Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎస్‌ఎఫ్‌ఐ ధర్నా భగ్నం

ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా భగ్నం

- Advertisement -

ధర్నాచౌక్ కు వెళ్లకుండా పోలీసుల అడ్డగింత
ఇందిరాపార్క్ సిగ్నల్ వద్దే నాయకుల బైఠాయింపు
బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించిన పోలీసులు
అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్
​నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సోమవారం హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద తలపెట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర, జిల్లా నాయకులు, విద్యార్థులతో కలిసి అశోక్ నగర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ కు ప్రదర్శనగా బయల్దేరారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రయివేటీకరణను ఆపాలనీ, వెంటనే జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో కూడిన ప్ల కార్డులను ప్రదర్శిస్తూ బ్యానర్ చేత పట్టుకుని నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. శాంతియుతంగా వెళుతున్న విద్యార్థులను ఇందిరాపార్క్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు అడ్డగించారు. వారిని ధర్నాచౌక్ వైపు వెళ్లకుండా చుట్టుముట్టారు. తమ భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలనీ, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కుకు భంగం కలిగించొద్దని విద్యార్థులు పోలీసులను వేడుకున్న పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ లో ఆందోళనలు చేయడం కూడా నిషేధమేనా? ప్రజాపాలన పేరుతో విద్యార్థుల ఆందోళనలు పై ఆంక్షలు ఎందుకు ? అని వారు ప్రశ్నించారు. పోలీసులు ససేమిరా అనడంతో నాయకులు, విద్యార్థులు చౌరస్తా మధ్యలో బైఠాయించి కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ అప్రజాస్వామిక విధానాలు నశించాలంటూ నినాదాలు చేశారు. బలవంతంగా వారిని వాహనంలోకి ఎక్కించారు. అక్కడ్నుంచి దోమలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రయివేటుపరం చేసేందుకే జీవో 97 రద్దు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ లను యంగ్ ఇండియా స్కీల్ యూనివర్శీటీ లో వీలీనం చేసి, ఆస్తులు, విద్యార్ధులను ప్రయివేటు వ్యక్తులు అధీనంలోకి మార్చవద్దని డిమాండ్ చేశారు. ధర్నాచౌక్ లో నిరసనలు చేయడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం పేరుతో పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ధర్నా చౌక్ లో ధర్నాలను నిషేదించడం దుర్మార్గం అని , రాజ్యాంగం కల్పించిన భావాప్రకటన స్వేచ్ఛను హరించడమేనని విమర్శించారు. దేశంలో రాహూల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని దేశం మొత్తం తిరుగుతూ ప్రజాస్వామ్య రక్షణకు సందేశాలు ఇస్తుంటే, రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని అన్నారు.
2024లో స్కిల్ యూనివర్శీటీ చట్టం తీసుకుని వచ్చిందని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యం పేరుతో కార్పోరేట్ కంపెనీ ఎం.డి. ఆనంద్ మహీంద్రా నాయకత్వం వహిస్తున్న యూనివర్శీటీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ లను కలిపితే ప్రయివేటుపరం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే డిప్లొమాలోమా విద్యకు గుర్తింపు లేకుండా పోతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి. జి.వివేక్ విద్యార్థులకు హామీ ఇచ్చిన కూడా లాట్రల్ ఎంట్రీ, ఈ సెట్, ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై ఎందుకు జీ.వో.విడుదల చేయడం లేదని వారు ప్రశ్నించారు. 10 రోజుల నుంచి విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే వారిని పోలీసులతో నిర్బంధిస్తున్న ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కారానికి ప్రయత్నం చేయడం లేదని తప్పుపట్టారు.

పాలిటెక్నిక్ విద్యను స్కీల్ యూనివర్శీటీలో వీలీనం చేయకుండా, ఎస్బీటిఈటీని గుర్తించి దానిని కోనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఎందుకంటే ఎఐసీటీఈ గుర్తింపు, కర్క్యూలమ్ కోసం, ఎస్బీటిఈటీని తయారు చేసిన దానికి అప్రూవల్ ఇచ్చినప్పడు మాత్రమే వారు ఈసెట్, లాట్రల్ ఎంట్రీ అవకాశం ఉంటుందని గుర్తుచేశారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కళాశాలలో చేరాలంటే జెఎన్టీయుహెచ్ కూడా ఎఐసీటీఈ అప్రూవల్స్ లేకుండా ఎలా లాట్రల్ ఎంట్రీ సాధ్యపడుతుందో చెప్పాలని ప్రశ్నించారు.
స్కిల్ యూనివర్సిటీ గవర్నింగ్ బాడిలో ఉన్న నీతూ అంబానీ, ఉపాసన, లాంటి కార్పోరేట్ కంపనీలు ప్రభుత్వ విద్యను పరిరక్షణ ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. ఉపాధి, స్కిల్ పేరుతో పేద వర్గాల చదువును ప్రయివేట్, కార్పోరేట్ వర్గాలకు అప్పగించేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జీ.వో.నెంబర్ 97ను రద్దు చేయకుంటే ఎన్ని నిర్బంధాలు పెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ప్రజాపాలనలో ధర్నా చౌక్ లలో కూడా ధర్నాలు కూడా చేయకుండా నిషేదించి, గొంతు నొక్కితే తగిన పాఠం చెబుతామన్నారు. అరెస్టైన వారిలో రజనీకాంత్, నాగరాజులతో పాటు ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శి జి.కార్తీక్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.వై.ప్రణయ్,హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు లెనిన్ గువేరా, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, అరుణ్, రజనీకాంత్, లిఖిత్, నాగేంద్ర, కైలాష్, సాయి, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -