క్రిటికల్ మినరల్ వైపు ప్రోత్సహిస్తున్నాం :
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థను లాభాల బాటలో నడిపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణికి చెందిన పలు కార్మిక సంఘాలు సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో భట్టిని ఘనంగా సన్మానించారు. 9ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు బ్లాక్‌లను తీసుకోకపోవడం, ఉన్న గనులను మూసివేయడం వల్ల సింగరేణికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఐదారు సంవత్సరాల్లో సంస్థ మూతపడే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో నైని కోల్ బ్లాక్‌ను సాధించామన్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వం రీ-అసైన్ చేసిన తాడిచర్ల-2 కోల్ బ్లాక్ విషయాన్ని కేంద్రంతో మాట్లాడి మైనింగ్ లీజు దక్కించుకోవడంలో ప్రభుత్వం సఫలమైందని తెలిపారు. జెన్కోను ఒప్పించి, సింగరేణికి వేలంలో మణుగూరు డిప్ సైడ్ బ్లాక్ -2 దక్కేలా కృషి చేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో సోలార్, విండ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తుండటంతో భవిష్యత్తులో థర్మల్ పవర్ డిమాండ్, బొగ్గు వినియోగం తగ్గే అవకాశం ఉందన్నారు. కేవలం బొగ్గుపైనే ఆధారపడితే సింగరేణి కూడా ఒకప్పటి బీఎస్‌ఎన్‌ఎల్‌లా వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ప్రపంచ మార్పులకనుగుణంగా కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ వంటి ‘క్రిటికల్ మినరల్స్’ మైనింగ్ వైపు సింగరేణిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలోని గోల్డ్ మైన్ వేలంలో పాల్గొని సాధించామనీ, ఆ గని ద్వారా భవిష్యత్ లో అక్కడ మైనింగ్ చేస్తే సింగరేణికి నిరంతరం రాయల్టీ వస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే మైనింగ్ బ్లాక్‌లను దక్కించుకునేలా సింగరేణి తన ప్రయత్నం కొనసాగించాలని సూచించారు. భట్టిని కలిసిన వారిలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, రాజ్‌కుమార్, ప్రాతినిథ్య కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీపతి గౌడ్, పెద్ది నర్సింహులు, అన్ని ఏరియాలకు సంబంధించిన గుర్తింపు, ప్రాతినిథ్య, అధికార సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



