పరకాలలో పోలీస్, వ్యవసాయ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
నవతెలంగాణ – పరకాల
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడడంతో పాటు, మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు పరకాల పట్టణంలో సోమవారం అధికారులు విస్తృత స్థాయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకాల సీఐ క్రాంతి కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఏ ఆదిరెడ్డి, ఏవో శ్రీనివాస్ నేతృత్వంలో బృందాలు పట్టణంలోని సుమారు 15 ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణ మరియు విత్తన ప్యాకెట్లపై ఉన్న గడువు తేదీలు, కంపెనీ వివరాలను అధికారులు పరిశీలించారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుమందులు విక్రయిస్తూ రైతులను మోసం చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. వ్యవసాయ సీజన్ నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా పక్కా బిల్లు తీసుకోవాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని, రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.



