Friday, August 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమైనింగ్‌ అధికారిపై ఏసీబీ ఉచ్చు

మైనింగ్‌ అధికారిపై ఏసీబీ ఉచ్చు

- Advertisement -

డ్రైవర్‌ ఖాతా నుంచి కుమార్తెకు రూ.24.80 లక్షలు!
ఫిర్యాదు నేపథ్యంలో 8 ప్రాంతాల్లో సోదాలు..రూ.3.06 కోట్ల ఆస్తులను గుర్తించాం : ఏసీబీ
ఇటీవల ఉత్తమ అధికారిగా పురస్కారం అందుకున్న మైనింగ్‌ ఏడీ బొజ్జ జయరాజ్‌

​నవతెలంగాణ–బోడుప్పల్‌/భూపాలపల్లి
​ఆయన ప్రభుత్వ శాఖలో కీలక అధికారి. ఇటీవల ఉత్తమ అధికారిగా పురస్కారం కూడా అందుకున్నారు. కానీ కొద్ది రోజులకే ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదైంది. గురువారం రాష్ట్రంలోని ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.3.06 కోట్ల ఆస్తులు వెలుగుచూశాయి. డ్రైవర్‌ ఖాతా నుంచి ఆయన కుమార్తె ఖాతాకు రూ.24.80 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించడం ఈ కేసులో కీలక మలుపు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తూ, ప్రస్తుతం వరంగల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న బొజ్జ జయరాజుపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. వరంగల్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభమయ్యాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ లోని ఈస్ట్‌ హనుమాన్‌నగర్‌లో ఉన్న జయరాజ్‌ నివాసంతోపాటు భూపాలపల్లి కలెక్టరేట్‌లోని ఆయన కార్యాలయం, సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లోని బంధువులు, సహచరులకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.

30 నెలలుగా భూపాలపల్లి మైనింగ్‌ ఏడిగా విధుల్లో కొనసాగింపు
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మైన్స్‌ ఏడీ కార్యాలయంలో వరంగల్‌ ఏసీబీ కార్యాలయం నుంచి వచ్చిన సీఐ ప్రవీణ్‌కుమార్‌ బృందం సోదాలు నిర్వహించింది. కార్యాలయంలో రికార్డులను క్షుణంగా పరిశీలించింది. ఏసీబీ సోదాల సమయంలో ఏడీ కార్యాలయంలో లేరు. ఆర్‌ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్‌, అటెండర్‌లు మాత్రమే ఉండగా వారి నుంచి వివరాలు సేకరించారు. ఇసుక అక్రమ వ్యవహారంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏడీ జయరాజ్‌ ఇండ్లల్లో, కార్యాలయంతో పాటు పలు చోట్ల సోదాలు జరిగాయి. జయరాజ్‌ 2024 మార్చి15లో భూపాలపల్లిలో ఏడీగా విధుల్లో చేరారు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి జిల్లాలో ఉత్తమ అధికారిగా జయరాజ్‌ అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న కొద్ది రోజులకే ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఇల్లు నుంచి బంగారం వరకు..
సోదాల్లో బోడుప్పల్‌లో సుమారు రూ.40 లక్షల విలువైన జీ+2 భవనం, హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ఫ్లాట్‌ను అధికారులు గుర్తించారు. కీసరలోని రెండు ప్లాట్లతో కలిపి మొత్తం ఐదు ప్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ తెలిపింది. రూ.10.03 లక్షలతోపాటు మూడు బ్యాంకు ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలు బయటపడ్డాయి. పోస్టాఫీస్‌ పొదుపు పథకాల్లో రూ.20.86 లక్షలు, ఎల్‌ఐసీ, మ్యాక్స్‌ లైఫ్‌ పాలసీల్లో రూ.19.86 లక్షల పెట్టుబడులను గుర్తించారు. సుమారు రూ.37.23 లక్షల విలువైన 629 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.10.67 లక్షల విలువైన ఇంటి సామగ్రిని కూడా ఆస్తుల జాబితాలో చేర్చారు.

​డ్రైవర్‌ ఖాతా నుంచి బదిలీ
సోదాల సందర్భంగా జయరాజ్‌ డ్రైవర్‌ సత్తునూరి యాదయ్య మొబైల్‌ ఫోన్‌, బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన ఏసీబీ అధికారులకు కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. డ్రైవర్‌ బ్యాంకు ఖాతా నుంచి జయరాజ్‌ కుమార్తె ఖాతాకు పలుమార్లు కలిపి రూ.24.80 లక్షలు బదిలీ అయినట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇసుక రవాణా, సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల నుంచి డబ్బు సేకరించి అధికారి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్టు డ్రైవర్‌ విచారణలో వెల్లడించినట్టు ఏసీబీ పేర్కొంది. అయితే ఈ నగదు లావాదేవీల అసలు మూలం ఏమిటి? ఎందుకు బదిలీ చేశారు? వాటికి అక్రమ లావాదేవీలతో సంబంధం ఉందా? అనే అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

​డాక్యుమెంట్‌ విలువే రూ.3.06 కోట్లు
ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.3,06,53,177గా ఏసీబీ వెల్లడించింది. ఇది ప్రధానంగా అధికారిక, డాక్యుమెంట్‌ విలువ ఆధారంగా చేసిన లెక్కగా తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో స్థిరాస్తుల విలువ దీనికంటే మరింత ఎక్కువగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. జయరాజ్‌, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేరిట మరిన్ని ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తుల పత్రాలను ఏసీబీ పరిశీలిస్తోంది. గుర్తించిన ఆస్తుల మూలాలు, ఆయన చట్టబద్ధ ఆదాయంతో వాటికి ఉన్న వ్యత్యాసంపై ధ్రువీకరణ కొనసాగుతోంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలు నిర్ధారణ అయినట్టు భావించరాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -