ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల అధిపతుల రాక
మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌లో ఘర్షణలు, కృత్రిమ మేధపై చర్చ
ఈ ఏడాది చివరి నాటికి పూర్తికానున్న
ఐరాస సెక్రెటరీ జనరల్ పదవీకాలం
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ న్యూయార్క్‌లోని తన కేంద్ర కార్యాలయంలో నేటి నుంచి 28వ తేదీ వరకూ కీలక అంశాలపై చర్చలు జరపబోతోంది. ప్రధానంగా మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఘర్షణలతో పాటు కృత్రిమ మేధ కారణంగా ఎదురయ్యే సమస్యలపై ఈ చర్చలలో దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రపంచంలోని సుమారు 130 దేశాల అధిపతులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ ఏడాది చివరి నాటికి తన పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారు. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇంకా తెలియడం లేదు. పదిహేను మంది సభ్యులున్న భద్రతామండలి కూడా కీలక అంశాలపై చర్చిస్తుందని దౌత్యవేత్తలు తెలిపారు. కాగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బుధవారం నాడు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గురువారం ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ వరుసగా రెండో సంవత్సరం కూడా సమావేశాలకు హాజరు కావడం లేదు. ఆయనకు ట్రంప్ ప్రభుత్వం వీసాను నిరాకరించింది. అయితే అబ్బాస్ వీడియో ద్వారా సమావేశాలకు హాజరయ్యేందుకని జనరల్ అసెంబ్లీ అనుమతించింది. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ కూడా ఐరాస సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.



