నవతెలంగాణ-హైదరాబాద్: రజిత్ పటిదార్..రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్‌కు వరుసగా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన ఘనత అతని సొంతం. దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ సారథ్యంలో సాధ్యంకాని టైటిల్ కలను పటిదార్ సాధించాడు. జట్టు నాయకత్వా బాధ్యతలను సామర్థంగా నిర్వహించడంతో..ఇతర బ్యాటర్లు విఫలమైన సందర్భంగా తనదైన ఆటశైలితో విజృంభించాడు. IPL 2026 సీజన్‌లో, పాటిదార్ 192.69 స్ట్రైక్ రేట్‌తో 501 పరుగులు సాధించి, అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. మిడిల్ ఓవర్లలో దూకుడుగా ఆడుతూ జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు.
కానీ ఇటీవల జరిగిన ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన సీనియర్ సెలక్షన్ కమిటీ అతనికి మొండి చేయి చూపించిన విషయం తెలిసిందే. సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో పాటిదార్‌ను ఎంపిక చేయకపోవడంపై.. బీసీసీఐ ఎంపిక కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌ను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు సంధించారు. ఈక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జట్టులో కేవలం 15 మందికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉన్నందున అర్హులైన ఆటగాళ్లందరినీ ఎంపిక చేయడం సాధ్యం కాదని ఆయన అంగీకరించారు.
“మేము చాలా మంది ఆటగాళ్ల గురించి చర్చించాము. ఈ 15 మంది ఎంపికకు అర్హులని మేము భావిస్తున్నాము. భారత్‌లో చాలా మంది మంచి ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో నేరుగా చోటు దక్కించుకునే స్థాయి ఉన్నవారు చాలా మందే ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆడుతున్న వారు తమ శాయశక్తులా రాణిస్తున్నారు. మేము ఒక మంచి జట్టును ఎంపిక చేశామని భావిస్తున్నాము. ఎంపికలో కొందరు ఆటగాళ్లు తప్పిపోవడం సహజం, కానీ మేము ఎంపిక చేసిన జట్టు పట్ల సంతోషంగా ఉన్నాము,” అని అగార్కర్ విలేకరుల సమావేశంలో అన్నారు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లో జరుగనున్న ఆసియా క్రీడలకు భారత జట్లను ఎంపిక చేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఆసియా క్రీడల్లోనూ భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు.



