రోజుకు 37 లక్షల మందికి
ఉచిత ప్రయాణం
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులు :
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మహిళల జీవితాల్లో మహాలక్ష్మి పథకం వెలుగులు నింపుతున్నదని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ తొమ్మిదిన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో ఒక సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిందని గుర్తు చేశారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినట్టు తెలియజేశారు. నిత్యం పనుల కోసం, చదువుల కోసం, కుటుంబ అవసరాల కోసం పయనించే మహిళలకు ఇది ఆర్థికంగా ఎంతో అండగా నిలుస్తూ, వారిని నిజమైన మహారాణులుగా మార్చిందని చెప్పారు. ఈ పథకం ద్వారా రోజుకు 37 లక్షల మందికి పైగా ప్రయాణిస్తూ ఆల్ టైమ్ రికార్డు సృష్టించడమే కాకుండా, మహిళల సాధికారతకు అడుగడుగునా అండగా నిలుస్తున్నదని వివరించారు. పథకం ప్రారంభమైన మొదటి రోజు నుంచే మహిళల నుంచి అపూర్వ స్పందన లభించింది. 2023-24 ప్రారంభ దశలోనే రోజుకు సగటున 29.42 లక్షల ప్రయాణాలు నమోదవగా, ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి రికార్డు స్థాయిలో రోజుకు దాదాపు 37.09 లక్షలకు చేరిందన్నారు. మహిళలు ప్రయాణ ఖర్చుల రూపంలో దాదాపు 2026-27 సంవత్సరానికి రూ. 2,428.47 కోట్లు పొదుపు చేసుకోవడం జరిగిందన్నారు.
ఈ పథకం సాధించిన అసాధారణ విజయానికి ప్రతీకగా నిలుస్తున్నదని వివరించారు. ఈ ప్రయాణ పొదుపుతో నేడు ఎన్నో కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం, సంతోషం చేకూరాయని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని బస్ భవన్లో అన్ని జోన్ల ఈడీలు, ఆర్ఎంలతో జరిగిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో సంస్థ వైస్ ఛైర్మెన్ , మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న ఈడీలు సిహెచ్. వెంకన్న, ఎం. రాజశేఖర్, సాలోమన్, ఖుష్రో షా ఖాన్, ఏ. శ్రీధర్, ఎఫ్ఏ విజయపుష్పలతో పాటు అన్ని రీజియన్ల ఆర్ఎంలను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఎండీ ప్రత్యేకంగా ప్రశంసించారు. పెరుగుతున్న మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించడం, పాఠశాలలు, కళాశాలల వేళల్లో విద్యార్థినులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ట్రిప్పులు నడపడం ద్వారా సంస్థ ప్రయాణికుల నమ్మకాన్ని గెలుచుకుందని తెలిపారు. మహాలక్ష్మి స్కీమ్ వల్ల బస్ సర్వీసులు తగ్గించారంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రయాణికుల రవాణా అవసరాలను గుర్తించి ఆ మేరకు బస్సులు, సౌకర్యాలు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే, ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా అన్ని రూట్లలోనూ నిరంతరాయంగా బస్సులు నడుపుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రయాణికుల అవసరాలను బట్టి మరిన్ని కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తూ, ప్రతి మహిళా ప్రయాణికురాలికి సురక్షితమైన, గౌరవప్రదమైన ప్రయాణ అనుభూతిని అందించడమే ధ్యేయంగా ఆర్టీసీ ముందుకు సాగుతున్నదని తెలియజేశారు. 2025-26 సంవత్సరం కంటే 2026-27 ఆగస్టు వరకు 96.50 లక్షల కిలోమీటర్లు అదనంగా మహాలక్ష్మి ప్రయాణికుల సౌకర్యార్థం సర్వీసులు నడపడం జరిగిందని తెలియజేశారు.



