Tuesday, September 22, 2026
E-PAPER
Homeక్రైమ్మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

మైనర్ బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆమె ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు. నిందితుడు గోల్కొండ రాజశేఖర్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన మైనర్ బాలిక 2021 డిసెంబర్‌ 09న ఆధార్ కార్డు మార్పు కోసం కాటారం వెళ్లేందుకు ధన్వాడ బస్టాండ్ వద్ద ఆటో కోసం వేచి ఉంది. అదే సమయంలో పరిచయస్తుడైన వ్యక్తి మోటార్ సైకిల్‌పై కాటారం వెళ్తుండగా అతనితో కలిసి బయలుదేరింది.

మార్గమధ్యంలో నిందితుడు రాజశేఖర్ బాలికను బెదిరించి తన మోటార్ సైకిల్‌పై ఎక్కించుకొని చింతకాని క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న తన గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం కాటారం సెంటర్‌లో బాలికను దింపి, జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక కాటారంలో గడ్డి మందు సేవించి ఇంటికి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె బాబాయి సంరక్షణలో ఉండేది. బాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి కాటారం ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన ఏఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేశారు. తదుపరి అప్పటి కాటారం సీఐ రంజిత్ రావు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సరైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ సమయంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం సీఐ నాగార్జున రావు, కాటారం ఎస్‌ఐ సీహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోర్టు లైజన్ ఆఫీసర్ ఏఎస్ఐ జి.వెంకన్న, కోర్టు కానిస్టేబుల్ కె. రమేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎన్. విష్ణువర్ధన్ రావు, జి. వెంకట్రామ్ తమ వాదనలు వినిపించారు. పోలీసుల దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -