Monday, September 21, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను తరలించడమే లక్ష్యం

సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను తరలించడమే లక్ష్యం

- Advertisement -

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
– మంత్రి తుమ్మల యాతాలకుంట టన్నెల్ ఆకస్మిక పరిశీలన 
నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి ట్రంక్‌కు గోదావరి జలాలను తరలించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు గోదావరి జలాలను సత్తుపల్లి ట్రంక్‌కు విడుదల చేసేందుకు యాతాలకుంట వద్ద జరుగుతున్న సొరంగ కాలువ (టన్నెల్) పనులను అక్టోబర్ 15వ తేదీ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం వద్ద జరుగుతున్న సీతారామ పంప్ హౌస్–3 పనులపై సమీక్ష సమావేశానికి సోమవారం  వెళుతున్న క్రమంలో మంత్రి తుమ్మల మార్గ మధ్యలో ఉన్న సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట టన్నెల్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

​ఈ సందర్భంగా యాతాలకుంట వద్ద టన్నెల్ పనుల పురోగతిని, సత్తుపల్లి ట్రంక్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్షించారు. పనుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించవద్దని, లక్ష్యం మేరకు పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని, అందుకే పెండింగ్ పనులన్నింటిని  సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.​ 

గోదావరి జలాలను బేతుపల్లి చెరువులోకి రప్పించేందుకు సర్వం సిద్ధం
గోదావరి జలాలను బేతుపల్లి చెరువులోకి మళ్లించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రాజెక్టు పనుల నిర్మాణ ‌విషయంలో అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా ఉన్న భూసేకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ​భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.45 కోట్లు విడుదల చేశారని తుమ్మల గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల దిశానిర్దేశంలో సత్తుపల్లి ప్రాంతానికి నీటిని అందించేందుకు పట్టుదలతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. 

గండుగులపల్లి పంపు హౌస్-4 పనులను త్వరలో పూర్తి చేస్తాం
గండుగలపల్లిలోని పంప్‌హౌస్–4 పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పంప్‌హౌస్–4 పూర్తయితే దమ్మపేట, అశ్వారావుపేట మండలాల ప్రజలకు, వ్యవసాయ రంగానికి సమృద్ధిగా గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

​ఈ ఆకస్మిక తనిఖీ, సమీక్షా సమావేశంలో అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు,  ప్రజాప్రతినిధులు, ప్రాజెక్ట్ పనుల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. యాతాలకుంట టన్నెల్ పనుల పరిశీలన అనంతరం ములకలపల్లి మండలం కమలాపురంలో సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్–3 వద్ద మోటార్ స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాలను దిగువకు మంత్రి విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -