Tuesday, August 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆదర్శ కమ్యూనిస్టు

ఆదర్శ కమ్యూనిస్టు

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నేత, ఏఐకేఎస్‌ ‌జాతీయ నేత సారంపల్లి మల్లారెడ్డి ఆదర్శ కమ్యూనిస్టు అనీ, అన్నదాతల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన రైతు బాంధవుడని సీపీఐ(ఎం) రాష్ట్ర
కార్యదర్శి జాన్‌‌వెస్లీ కొనియాడారు. ఆయన నిరాడంబర జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. మల్లారెడ్డి మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమవారం ఎంబీ భవన్‌‌లో సారంపల్లి మల్లారెడ్డి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ..భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేదలకు భూములు పంచడంలోనూ, పేదలపై భూస్వాములు చేస్తున్న దాడులను తిప్పికొట్టడంలో సారంపల్లి మల్లారెడ్డి సాహసోపేతమైన పాత్రను కొనియాడారు. రైతాంగ సమస్యలపైనా, సాగునీటి రంగంపైనా ఆయనకు అపారమైన జ్ఞానం ఉండేదనీ, బడ్జెట్‌‌ లోతుపాతులను విశ్లేషించి పాలకుల విధానాలను ఎండగట్టడంలోనూ మల్లారెడ్డి కృషి మరువలేనిదని తెలిపారు. విద్యా, సామాజిక రంగాలపై ఆయా ప్రభుత్వాల నిధుల కేటాయింపు, ఆ తర్వాత దారి మళ్లింపు అంశంపై అధ్యయనం చేసి ఉద్యమాల నిర్మాణానికి ఇతోధికంగా సహకారం అందించారని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు సీపీఐ(ఎం) కోసమే పనిచేశారని గుర్తుచేశారు. దేశంలో వర్గ, సామాజిక పోరాటాలను నడపడమే మల్లారెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -