నవతెలంగాణ-రుద్రంగి
రుద్రంగి మండల కేంద్రంలోని ఒకటవ వార్డులో గల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ అంబటి సరితా ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒకటవ వార్డు సభ్యులు గసికంటి ప్రేమల రాజు,గ్రామ కార్యదర్శి స్వామి, ముఖ్య అతిథులుగా హాజరై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వార్డు సభ్యురాలిని సన్మానించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు గసికంటి ప్రేమల మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు,చిన్న పిల్లలు పోషకాహారం తీసుకోవడం ద్వారానే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
అనంతరం గ్రామ కార్యదర్శి స్వామి మాట్లాడుతూ. గ్రామంలోని గర్భిణులు, బాలింతలు రక్తహీనత బారిన పడకుండా ఉండటానికి ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని రోజువారీగా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అంగన్వాడీ టీచర్ అంబటి సరిత మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తున్న ఈ పోషణ మాసం ఉద్దేశాలను వివరించారు. చిన్నపిల్లల్లో కుంగుబాటు, బరువు తక్కువగా ఉండటం వంటి సమస్యలను నివారించడానికి తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఆహార నియమాలను ఆమె తల్లులకు అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సమస్యలను గ్రామ కార్యదర్శి కి,వార్డు సభ్యుల కు వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, గర్భిణులు,బాలింతలు,పాల్గొన్నారు.



