31న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
సెప్టెంబర్ 1 నుంచి 10వ తేదీ లోపు పంచాయతీల్లో నిరసనలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపు
నవతెలంగాణ-మంచాల
ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టాలని పార్టీ కార్యకర్తలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ఆగస్టు 31వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని అన్నీ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టాలని తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను సైతం విస్మరించడం బాధాకరమన్నారు. గ్రామాల్లో అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటి పరిష్కారానికి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, కేవలం బియ్యంతో సరిపెట్టకుండా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరారు. ఇండ్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.
ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు కట్టించి ఇవ్వాలని తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ఆయా రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ క్యాడర్ జిల్లాలోని అన్నీ గ్రామాల్లో పర్యటించి, స్థానిక సమస్యలసై సర్వే చేపట్టాలని తెలిపారు. ఆయా గ్రామాల్లో సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పోరాడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నుంచి 10వ తేదీ వరకు అన్ని గ్రామ పంచాయతీల ఎదుట స్థానిక సమస్యల పరిష్కారానికి ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ళ భాస్కర్, బి.సామెల్, ఎం.చంద్రమోహన్, డి.రామచందర్, కందుకూరి జగన్, జిల్లా కమిటీ సభ్యులు అలంపల్లి నర్సింహ, రావుల జంగయ్య, సీహెచ్. బుగ్గరాములు, పి.అంజయ్య, సీహెచ్. జంగయ్య, గోరెంకాల నర్సింహ, జె.రుద్రకుమార్, డి.కిషన్, పీఎన్ఎం జిల్లా అధ్యక్షులు కే.శారద, వివిధ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



