ఎంపీ రఘునందన్ రావుకు
పీసీసీ చీఫ్ సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఉమ్మడి మెదక్ పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా కమలం పాలనలో ఉద్యోగాలు ఊడగొట్టే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. జెన్ జీ ఉద్యమం మోడీకి చెంపపెట్టు అని విమర్శించారు. మతం కులం పేరిట రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఉద్యోగాలు ఎక్కడా అని యువత ప్రశ్నిస్తోందని గుర్తుచేశారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన మోడీ ఇంటికేనని ఆయన ఎద్దేవా చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు కాపాడేందుకు సర్ ప్రక్రియపై తీక్షణంగా పని చేసినట్టు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరు వివరాలు అందజేసి ఓటును కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకున్నామని భరోసానిచ్చారు. పార్టీలో పాతవారికి 70 శాతానికి పైగా పదవులు వస్తాయని తెలిపారు. మార్కెట్, సొసైటీ, టెంపుల్, లైబ్రరీ పదవుల్లో పాతవారికి ( సీనియర్ నాయకులకు) మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 100 సీట్లతో అధికారంలోకి వస్తామని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. అర్హత కలిగిన పేదలందరికి ఇండ్లు ఇస్తున్నామని, వారికి చేరువలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాను నమ్ముకున్న కేటీఆర్ అదే గాల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువనీ, హద్దులు దాటి మాట్లాడితే పార్టీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చింది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



