్ ఇండియాను ఆనుకుని హైదరాబాద్, జమ్ము-కాశ్మీర్, జునాగఢ్లతో సహా 565 రాజ్యాలున్నాయి. ఈ సంస్థానాలలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, త్రిపుర గిరిజనుల సాయుధ పోరాటం, పున్నప్రా, వాయెలార్, కాశ్మీర్ తదితర రైతాంగ పోరాటాలు సాగిన కాలం అది. మరోవైపు బ్రిటిష్ ఇండియాలో సాగిన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల ప్రభావం కూడా ఈ 565 సంస్థానాల ప్రజలను ప్రభావితం చేసాయి. ఈ పోరాటాల నుంచి పుట్టిందే భారతీయ భావన.
విభిన్న జాతులు, సంస్కతుల సమైక్య భావనగా రూపుదిద్దు కున్నదే భారతదేశం. అందుకే రాజ్యాంగ నిర్మాతలు దీన్ని ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ (రాష్ట్రాల సమాఖ్య) అన్నారు. ఈ వైవిధ్యాన్ని ధ్వంసం చేసి నిరంకుశ పాలన కోసమే ఒకే దేశం-ఒకే సంస్కతి-ఒకే భాష-ఒకే ఎన్నికలాంటి నినాదాలు ముందుకు తెచ్చారు. చారిత్రక సత్యాల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగమే సెప్టెంబర్ 17ను విలీనం కాదనీ, విమోచనదినమని వక్రీకరించటం. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం క్రమంగా నిజాం రాచరికాన్నే సవాలు చేసింది. 1946లో ప్రారంభమైన ఈ తిరుగుబాటు ఎర్రజెండా నీడలో, పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఉవ్వెత్తున సాగింది. ఆ సమయంలో తెలంగాణలో ఆరెస్సెస్ అడ్రసు లేదు. ఆర్యసమాజ్ సంస్థ భూస్వాములను సమర్ధించింది. రజాకార్ సంస్థ దొరల గడీలలో తిష్టవేసి ప్రజల మీద దాడులు చేసింది. ఆశ్చర్యంగా ఉన్నది కదా! ‘హిందూ’ పేరుతో ఆర్యసమాజ్ ’ గానీ, ‘ముస్లిం’ పేరుతో రజాకార్ సంస్థగానీ…రెండు సంస్థలు కూడా భూస్వాముల పంచన జేరాయి. రైతాంగ పోరాటాన్ని వ్యతిరేకించాయి.
మరఠ్వాడా ప్రాంతానికి రైతాంగ సాయుధ పోరాటం విస్తరించకుండా, మరాఠీ ప్రాంతాల నుంచి మరఠ్వాడాకు హిందూ మహాసభ పేరుతో దిగుమతైన వారు విలీనం తర్వాత అక్కడ మతకల్లోలాలు సృష్టించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగుతున్న కాలంలోనే 1947, ఆగస్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలన అంతమై స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. దీన్ని ఆనుకుని ఉన్న హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం జరుగుతున్నది. అయినా…దీన్ని నరహంతక నైజాం సర్కారు అణచి వేయగలదని ‘నెహ్రూ-పటేల్ ’ ప్రభుత్వానికి ఎనలేని విశ్వాసం. నిజాం రాజుతో ఇండియన్ యూనియన్ ప్రభుత్వం యథాతథ ఒప్పందం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. నిజాం రాజ్యం అంతం కావాలని పోరాటం ఉధృతం చేసారు. ‘నెహ్రూ-పటేల్’ కల చెదిరింది. కథమారింది. రాచరికం పునాదులు కదిలాయి. హైదరాబాద్ రాజ్యం కమ్యూనిస్టుల వశమైతే….గోల్కొండ కోట మీద ఎర్రజెండా ఎగిరితే…పర్యవసానాల పట్ల ఢిల్లీ ప్రభుత్వం ఆందోళనకు గురైంది. పట్టుదలకుపోతే నిజాం రాజు ప్రజాకోర్టులో మరణశిక్షకు గురికావటం ఖాయం. ఖాసిం రజ్వీ రైతాంగ తూటాలకు బలికావటం తథ్యం. ఈ స్థితిలో నిజాం రాజు ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో రాజీకి సిద్ధపడ్డాడు ‘నెహ్రూ-పటేల్ ’ పాలకులు పావులు కదిపారు.
వీటి ఫలితమే 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనం. భూస్వామితో పోరాటంలో అయిలమ్మ విజయం, 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య వీరమరణంతో మొదలైన సాయుధ తిరుగుబాటు విలీనాన్ని అనివార్యం చేసింది. కులం, మతం, ప్రాంతాల ప్రసక్తి లేని సాయుధ రైతాంగం పోరాటం అది. చాకలి ఐలమ్మ పండించిన పంటను భూస్వామి గూండాలు దోచుకుంటున్న సమయంలో, భీమిరెడ్డి నర్సింహారెడ్డి తదితరులతో కూడిన ఆంధ్రమహాసభ కార్యకర్తల బృందం ఆమెకు అండగా పోరాడింది. ఫలితంగా భీమిరెడ్డి నర్సింహారెడ్డిని బంధించి, నోట్లో మూత్రం పోయటంతో అనుభవించిన వ్యధను ఏ ‘కులం’ కోణంలో చూడగలం? ఇది భూపోరాటం. నిజాం రాచరికం స్థానంలో సోషలిస్టు సమాజం కోరుతున్న ఆలం ఖుంద్మిరి బృందం హైదరాబాద్ నగరంలో 1939 లోనే కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించింది. నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన కలం యోధుడు షోయబుల్లా ఖాన్‌ను 1948లో రజాకార్ మూకలు కాచిగూడ చౌరస్తా దగ్గర నరికి చంపారు. రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన బృందంలో మఖ్దూం మొహియుద్దీన్ ఒకరు. ఈ పరిణామాలను మతం కొలబద్దతో కొలవసాధ్యమా? కోస్తానుంచి సూర్యాపేటలో అడుగు పెట్టిన చండ్ర రాజేశ్వరరావు తెలంగాణలో కమ్యూనిస్టు బీజం వేసారు.
సాయుధ రైతాంగ పోరాటానికి పుచ్చలపల్లి సుందరయ్య ప్రత్యక్ష నాయకత్వం అందించారు. అనేకమంది కోస్తా జిల్లాల కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని, తెలంగాణ ప్రజలతో మమేకమయ్యారు. సరి హద్దు ప్రాంతాలలో దళాలకు షెల్టర్లు, శిక్షణ ఇచ్చారు. ఇలాంటి చరిత్రను ఏ ప్రాంతీయ కోణంలో చూడగలం? మహిళలు సైతం బందూకు పట్టిన సమరం. ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి ఆణిముత్యాలను సృష్టించిన ప్రజా ఉద్యమం. అన్ని రకాల అడ్డుగోడలను తొలగించుకొని ఐదేండ్ల పాటు సాగిన వర్గపోరాటం. ఈ చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం బీజేపీకే కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కూడా ఇష్టం లేదు. బీజేపీ, ఆరెస్సెస్‌లు దీన్ని మతకొట్లాటగా చిత్రీకరి స్తున్నాయి. ముస్లింల నుంచి హిందువుల విమోచనగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలకు ముందు, రజాకార్ పేరుతో వక్రభాష్యాలతో కూడిన సినిమా కూడా రాజకీయ ప్రయోజనాలతోనే జనంలోకి వదిలారు. లౌకిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెసు ప్రభుత్వం, ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (చరిత్ర!) అవార్డు, గద్దర్ పేరుతో ఇవ్వటం గమనించాలి.
విలీన దినోత్సవం పేరుతో నెహ్రూ సైన్యాల గొప్పతనం అంటారే తప్ప వాస్తవ చరిత్రను కాంగ్రెసు నేతలు కూడా మరుగు పరుస్తారు. ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల పేర్లు వాడుకోవటమే తప్ప వారి త్యాగాల మూలాలను చెప్పటం బీఆర్ఎస్ నాయకులకు కూడా గిట్టదు. చరిత్రను చరిత్రగా, ఉన్నది ఉన్నట్టు పరిశీలిస్తేనే వాస్తవాలు ఆర్ధం అవుతాయి. గతం గురించి సరిగా అర్థం చేసుకుంటేనే భవిష్యత్తుకు బాటలు వేయగలం. శ్రామిక ప్రజల ప్రయోజనాలకు అంకితమైన వారు మాత్రమే చరిత్రను శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. అంబానీలు, అదానీలు, కాంట్రాక్టర్లు, ఫామ్ హౌజ్ యజమానుల కోసం పనిచేసే వారు చరిత్రను మసిబూసి మారేడుకాయజేసేందుకు ప్రయత్నిస్తారు. తిమ్మిని బమ్మిని చేసేందుకు విఫలయత్నం చేస్తారు. తెలంగాణలో అధికారం కోసం ప్రతిదీ మతం పేరుతో దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ, ఆరెస్సెస్ ఎత్తుగడల పట్ల తెలంగాణ ప్రజలు, ప్రజాతంత్ర వాదులు అప్రమత్తంగా ఉండాలి.
ఎస్. వీరయ్య



