Wednesday, April 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలను తప్పుదోవ పట్టిచ్చే ప్రచారంపై హైడ్రా ఖండన

ప్రజలను తప్పుదోవ పట్టిచ్చే ప్రచారంపై హైడ్రా ఖండన

- Advertisement -

ఐలాపూర్‌లో అనుమతులు లేకుండా ‘అజీమ్‌’ నిర్మాణాలు షోకాజ్‌ నోటీసులు..
స్పీకింగ్‌ ఆర్డర్లు బేఖాతర్‌ అద్దెకు ఉన్నవారికీ
ఖాళీ చేయాలని నోటీసులు సామాన్లు కిందకు దించిన తర్వాతే కూల్చివేత
నవతెలంగాణ-సిటీబ్యూరో

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో కబ్జాదారులకు హైడ్రా కల్లెం వేసిన విషయం విదితమే. దశాబ్దాలుగా న్యాయవాది ముసుగులో ఎంఎ.ముఖీం సాగిస్తున్న ఆక్రమణలకు హైడ్రా చెక్‌ పెట్టింది. దీంతో ఆ పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు సామాజిక మాద్యమాల్లో(సోషల్‌ మీడియా) ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడాన్ని హైడ్రా ఖండించింది. ఈ విషయంపై హైడ్రా అధికారులు శనివారం వివరాలు వెల్లడించారు.
ముఖీం సోదరుడు ఎంఏ అజీం దుబారులో నివాసం ఉంటున్నాడు. షోకాజ్‌ నోటీసులు, స్పీకింగ్‌ ఆర్డర్లను పట్టించుకోకుండా అనుమతులేవీ లేకుండా ఎంఎ.అజీం తన అనుచరగణంతో అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో 6 అంతస్తుల భవన నిర్మాణం చేశారు. ప్రభుత్వ భూమిలో భవన నిర్మాణంపై స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా విచారణ చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న అజీం అపార్టుమెంట్లు కట్టి, హైడ్రా వచ్చేసరికే కొన్నింటిని విక్రయించాడు. ఈ క్రమంలోనే ఐలాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న నిర్మాణాలపై హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఇప్పటికే 4 అపార్టుమెంట్లు నిర్మించి ప్రజలకు అమ్మేయగా.. శనివారం తొలగించిన 6 అంతస్తుల భవనం నిర్మాణ దశలోనే హైడ్రా హెచ్చరించింది. ఈ భవనానికి ఎలాంటి అనుమతులూ లేవని 2025 జూన్‌ 25వ తేదీన హైడ్రా షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. పంచాయతీతోపాటు మున్సిపాలిటీలోనూ ఎక్కడా ఎలాంటి అనుమతులు తీసుకున్నట్టు ఆధారాలు లేవని హైడ్రా నిర్ధారించింది. దీంతో 2025 జులై 3న స్పీకింగ్‌ ఆర్డర్‌ను హైడ్రా జారీ చేసింది. 15 రోజుల గడువు కూడా ఇచ్చింది.

షోకాజ్‌ నోటీసు, స్పీకింగ్‌ ఆర్డర్‌ను పట్టించుకోకుండా.. భవన నిర్మాణాన్ని ముఖీం సోదరుడు అజీం పూర్తి చేశాడు. హైడ్రా నోటీసుల దృష్ట్యా కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ భవనంలోని 45 ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడు పోలేదు. దీంతో వాటిని అజీం తన అనుచరులతోపాటు, ఈ విషయాలు ఏవీ తెలియని అమాయకులతో 20 ఫ్లాట్ల వరకూ నింపాడు. అద్దెకు ఉన్న వారిని ఖాళీ చేయాలంటూ భవన యజమానికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 11న రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు శాఖలతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్‌ చేపట్టింది. అందులో ఉంటున్న వారికి హైడ్రా డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అండగా ఉంటూ, వారి సామాన్లను భద్రంగా కిందకు దించింది.

ఈలోగా ఒకటి, రెండు సామాజిక మాద్యమాల వారు.. భవనంలో ఉన్న వారి ఫొటోలు, సామాన్లను సర్దుకుంటున్న వారి ఫొటోలను, వీడియోలు తీసి ప్రసారం చేసి గందరగోళం సృష్టించాలనుకున్నారు. వాస్తవానికి ఆ భవనాన్ని కూల్చడం గంటల్లో జరిగిపోయేది. కానీ అందులో ఉన్న కొద్దిమందిని ఖాళీ చేయించడానికి, తరలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైడ్రా సమయం ఇచ్చింది. నిర్మాణాల తొలగింపుతో ముఖీం ఆగడాలకు అడ్డుకట్ట పడిందని అక్కడ నివాసితులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఆగడాలకు చెక్‌ పెట్టడంలో అందరూ పాత్రదారులు కావాలని హైడ్రా కోరుతోందని అధికారులు వివరణ ఇచ్చారు. సామాజిక మాద్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -