అత్యవసరంగా
ఈఎస్‌ఐసీకి అభ్యర్థన
ఈ ఒక్క సారి ఇవ్వండని వేడుకోలు
ఆ తర్వాత రాష్ట్రానిదే బాధ్యతంటూ స్పష్టీకరణ
ఈఎస్‌ఐ లేఖలో పలు అనుమానాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన ఈఎస్‌ఐ వ్యవస్థలో అత్యవసర వైద్య సామగ్రి కొరత సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రికి సంబంధించి సోమవారం విడుదల చేసిన అధికారిక లేఖ వెలుగులోకి తెచ్చింది. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతూ నిరంతరం సీఏపీడి చికిత్స పొందుతున్న రోగులకు అవసరమైన సీఏపీడి ద్రవాలు, ఇతర వినియోగ సామగ్రిని కొనుగోలు చేసి సరఫరా చేయాలని రాష్ట్ర ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగం నేరుగా ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ను కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ చేసిన అభ్యర్థన మేరకు సీఏపీడి కిట్లతో పాటు అవసరమైన ఇతర పరికరాలను ఈ ఒక్క సారికి సరఫరా చేయాలని ఈఎస్‌ఐసీని అభ్యర్థించింది. ఈ మేరకు డీఐఎంఎస్( డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) సోమవారం రీజినల్ డైరెక్టర్, ఈఎస్‌ఐసీ హైదరాబాద్‌కు ఆర్‌సీ నెం 4998 ద్వారా అభ్యర్థించింది.
ఈ ఒక్కసారి మాత్రమే…
ఈ లేఖలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, సీఏపీడీ సామగ్రి కొనుగోలు విషయంలో ఇది “ఒక్క సారి మాత్రమే కొనివ్వండి” అని స్పష్టం చేసింది. అంటే, ప్రస్తుతం ఏర్పడిన అవసరాన్ని తీర్చేందుకు ఒక్కసారి మాత్రమే ఈఎస్‌ఐసీ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేయాలని కోరారు.అయితే భవిష్యత్తులో ఈ సామగ్రి కొనుగోలు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని కూడా లేఖలో పేర్కొన్నారు. దీంతో ఒక కీలకమైన ప్రశ్న ముందుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉన్న అత్యవసర సీఏపీడీ కిట్లు సామగ్రి సకాలంలో ఎందుకు అందుబాటులో లేకపోయింది? సీఐటీయూ ప్రశ్నించింది. దీనికి సమాధానం చెప్పాల్సింది కార్మిక రాజ్య బీమా సంస్థే.
ఖర్చు కూడా ప్రభుత్వ ఖాతాలోనే!
సీఏపీడీ కిట్లు, అవసరమైన పరికరాలు కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం ఈఎస్‌ఐసీకి చెల్లించాల్సిన ఆన్-ఎకౌంట్ పేమెంట్ నుంచి మినహాయించాలని కూడా లేఖలో కోరారు. అంటే అవసరమైన సామాగ్రిని ఈఎస్‌ఐసీ కొనుగోలు చేసి సరఫరా చేయాలి, దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వానికి రావాల్సిన లేదా ప్రభుత్వం చెల్లించాల్సిన ఖాతాల్లో సర్దుబాటు చేయాలన్న ప్రతిపాదన కనిపిస్తోంది. ఇది సాధారణ కొనుగోలు ప్రక్రియ కాదనీ, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆశ్రయించినట్టు అర్థమవుతోందని వైద్య రంగ వర్గాలు చెబుతున్నాయి.
సీఏపీడీ రోగుల పరిస్థితి ఏంటి?
సీఏపీడీ చికిత్స పొందుతున్న కిడ్నీ రోగులకు అవసరమైన కిట్లు, తగిన పరికరాలు నిరంతరం అందుబాటులో ఉండటం అత్యంత కీలకం. ఈ సామాగ్రి సరఫరాలో అంతరాయం ఏర్పడితే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. గులకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా, అత్యవసర సమయంలో మరో సంస్థను ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం ఈఎస్‌ఐ వైద్య సేవల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాధ్యత రాష్ట్రానిదే… అయితే ఏర్పాట్లు ఎక్కడ?
లేఖలోనే భవిష్యత్తు కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టంగా చెప్పడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే సీఏపీడీ రోగులకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు శాశ్వత వ్యవస్థ ఉండాల్సిందేనని అధికారులు పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అయితే..అవసరమైన సీఏపీడీ ప్లూయిడ్స్, కిట్లు, ఇతర పరికరాలు ముందుగానే ఎందుకు కొనలేదో రోగులకు చెప్పాల్సిన బాధ్యత ఈఎస్‌ఐపై ఉంది. రోగులకు ఇబ్బంది తలెత్తిన తర్వాతే అత్యవసర చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలి. ఇది నిజంగానే ఒక్కసారి ఎదురైన సమస్యా? లేక ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో కొనుగోలు, సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనమా? స్పష్టం చేయాలి.
“రోగి ప్రాణం కంటే ఫైళ్లే ముఖ్యమా?”
కిడ్నీ రోగులకు చికిత్స నిరంతర ప్రక్రియ. వారికి అవసరమైన సామాగ్రి విషయంలో ఒక్కరోజు ఆలస్యం కూడా ఆందోళన కలిగించే అంశమే. కానీ ప్రభుత్వ విభాగాల మధ్య బాధ్యతలు, చెల్లింపులు, కొనుగోలు ప్రక్రియలు, అనుమతుల ఫైళ్లు తిరుగుతున్న సమయంలో రోగి మాత్రం తనకు అవసరమైన చికిత్స కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
లేఖలోని కీలక అంశాలు
నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రికి సీఏపీడి ప్లూయిడ్స్, అవసరమైన పరికరాలు అవసరం.ఈఎస్‌ఐసీ ద్వారా కొనుగోలు చేసి సరఫరా చేయాలని విజ్ఞప్తి. కొనుగోలు ఖర్చును ప్రభుత్వ ఖాతా చెల్లింపుల్లో సర్దుబాటు చేయాలన్న ప్రతిపాదన. ఇది “ఒక్క సారి కొనుగోలు మాత్రమే” అని స్పష్టీకరణ. భవిష్యత్ కొనుగోలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అధికారులు పేర్కొన్నారు.



