నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్(PoJK)లో మొదటి దశ ఎన్నికల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటింగ్ జరుగుతుండగా కోట్లీ జిల్లాలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారని ‘డాన్’ పత్రిక పేర్కొంది. ‘డాన్’ కథనం ప్రకారం..మీర్పూర్ డివిజన్‌లోని 13 నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదట సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉండగా భింబర్, మీర్పూర్, కోట్లీ జిల్లాల్లో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తున్నట్లు మీర్పూర్ కమిషనర్ రాజా తాహిర్ ముంతాజ్ ఖాన్ ప్రకటించారు. అయితే కోట్లీలోని నక్యాల్ తహసీల్ పరిధిలో ఉన్న LA-9 కోట్లీ-II నియోజకవర్గంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలలో తమ పార్టీ కార్యకర్త ముఖ్తార్ యూనస్ మరణించారని PPP పేర్కొంది.
మరోవైపు PoJKలోని సుధ్నోటి, రావాలాకోట్ జిల్లాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. పబ్లిక్ యాక్షన్ కమిటీ’ (PAC) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల కారణంగా శాసనసభ ఎన్నికలు ఆగస్టు 10 వరకు వాయిదా పడ్డాయి. ఈ ప్రాంతంలో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (JAAC) నేతృత్వంలో 52 రోజులుగా సాగుతున్న నిరసన ఉద్యమం ఉధృతమవుతున్న తరుణంలో ఆ దేశ ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.



