– లేబర్ కోర్టులను రద్దు చేయొద్దు
– భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్
నవతెలంగాణ – కామారెడ్డి
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దెబ్బతీసే ప్రభుత్వ నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, జీవో నెం.12ను సవరించి సంక్షేమ పథకాలను ప్రైవేటు బీమా సంస్థలకు కాకుండా వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని ( సీఐటీయూ ) భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ( సీఐటీయూ ) భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద బీమా, మరణ పరిహారం, సహజ మరణం, శాశ్వత, పాక్షిక అంగవైకల్య పథకాలను ప్రైవేటు బీమా సంస్థల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.12 కార్మిక వ్యతిరేకమని విమర్శించారు.
జీవో విడుదలైన వెంటనే వందల కోట్ల రూపాయలను ప్రైవేటు బీమా సంస్థలకు బదిలీ చేయడం 1996 భవన నిర్మాణ కార్మికుల కేంద్ర చట్టానికి విరుద్ధమని ఆరోపించారు. అవసరం లేని సీఎస్ హెల్త్ టెస్టుల పేరుతో బోర్డు నిధులను వృథా చేస్తున్నారని, వాటిని రద్దు చేసి కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించకుండా, బోర్డు నిర్ణయాలు తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికుల కార్డులు ఇంకా రెన్యూవల్ కాకపోవడంతో వారు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివాహ కానుక, ప్రసూతి సహాయం, ఆస్పత్రి ఖర్చులు, అంత్యక్రియల సాయం వంటి పథకాలను సకాలంలో అందించడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వం వెంటనే జీవో నెం.12ను సవరించి సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని, పెండింగ్ క్లెయిమ్‌లకు వెంటనే నిధులు విడుదల చేయాలని, రెన్యూవల్ కాని కార్మికుల కార్డులను అత్యవసరంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సాయిబాబా, ఈశ్వర్, భూపతి రెడ్డి, శివరాజు, లింగం, భూమయ్య, రమేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.



