Tuesday, September 22, 2026
E-PAPER
Homeఖమ్మంఐక్య పోరాటాలతో ఆయిల్‌ఫెడ్‌ ఆస్తులను కాపాడుకున్నాం

ఐక్య పోరాటాలతో ఆయిల్‌ఫెడ్‌ ఆస్తులను కాపాడుకున్నాం

- Advertisement -

– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను రైతులం ఐక్యంగా పోరాడి రక్షించుకో గలిగామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ఆయిల్‌ఫెడ్‌ ఆస్తుల విక్రయానికి సంబంధించిన చర్యలను నిలిపివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు స్వాగతించదగినవేనని, అయితే భవిష్యత్తులోనూ ఈ ఆస్తులు రైతుల ప్రయోజనాలకే ఉపయోగపడేలా శాశ్వత రక్షణ కల్పించాలని ఆయన కోరారు.

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ ప్రాంతంలోని ఆయిల్‌ఫెడ్‌కు సంబంధించిన 15,984.50 చదరపు గజాల భూమి విషయంలో ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలు, అనంతరం రైతు సంఘాల ఆందోళనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయని తెలిపారు. ఈ భూమి 1991లో జారీ చేసిన జీవో నంబర్‌ 93 ద్వారా అప్పటి ఏపీ ఆయిల్‌ఫెడ్‌కు కేటాయించబడిందని, రాష్ట్ర విభజన అనంతరం జీవో నంబర్‌ 366 ద్వారా తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ పరిధిలోకి వచ్చిందని పేర్కొన్నారు.

ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఈ స్థలం వందల కోట్ల రూపాయలు విలువ చేస్తుందని, ఇలాంటి ఆస్తులను విక్రయించడం ద్వారా రైతులకు భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను దూరం చేసే అవకాశం ఉందని పుల్లయ్య అన్నారు. ఆయిల్‌ఫెడ్‌ భూమికి పూర్తి హక్కులు కల్పించి ఫ్రీహోల్డ్‌ హక్కులు ఇవ్వాలని రైతు సంఘం ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయిల్‌ఫెడ్‌ అనేది కేవలం ఒక ప్రభుత్వరంగ సంస్థ కాదని, పామాయిల్‌ రైతులకు మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌, సాంకేతిక సహకారం అందించే వ్యవస్థలో కీలక భాగమని పుల్లయ్య అన్నారు. 

రాష్ట్రంలో పామాయిల్‌ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయిల్‌ఫెడ్‌ ఆస్తులను విక్రయించకుండా భవిష్యత్తులో ఫ్యాక్టరీలు, రైతు సేవా కేంద్రాలు, శిక్షణా కేంద్రాలు, ఇతర రైతు అవసరాలకు వినియోగించాలని సూచించారు. ఇటీవల ఆయిల్‌ఫెడ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయని, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం, విలువైన స్థిరాస్తులను విక్రయించడం వల్ల పామాయిల్‌ రైతుల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని రైతు సంఘాల నాయకులు పేర్కొన్న విషయం తెలిసిందే. 

రైతుల పోరాటాలతోనే అనేక సమస్యలకు పరిష్కారం:
పామాయిల్‌ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలోనూ రైతు సంఘాలు నిరంతర పోరాటాలు నిర్వహించాయని పుల్లయ్య తెలిపారు. నాణ్యమైన మొక్కలు, ఫ్యాక్టరీల విస్తరణ, రైతులకు పంటను ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం,తాజా పామాయిల్ గెలలు సేకరణ (ఫ్రూట్‌ కలెక్షన్‌) కేంద్రాలు తదితర అంశాల్లో ఉద్యమాల ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం, ఆయిల్‌ఫెడ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 

ఆస్తుల అమ్మకం నిలిపివేయడమే కాకుండా వాటిని ఆయిల్‌ఫెడ్‌ ఆధీనంలో శాశ్వతంగా రక్షించాలి.రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం వచ్చినా రైతులు పార్టీలకు అతీతంగా ఐక్యంగా స్పందించాలని కోరారు. కోట్ల విలువైన ఆయిల్‌ఫెడ్‌ ఆస్తులు రైతుల సంపదగా మిగలాలంటే ఐక్య పోరాటమే మార్గం అని పుల్లయ్య అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -