భారత్, బంగ్లాదేశ్ సెమీస్ నేడు
ఏసీసీ మహిళల ఆసియా కప్
దుబాయ్ (యుఏఈ) : అజేయ రికార్డుతో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత మహిళల జట్టు.. నేడు ఫైనల్ బెర్త్‌పై కన్నేసి బరిలోకి దిగుతున్నారు. గ్రూప్ దశలో ఏకపక్ష విజయాలు నమోదు చేసిన హర్మన్‌ప్రీత్‌కౌర్ సేన నేడు కీలక సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత సీజన్లో బంగ్లాదేశ్ చేతిలో భంగపడిన టీమ్ ఇండియా.. నేడు ఆల్‌రౌండ్ షోతో ఫైనల్లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మహిళల ఆసియా కప్‌లో భారత్, బంగ్లాదేశ్ తొలి సెమీఫైనల్ పోరు నేడు.
జోరుమీదున్న భారత్
టైటిల్ ఫేవరేట్‌గా ఆసియా కప్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా గ్రూప్ దశలో ఆ ట్యాగ్‌కు న్యాయం చేసింది. ఓపెనర్ స్మృతీ మంధాన పరుగుల వరద పారిస్తుండగా.. స్పిన్నర్లు శ్రీ చరణి, దీప్తి శర్మలు మ్యాజిక్ చేస్తున్నారు. స్మృతీ మంధాన, షెఫాలీ వర్మ, ప్రతికా రావల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, భార్టి ఫుల్మాలీ తమదైన ఇన్నింగ్స్ బాకీ పడ్డారు. దీప్తి వర్మ, ప్రేమ రావత్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, నందని శర్మలు నిలకడగా రాణిస్తున్నారు. దీంతో భారత్ నేడు సెమీఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
బౌలర్లపైనే భారం
గత ఆసియా కప్‌లో భారత్‌పై సంచలన విజయం సాధించిన బంగ్లాదేశ్ నేడు సెమీఫైనల్లోనూ అటువంటి ప్రదర్శన పునరావృతం చేయాలనే ఆలోచనతో కనిపిస్తోంది. స్వింగ్ బౌలర్ మారుఫా అక్తర్, ఫహిమా ఖాటున్, నహిదాలపై బంగ్లాదేశ్ ఎక్కవుగా ఆశలు పెట్టుకుంది. భారత బ్యాటింగ్ లైనప్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేయటమే బంగ్లాదేశ్ గేమ్ ప్లాన్‌గా కనిపిస్తోంది. దుబాయ్ పిచ్ పరిస్థితుల్లో ఎవరి బౌలింగ్ ప్రణాళికలు పట్టాలెక్కుతాయో చూడాలి.



