Saturday, September 19, 2026
E-PAPER
Homeజాతీయంసుప్రీంకోర్టుకు దానం నాగేందర్

సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

- Advertisement -

​ఎస్ఎల్పీ దాఖలు
ప్రతివాదిగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ… రాష్ట్ర హైకోర్టు సీజే బెంచ్ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం సుప్రీంకోర్టులో దానం తరపున అడ్వొకేట్ రావి యోగేశ్ వెంకట స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్‌ కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ డైరీ నెంబర్ ఇచ్చింది. ఆదివారం కోర్టుకు సెలవు నేపథ్యంలో .. ఈ అంశాన్ని సోమవారం దానం తరపు న్యాయవాదులు సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్ చేసే ఆస్కారం ఉంది. కాగా… బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్, పార్టీ ఫిరాయించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు కంప్లైంట్ చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్… దానం చట్ట పరంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని మార్చి 11 న తీర్పు వెలువరించారు. దీన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సీజే బెంచ్… తాజాగా (శుక్రవారం) కీలక ఉత్తర్వులు ఇచ్చింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయడంతో పాటు, ఈ విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలిచిన నాటి నుంచి… ఈ అనర్హత అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. అలాగే ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఈసీకి సమాచారం ఇచ్చింది. ఈ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లనని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని దానం నాగేందర్ కామెంట్ చేశారు. అయితే… ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే… హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -