Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పల్లెల్లో గంజాయి దమ్ము..!

పల్లెల్లో గంజాయి దమ్ము..!

- Advertisement -

నవతెలంగాణ – పరకాల : పట్టణాల నుంచి పల్లెప్రాంతాలకు గంజాయి నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. ఎవరి కంటా పడకుండా రకరకాల ఎత్తుగడలు వేస్తున్న అసాంఘిక శక్తులు, ఇప్పుడు ఏకంగా గ్రామీణ శివార్లను తమ అడ్డాగా మార్చుకున్నాయి. ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు చిన్నారులను, మైనర్లను ఈ అక్రమ రవాణా రంగానికి పావులుగా వాడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కేరాఫ్ ఔట్స్ కట్ 
గతంలో ఎక్కడో మూలన జరిగే ఈ దందా, ఇప్పుడు గ్రామాల వెలుపల ఉండే నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలు,ఔట్స్ కట్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని గంజాయి దందా కొనసాగుతోంది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు రాత్రి సమయాల్లో ఈ శివార్లకే యువత పెద్ద ఎత్తున చేరుకుంటోంది. ఎలాంటి జనసంచారం లేకపోవడంతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సరఫరా దారులుగా మైనర్లు
చట్టపరమైన కఠిన శిక్షల నుంచి తప్పించుకునేందుకు ముఠాలు అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నాయి. పదేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల లోపు ఉన్న మైనర్లను గంజాయి సరఫరాదారులుగా (డెలివరీ బాయ్స్) మారుస్తున్నట్లు వినికిడి. వీరిపై పోలీసులకు అనుమానం రాకపోవడంతో బైక్‌లు, బస్సులపై ఈజీగా సరుకును ఒక చోటు నుంచి మరో చోటుకి చేరవేస్తున్నారు. కొద్దిపాటి డబ్బు ఆశ చూపి మైనర్ల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ముఠాల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.
మత్తులో జోగుతున్న యువత
ఈ సులభమైన లభ్యత కారణంగా గ్రామీణ యువత, విద్యార్థులు క్షణాల వ్యవధిలో మత్తుకు బానిసవుతున్నారు. తెల్లవారుజామునే బైక్‌లపై ఊరికి దూరంగా ఉన్న శివార్లకు వెళ్లడం, రోజంతా మత్తులో జోగడం నిత్యకృత్యమైంది. ఉన్న చదువులు వదిలేసి, తల్లిదండ్రుల కష్టాన్ని గాలికి వదిలేసి కొందరు యువకులు పెడదారి పడుతున్నారు. చిన్న వయసులోనే ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
కామారెడ్డిపల్లిలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన నలుగురు యువకులు
మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామంలో గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గ్రామ పరిధిలోని ఓ ప్రాంతంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నారనే పక్కా సమాచారంతో శనివారం గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు యువకులు గంజాయి సేవిస్తూ పట్టుబడినట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న యువకులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హనుమకొండలోనే గోపాలపురం ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన ద్వారా వెల్లడికావాల్సి ఉంది. పల్లెల్లో వేళ్లూనుకుంటున్న ఈ మత్తు భూతాన్ని తక్షణమే తుదముట్టించకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని స్థానికులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, శివారు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరుతున్నారు. పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం మార్పు వచ్చినా తల్లిదండ్రులు అప్రమత్తమై, కౌన్సెలింగ్ ఇప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -